Site icon vidhaatha

Telangana Cabinet Expansion: కాంగ్రెస్ లో ఆగని మంత్రి పదవుల లొల్లి!..హైకమాండ్ కు మరో లేఖ!!

Telangana Cabinet Expansion: కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ లొల్లి టీవీ సీరియల్ మాదిరిగా కొనసాగుతుంది. ఇదిగో అదిగో అంటూ వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ ప్రహాసన పర్వంలో మాకంటే మాకే..మంత్రి పదవులు ఇవ్వాలంటూ ఆశావహులు తరుచు తమ గళం వినిపిస్తునే ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమసాగర్ రావు, వివేక్, బాలునాయక్ వంటి వారు తమకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ కాస్తా కటువుగానే చెప్పారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు తమలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానానికి లేఖ రాయగా..ఎస్టీ ఎమ్మెల్యేలు తమకు విస్తరణలో మంత్రి పదవి ఇవ్వాలని లేఖ రాశారు. మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలకు ప్రాతినిథ్యం ఇవ్వాలని ఆ వర్గం ఎమ్మెల్యేలు అంతా తమ డిమాండ్ తో మరో లేఖ రాశారు. ముదిరాజ్ లకు మంత్రి పదవి ఇవ్వాలని ఆ వర్గం ఎమ్మెల్యేలు సైతం పట్టుబట్టారు. వాటన్నింటి మధ్య..జిల్లాలు, సామాజిక సమీకరణలు..రాజకీయ పరమైన అవసరాలు..గత హామీలు వంటి విశ్లేషణల నేపథ్యంలో మంత్రి పదవుల కేటాయింపుకు కసరత్తు చేసిన పార్టీ అధిష్టానం చివరి నిమిషంలో విస్తరణపై వెనకడుగు వేసింది. దీంతో మంత్రివర్గ విస్తరణ మళ్లీ పెండింగ్ లో పడగా.. మంత్రిపదవుల లొల్లి సైతం సద్ధుమణిగింది.

 

అయితే తాజాగా మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలంటూ మరోసారి ఆ సామాజిక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. తమ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జన్ ఖర్గే కు, సీఎం రేవంత్ రెడ్డిలకు మరోసారి లేఖ రాశారు. లేఖ రాసిన వారిలో ఎమ్మెల్యేలు మందుల సామేలు, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్మణ్, లక్మీకాంతరావు, కాలే యాదయ్యలు ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం దళిత జనాభాలో మాదిగ వర్గం 47 లక్షల మంది.. దళిత ఓటర్లలో 60 శాతం మంది ఉన్నారు. వారికి పార్లమెంటు ఎన్నికల్లోనూ ఒక్కసీటుకేటాయించలేదు. కేబినెట్ విస్తరణలో ఒక దళిత ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వనుండటంతో అది మాకే కావాలని మాల, మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు.

Exit mobile version