Haryana | న్యూఢిల్లీ : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ తేల్చిచెప్పింది. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఆప్ పోటీ చేస్తుందని అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఇండియా కూటమి పొత్తుతో బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. హర్యానాలో ఆదివారం నిర్వహించిన ర్యాలీలో కేజ్రీవాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి పొత్తుతో బరిలో దిగుతామని, దానికి ఇతర పార్టీలతో ఒప్పందం కూడా చేసుకుంటామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోబోమని పేర్కొన్నారు. ఇక లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్, మే నెలలో జరిగే అవకాశం ఉంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది అక్టోబర్‌లో జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు మీ చేతుల్లోనే ఉన్నాయి. హర్యానాలో ఆప్‌ను గెలిపించాల్సిన బాధ్యత మీపైనే ఉంది. హర్యానాలో కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకం తనకు ఉందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆప్ ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉంది.
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 40, కాంగ్రెస్ 31, జననాయక్ జనతా పార్టీ 10 సీట్లలో గెలుపొందింది. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. జననాయక్ జనతా పార్టీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హర్యానాలో మేజిక్ ఫిగర్ 46.