Sircilla
- ప్రేమతో చేసి పెట్టిన పునుగులు
- తన కొడుకును బలిగొంటాయని
- ఆ తల్లి ఊహించలేకపోయింది.
విధాత బ్యూరో, కరీంనగర్: పునుగులు గొంతులో ఇరుక్కుపోవడంతో, ఊపిరి ఆడక ఏడాది వయసున్న బాలుడు మృత్యువాత పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగింది. అప్పటి వరకు తమ కళ్ల ఎదుటే ఆడుతూ తిరిగిన కుమారుడు మరణించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
కుమ్రంభీం జిల్లా కౌటాల మండలం విరదండి గ్రామానికి చెందిన ఇగరపు మారుతి,కవిత దంపతులు రెండేళ్ల క్రితం ముస్తాబాద్ కు వలస వచ్చారు. ఇక్కడ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.వీరికి క్రాంతి కుమార్ అనే 13 నెలల కుమారుడు.సొమవారం రాత్రి చిన్నారికి పునుగులు తినిపించిన కవిత తనపనిలో నిమగ్నమైంది.
అయితే చిన్నారి గొంతులో పునుగులు చిక్కుకుని ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. గమనించిన తల్లి బాలున్ని ఆస్పత్రికి తీసుకవెళ్ళగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాఖీ పౌర్ణమికి సొంత ఊరు వెళదామని కవిత దంపతులు నిర్ణయించుకున్నారు.
ఇంతలోనే అల్లరుముద్దుగా పెంచుకున్న కుమారుడు మృతి చెందడంతో వారి ఆవేదన చుట్టుపక్కలవారికి కన్నీరు తెప్పిచాయి.గతంలో వీరి ఇద్దరూ కుమారులు అనారోగ్యంతో మృతి చెందారు.ప్రస్తుతం ఈ చిన్నారి మరణంతో తల్లిదండ్రులు శోకసంద్రమయ్యారు.బాలుడి మృతదేహన్ని స్వగ్రామమైన విరిదండికి తరలించారు.