-సంస్థలోని మొత్తం వాటాను అమ్ముకున్న చైనా దిగ్గజం
విధాత: దేశీయ డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ పేటీఎంకు చైనా దిగ్గజ సంస్థ అలీబాబా గుడ్‌బై చెప్పింది. తొలినాళ్లలో భారీ పెట్టుబడులతో పేటీఎంకు అలీబాబా కొండంత అండగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే తర్వాతి కాలంలో క్రమేణా పేటీఎంలో తమ వాటాలను తగ్గించుకుంటూపోయింది.
ఈ క్రమంలోనే మిగిలిన 3.4 శాతం ఈక్విటీ లేదా 2.1 కోట్ల షేర్లనూ అలీబాబా శుక్రవారం అమ్మేసినట్టు ప్రముఖ వార్తా ఏజెన్సీ ఏఎన్ఐ తెలిపింది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లోని ఈ వాటాను ఓ బ్లాక్ డీల్ ద్వారా అలీబాబా అమ్ముకున్నట్టు తెలుస్తున్నది.
నిజానికి గత ఏడాది డిసెంబర్ ఆఖరు నాటికి పేటీఎంలో అలీబాబాకు 6.26 శాతం వాటా ఉన్నది. అయితే ఈ ఏడాది జనవరిలో దాదాపు 3 శాతం ఈక్విటీని ఓపెన్ మార్కెట్ రూట్ ద్వారా అమ్మేసింది. మిగిలిన వాటానూ తాజాగా అమ్మేయడంతో పేటీఎంకు అలీబాబా దూరమైనట్టైంది. ఈ పరిణామంతో పేటీఎం షేర్లు దేశీయ స్టాక్ మార్కెట్లలో 7 శాతానికిపైగా నష్టాలను చవిచూశాయి.