Alluri Jayanti
- అల్లూరి పోరాటం.. దేశానికే స్ఫూర్తి
- మహనీయుల చరిత్ర భావితరాలకు అందించాలి
- సుభాష్ చంద్రబోస్ లానే ఆయనో స్ఫూర్తిదాత
- అల్లూరి 125వ జయంతి ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి
- మహాత్ముడు సైతం ప్రశంసించిన విప్లవవీరుడు: కేసీఆర్
- నివాళులర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్
విధాత : మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పోరాటం యావత్ దేశ ప్రజల్లో ఆనాడు స్ఫూర్తి నింపిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆయన దేశ భక్తి అసమానమని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో అల్లూరి 125వ జయంతి వేడుకల ముగింపు ఉత్సవం నిర్వహించారు.
జయంతి వేడుకలను గత ఏడాది భీమవరంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించగా.. ముగింపు వేడుకలకు రాష్ట్రపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటం తరహాలోనే అల్లూరి పోరాటం కూడా దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపిందని చెప్పారు. ఒక ప్రత్యేకమైన యుద్ధ నైపుణ్యంతో నాటి బ్రిటిష్ పాలకులపై అల్లూరి సీతారామరాజు పోరాటం చేశారన్న ముర్ము.. నాటి మహనీయుల చరిత్రలను భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
అల్లూరికి నివాళులు అర్పించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ చెప్పారు. తెలుగులో మాట్లాడిన తమిళిసై.. అల్లూరి ప్రజలకు స్ఫూర్తిదాత అన్నారు. 125వ జయంతి ఉత్సవాల్లో భాగస్వామినైనందుకు ఆనందంగా ఉందన్నారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ.. తెల్లవారి గుండెల్లో నిదురించిన వాడా.. అని అల్లూరి సీతారామరాజుపై ప్రముఖ కవి శ్రీశ్రీ రాసిన పాటను ఉద్యమ సమయంలో కారులో వినే వాడినని తెలిపారు. అల్లూరిది గొప్ప చరిత్ర అన్నారు. 26 ఏండ్లకే యుద్ధరంగంలోకి దూకి, భగత్ సింగ్ లాంటి యోధుల కంటే తెలుగు వారు తక్కువేమీ కాదని చూపించారన్నారు.
అహింసావాది అయిన మహాత్మాగాంధీ సైతం అల్లూరిని ప్రశింసించకుండా ఉండలేకపోయారన్నారు. అల్లూరి తిరిగిన ప్రాంతాలను క్షత్రియ సమాజ సేవా సమితిలో కలిసి కేంద్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు.
ఈ సందర్భంగా భీమవరంలోని అల్లూరి స్మ్రతి వనాన్ని, అల్లూరి కాంస్య విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్‌గా ప్రారంభించారు. అల్లూరి చరిత్రను భావి తరాలకు తెలియజేసేలా రూపొందించిన త్రీడీ యానిమేషన్ ఫిల్మ్‌ను ప్రదర్శించారు. ప్రముఖ పారశ్రామికవేత్త అల్లూరి సీతారామరాజును ప్రత్యేకంగా సన్మానించారు.30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని రూపొందించిన బుర్రా ప్రసాద్‌నూ సత్కరించారు.