Site icon vidhaatha

Manipur | మ‌ణిపుర్‌లో అంబులెన్స్‌కు నిప్పు.. ఏడేళ్ల బాలుడి స‌హా ముగ్గురు సజీవ దహనం

విధాత‌ : బీజేపీ పాలిత మ‌ణిపూర్‌లో హింసాకాండ రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్న‌ది. రెండు తెగల మ‌ధ్య మొద‌లైన ఘ‌ర్ష‌ణ‌ల‌తో అట్టుడుకుగున్న మ‌ణిపూర్‌లో మ‌రో దారుణం జ‌రిగింది. ఆందోళ‌న‌కారులు అంబులెన్స్‌కు నిప్పు పెట్ట‌డంతో ఏడేండ్ల బాలుడు, అత‌డి త‌ల్లితోపాటు స‌మీప బంధువు స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. అనంత‌రం అంబులెన్స్‌ను ప‌రిశీలించ‌గా ఎముక‌లు మాత్ర‌మే క‌నిపించాయి. ఇంత దారుణ‌మైన ప‌రిస్థితులు మ‌ణిపూర్‌లో కొన‌సాగుతున్నాయి. అస‌లు ఏం జ‌రిగిందంటే..

పశ్చిమ ఇంఫాల్‌లోని ఇరోసింబా ప్రాంతంలోని ఓ శరణార్థుల శిబిరం సమీపంలో ఈ నెల 4వ తేదీన (ఆదివారం సాయంత్రం) మెయితీ–కుకీ వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ క్ర‌మంలో ఒక బులెట్ బాలుడు తాన్సింగ్ (7) త‌ల‌లోకి దూసుకెళ్లింది. అత‌డి త‌ల్లి మీనా హాంగ్‌సింగ్ చేతికి కూడా మ‌రో బుల్లెట్ త‌గింది. వారికి హుటాహుటిన ద‌వాఖాన‌కు త‌ర‌లించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

బాలుడు తాన్సింగ్, అత‌డి తల్లి మీనా, వీరికి స‌హాయంగా బంధువు లిడియా లౌరెంబెమ్ ను అంబులెన్స్‌లోకి పోలీసులు ఎక్కించారు. ఇంఫాల్ ద‌వాఖాన‌కు తరలించడానికి అస్సాం రైఫిల్స్ ఆఫీసర్ ఏర్పాట్లు చేశారు. కొంతదూరం వరకు అస్సాం రైఫిల్స్ అంబులెన్స్‌కు ఎస్కార్ట్ ఉన్నారు. ఆ తరువాత స్థానిక పోలీస్‌లు ఎస్కార్ట్ బాధ్యత తీసుకున్నారు.

ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు కుకీగ్రామాలున్న ఇరోయిసెంటా ప్రాంతానికి అంబులెన్స్ చేరగానే పెద్ద సంఖ్య‌లో ఆందోళ‌న‌కారులు అంబులెన్స్‌ను చుట్టుముట్టారు. డ్రైవ‌ర్‌తోపాటు ముందు కూర్చున్న మ‌రో వ్య‌క్తి అంబులెన్స్ దిగి త‌ప్పించుకున్నారు. బాలుడి, అత‌డి త‌ల్లి, వారి బంధువు అందులో ఉండ‌గానే దుండ‌గులు అంబులెన్స్‌కు నిప్పు అంటించారు. ముగ్గురు అందులోనే స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. మృతులను ఏడేండ్ల‌ టోన్సింగ్, అతడి తల్లి మీనా, బంధువు లిడియా లౌరెంబెమ్‌గా గుర్తించారు.

గ‌త నెల 27న రెండు వ‌ర్గాల మరోసారి ఘ‌ర్ష‌ణ చెల‌రేగింది. నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన హింసా కాండ‌లో సుమారు 80 మంది చ‌నిపోయారు. మ‌రో 35,000 మంది నిరాశ్రులయ్యారు. మ‌ణిపూర్‌లో ఇంత జ‌రుగుతున్నా కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు చోద్యం చూస్తున్న‌ద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.

Exit mobile version