కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్సెస్ సందీప్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమం రసాభాసగా మారింది

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమం రసాభాసగా మారింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగంలో భాగంగా…జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రచ్చకు దారితీశాయి. మాజీ హోం మంత్రి, దివంగత ఎలిమినేటి మాధవరెడ్డికి ఉన్న పేరుతోనే సందీప్ రెడ్డి జడ్పీ చైర్మన్ అయ్యారని కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ కు సందీప్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టేజ్ పైనే ఇద్దరూ వాగ్వాదానికి దిగారు.
దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. వివాదం సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. కోమటిరెడ్డి తనపై చేసిన కామెంట్స్ పై క్షమాపణ చెప్పాలని సందీప్ రెడ్డి డిమాండ్ చేశారు. సందీప్ రెడ్డి అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు కోమటిరెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండడం తో పోలీసులు సందీప్ రెడ్డిని స్టేజ్ పై నుంచి పంపేశారు. ఆందోళనకారులను చెదరగొట్టారు.