Site icon vidhaatha

Pregnant Woman | అంబులెన్స్ కోసం 7 కి.మీ. న‌డిచిన నిండు గ‌ర్భిణి

Pregnant Woman | ఇది హృద‌య విదార‌కం. ఓ గ‌ర్భిణికి నెల‌లు నిండ‌డంతో.. ఆమెకు పురిటినొప్పులు వ‌చ్చాయి. ఆస్ప‌త్రికి వెళ్దామంటే అంబులెన్స్ అందుబాటులో లేదు. దీంతో దిక్కుతోచ‌ని స్థితిలో ఓ వైపు పురిటినొప్పులు భ‌రిస్తూనే.. త‌న భ‌ర్త స‌హ‌కారంతో మ‌రో వైపు అంబులెన్స్ కోసం ఏకంగా 7 కిలోమీట‌ర్లు న‌డిచింది గ‌ర్భిణి.

వివ‌రాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌లోని హ‌జారీబాగ్ జిల్లాలోని ద‌రిదధార్ పంచాయ‌తీకి చెందిన మున్నీ దేవికి నెల‌లు నిండాయి. దీంతో గురువారం ఆమెకు పురిటినొప్పులు వ‌చ్చాయి. ఇక ఆ ఊరు కొండ ప్రాంతంలో ఉండ‌టంతో స‌రైన ర‌వాణా సౌక‌ర్యం లేదు. దీంతో అంబులెన్స్ కోసం మున్ని దేవీ త‌న భ‌ర్త స‌హ‌కారంతో 7 కిలోమీట‌ర్లు న‌డిచింది.

చివ‌ర‌కు అంబులెన్స్ వ‌ద్ద‌కు చేరుకుని ఆస్ప‌త్రికి చేరుకుంది. మొత్తానికి ఆమె డెలివ‌రీ కాగా, త‌ల్లీబిడ్డ క్షేమంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. అయితే త‌మ గ్రామాల‌కు రోడ్డు మార్గం క‌ల్పించి, ర‌వాణా సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు.

ద‌రిద‌ధార్ గ్రామం.. కొడెర్మ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అన్న‌పూర్ణ దేవీ ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌గా, ఆమె ప్ర‌స్తుతం కేంద్ర కేబినెట్‌లో ఉన్న‌త విద్యా స‌హాయ మంత్రిగా కొన‌సాగుతున్నారు.

Exit mobile version