Site icon vidhaatha

Adipurush | ‘ఆదిపురుష్‌’ నుంచి హనుమాన్‌ లుక్‌ విడుదల..

Adipurush |

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ భారతీయ పౌరాణిక కథ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్నది. శ్రీరామనవమి సందర్భంగా చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేయగా తాజాగా హనుమాన్‌ జయంతి సందర్భంగా హనుమంతుడి లుక్‌ను విడుదల చేసింది. ప్రభాస్ తన సోషల్ మీడియా వేదికగా ఈ పోస్టర్‌ను విడుదల చేశారు.

నటుడు దేవదత్త నాగే ఈ చిత్రంలో సినిమాలో హనుమంతుడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను ప్రభాస్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘రామ్ కే భక్త్ అవుర్ రామ్ కథ కే ప్రాణ్.. జై పవనపుత్ర హనుమాన్’ అంటూ హనుమాన్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం జూన్‌ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానున్నది.

ఇదిలా ఉండగా.. సినిమా ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి వివాదాలు చుట్టుముట్టుతున్న విషయం తెలిసిందే. భారతీయ పురాణ పురుషుడు శ్రీరాముడి పాత్రలో.. ప్రభాస్‌ నటిస్తుండగా.. చిత్రంలో ఆయన వేషధారణ నుంచి గ్రాఫిక్స్‌ వరకు విమర్శలు వెల్లువెత్తాయి.

తాజాగా ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌పై విమర్శలు వచ్చాయి. ముంబయిలో దర్శకుడితో పాటు నటీనటులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. గతంలోనే హనుమాన్‌ పాత్రపై కూడా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పోస్టర్ విడుదలవడంతో ఏం వివాదాలు వస్తాయో వేచి చూడాలి.

ఆదిపురుష్‌లో శ్రీరాముడిగా ప్రభాస్‌ నటిస్తుండగా.. సీతగా బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. టీ-సిరీస్, రెట్రోపైల్స్ బ్యానర్లలో భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ చిత్రాన్ని నిర్మించారు. సాచేత్ పరంపరా సంగీతం అందించగా.. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఏక కాలంలో జూన్‌ 16న విడుదల కానున్నది.

Exit mobile version