Bandla and Hyper Aadi | బండ్లను మించుతున్న ఆది భజన.. చివరి వరకు ఉంటాడా!

<p>Bandla and Hyper Aadi | ప్రీ రిలీజ్ ఈవెంట్సా? భజన కార్యక్రమాలా? మెగా ఫ్యామిలీలోని స్టార్ హీరోల చిత్రాలకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే భయపడే స్థితికి తీసుకొస్తున్నారు కొందరు. ప్రీ రిలీజ్ అంటే ఏమిటి? ఆ సినిమాలో ఉన్న విషయం ఏమిటి? సినిమాకు ఎవరెవరు ఎంత సపోర్ట్ అందించారు? వంటి విషయాలను తెలిపే వేదిక. అలాంటిది ఇప్పుడు భజనలు చేసే మందిరంలా అయిపోయాయి. ఇంకా ఈ ఈవెంట్స్‌లో రాజకీయాలు ఈ మధ్య ఎక్కువగా […]</p>

Bandla and Hyper Aadi |

ప్రీ రిలీజ్ ఈవెంట్సా? భజన కార్యక్రమాలా?

మెగా ఫ్యామిలీలోని స్టార్ హీరోల చిత్రాలకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే భయపడే స్థితికి తీసుకొస్తున్నారు కొందరు. ప్రీ రిలీజ్ అంటే ఏమిటి? ఆ సినిమాలో ఉన్న విషయం ఏమిటి? సినిమాకు ఎవరెవరు ఎంత సపోర్ట్ అందించారు? వంటి విషయాలను తెలిపే వేదిక. అలాంటిది ఇప్పుడు భజనలు చేసే మందిరంలా అయిపోయాయి.

ఇంకా ఈ ఈవెంట్స్‌లో రాజకీయాలు ఈ మధ్య ఎక్కువగా చొరబడి పోయాయి. అభిమాన హీరో ఎదురుగా ఉంటే.. మాట్లాడాలని అందరికీ అనిపిస్తుంది.. అందులో తప్పులేదు. కానీ ఏం మాట్లాడుతున్నామనేది ఇక్కడ ముఖ్యం. అంతేకానీ.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి.. ఆ ఎదురుగా కూర్చున్న వారిని కూడా ఇబ్బంది పెడితే ఎలా? ఇప్పుడదే జరుగుతుంది. మొన్న బండ్ల గణేష్.. నిన్న హైపర్ ఆది చేసింది.. చేస్తుంది ఇదే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎదురుగా ఉంటే చాలు.. బండ్ల గణేష్‌ని పట్టుకోవడం, ఆపడం ఎవరితరం కాదు. శివుడు ముందు నందిలా తనని తాను ఊహించుకుంటూ.. ప్రపంచంలోని శాస్త్రవేత్తలు, దేవుళ్లు ఇలా ఒక్కటేమిటి.. అందరినీ చుట్టేసి పవన్ కళ్యాణ్ ముందు పెడతాడు. అలా ఉంటుంది బండ్ల స్పీచ్. అయితే బండ్ల స్పీచ్.. కాస్త కామెడీగా ఉంటూ.. అందరినీ నవ్విస్తుంటుంది.

కానీ హైపర్ ఆది విషయంలో మాత్రం.. ఆ భజన.. ఆయన అభిమానించే వారి పర్సనల్ లైఫ్‌ని కూడా కెలుకుతున్నట్లుగా ఉంటుంది. అందుకు ఉదాహరణ రీసెంట్‌గా జరిగిన ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ వేడుకే. తను అభిమానించే హీరో సినిమాలో అవకాశం దొరకడమే గొప్ప అని ధన్యవాదాలు చెప్పి స్టేజ్ దిగిపోకుండా.. అంతా మరిచిపోయిన, మసకబారిపోయిన మెగాస్టార్‌ లైఫ్‌లోని ఇబ్బంది పెట్టే కొన్ని విషయాలను తవ్వి తీసి మరి ఇబ్బంది పెట్టేశాడు.

మెగాస్టార్ చిరంజీవి గొప్ప నటుడు.. దీనిపై ఎవరో సర్టిఫికెట్ ఇవ్వవలసిన అవసరమే లేదు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని అంతకన్నా లేదు. ఇక ఆయన సినిమాల కలెక్షన్స్, హిట్స్, ఫ్లాప్స్ ఇవన్నీ ఆయనకేం కొత్తకాదు. ఆయన చూడని హిట్సా, ఆయన కొట్టని బ్లాక్‌బస్టర్సా? ఇవన్నీ అలా ఉంటే.. ఆయన రాజకీయ జీవితం గురించి, ఆయనపై వచ్చిన వివాదాల గురించి కూడా అందరికీ తెలుసు.

సమయాన్ని బట్టి ఆ వివాదాలు వాటంతట అవే సర్దుమణిగి పోతాయని చిరునవ్వుతో ఆయన కామ్‌గా వదిలేస్తుంటారు. అది నిజం కూడా.. అందుకు సాక్ష్యం రీసెంట్‌గా జీవితా రాజశేఖర్‌లకు జైలు శిక్ష పడటమే. అయితే ఈ విషయాలన్నింటినీ పదే పదే పబ్లిగ్గా చెప్పి.. ఆయన పేరుని, స్థాయిని దించేస్తున్నారు హైపర్ ఆది లాంటి వాళ్లు.

ముఖ్యంగా భజన చేసి.. ఆయన పంచన చేరుదామని చూస్తున్నారు. ఇలాంటి వారి విషయంలో మెగా ఫ్యామిలీ కాస్త అప్రమత్తంగా ఉండాలి. అందుకే బండ్లని పవన్ కళ్యాణ్ ఎంత వరకు ఉంచాలో అంత వరకే ఉంచుతాడు. చిరంజీవి కూడా ఈ మెలికను అర్థం చేసుకోవాలి.. లేదంటే ఇలాంటి వారి భజనతో మీరు కూడా బోర్ కొట్టేస్తారు.. చూసుకోండి మరి.