Site icon vidhaatha

Kavitha vs KTR : కేటీఆర్ కు కవిత పంచ్..!

Kavitha

విధాత, హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుసరించిన వైఖరిపై బహిష్కృత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విబేధించారు. బీజేపీ, కాంగ్రెస్ రైతులను వేధిస్తున్నందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయించుకుందన్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు భిన్నంగా కవిత స్పందించారు. మంగళవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి, వీరనారి చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమాల సందర్భంగా వారి చిత్ర పటాలకు కవిత నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ సాధకను కృషి చేసిన వ్యక్తి..తెలంగాణ తెలుగు బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి జాగృతి మద్దతు తెలుపుతుందన్నారు. జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని..ఆయన ఉప రాష్ట్రపతిగా ఎన్నికైతే ఆ పదవికి వన్నె తెస్తారన్నారు.

కేసీఆర్ అజెండా సాధనకు జాగృతి కృషి

మాజీ సీఎం కేసీఆర్‌ అజెండాను తెలంగాణ జాగృతి తరఫున ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. సామాజిక తెలంగాణ సాధనే తెలంగాణ జాగృతి ధ్యేయమన్న కవిత.. సామాజిక తెలంగాణ సాధించే వరకు జాగృతి కార్యకర్తలు విశ్రమించబోరన్నారు. సామాజిక తెలంగాణ సాధన కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతాం అని స్పష్టం చేశారు. ఉన్నతమైన ఆశయాలతో అడుగు వేయాలని ఆలోచిస్తున్నాం అని..ఉన్నతమైన లక్ష్యం దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయని భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ కు గోదావరి జలాల స్కీమ్ భారీ కుంభకోణం

హైదరాబాద్ కు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టు ఓ భారీ కుంభకోణం అని..సీఎం రేవంత్ రెడ్డి మేఘా కృష్ణారెడ్డితో కుమ్మక్కయ్యి అంచనా వ్యయం అమాంతం పెంచి కాంట్రాక్టును కట్టబెట్టాడని కవిత ఆరోపించారు. రూ.1500 కోట్లతో రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్టును రూ.7360 కోట్లకు పెంచి మేఘా కంపెనీకి ధారాదత్తం చేసిన రేవంత్ రెడ్డి..హైదరాబాద్ కు దగ్గర్లో ఉండే కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని తీసుకునే అవకాశం ఉన్నా మల్లన్న సాగర్ కు ప్రాజెక్టుకు ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

కాళోజీ స్ఫూర్తితోనే అందరమూ పని చేశాం.. పని చేస్తాం అని కవిత స్పష్టం చేశారు. ఐలమ్మ స్ఫూర్తితో అందరూ విజృంభించి అన్యాయాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళ అనుకుంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కవిత పేర్కొన్నారు.

 

Exit mobile version