Transgenders’ Fire : తెలంగాణ అసెంబ్లీలో ఉద్యోగ కల్పన వివరాలు వెల్లడించే క్రమంలో మంత్రి శ్రీధర్ బాబు ట్రాన్స్ జెండర్ల కు కూడా ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు కల్పించామని చెప్పిన సందర్భంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొల్లున నవ్వడం వివాదంగా మారింది. అసెంబ్లీలో మా ప్రస్తావన రాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు నవ్వారంటూ ట్రాన్స్ జెండర్ ట్రాఫిక్ అసిస్టెంట్లు మండిపడుతున్నారు.
శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరును తప్పుబట్టారు. సభలో మమ్మల్ని పరిహసించి మా మనోభావాలు గాయపరుస్తారా అంటూ ట్రాన్స్ జెండర్ ట్రాఫిక్ అసిస్టెంట్లు మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండి మీరు మాకు ఏం చేశారు ? ఏ రోజైనా మీ నోట్లో నుంచి ట్రాన్స్ జెండర్ అనే పదం వచ్చిందా? అని ప్రశ్నించారు. అందరి లాగే మేము కూడా మనుషులమే కదా ? మాకూ మనోభావాలు ఉంటాయి కదా? అని స్పష్టం చేశారు. అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు మా పైలట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతుంటే మీకు ఎందుకు నవ్వొచ్చిందని ప్రశ్నించారు.
మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చి పోయినప్పటికి ఎవరు కూడా ట్రాన్స్ జెండర్ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పట్టించుకోలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఉద్యోగాలివ్వడాన్ని అంతా స్వాగతించాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు మమ్మల్ని కించపరచకుండా అందరు మనుషుల్లాగానే సమానంగా చూడండన్నారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గృహ ప్రవేశం చేసినా, బోనాల పండుగలు చేసినా మా ట్రాన్స్ జెండర్లు వచ్చి ఆశీర్వదించిన సంగతి మరువరాదన్నారు. దయచేసి ఇంకోసారి మమ్మల్ని కించ పరిచే విధంగా ప్రవర్తించకండని ట్రాన్స్ జెండర్ ట్రాఫిక్ అసిస్టెంట్లు బీఆర్ఎస్ నాయకులను కోరారు.