Bandla Ganesh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేయడంతో… ఈ సినిమా టీమ్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ఈ విజయం సందర్భంగా దర్శకుడు సుజీత్‌కు పవన్ కళ్యాణ్ లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయాన్ని సుజీత్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. లగ్జరీ కారుతో తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ ఆయన భావోద్వేగంగా స్పందించారు. ఇది నాకు లభించిన అత్యుత్తమ బహుమతి. మాటల్లో చెప్పలేనంతగా ఉబ్బితబ్బిబ్బయ్యాను. కృతజ్ఞతతో నిండిపోయాను. నా ప్రియమైన ఓజీ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రేమ, ప్రోత్సాహమే నాకు అన్నిటికంటే గొప్పది. చిన్నప్పటి నుంచీ ఆయన అభిమానిగా ఉన్న నాకు, ఈ రోజు ఈ ప్రత్యేక క్షణం దక్కింది. ఆయనకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను” అంటూ సుజీత్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
సుజీత్ ట్వీట్‌కు నిర్మాత బండ్ల గణేష్ చేసిన రీట్వీట్ ఈ వ్యవహారాన్ని మరింత భావోద్వేగంగా మార్చింది. “కంగ్రాట్యులేషన్స్… మీకు వారు కారు ఇచ్చారు… నాకు జీవితమే ఇచ్చారు” అంటూ బండ్ల గణేష్ చేసిన కామెంట్ నెటిజన్లను కదిలించింది. పవన్ కళ్యాణ్‌తో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేస్తూ చేసిన ఈ ట్వీట్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వచ్చింది. ఈ మధ్య పవన్ కళ్యాణ్‌కి, బండ్ల గణేష్‌కి పడడం లేదనే ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ తాజా ట్వీట్ పుకార్లకి చెక్ పెట్టింది. కాగా, పవన్ కళ్యాణ్‌తో బండ్ల గణేష్‌కు ఉన్న బంధం కొత్తది కాదు. నిర్మాతగా బండ్ల గణేష్ కెరీర్‌లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ‘తీన్ మార్’, ‘గబ్బర్ సింగ్’ వంటి చిత్రాలతో బండ్ల గణేష్ నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘గబ్బర్ సింగ్’ విజయం తన జీవితాన్నే మార్చేసిందని బండ్ల గణేష్ పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. అందుకే పవన్ కళ్యాణ్‌ను తన జీవితానికి టర్నింగ్ పాయింట్‌గా ఆయన ఎప్పటికీ గుర్తు చేసుకుంటుంటారు.
ఇటీవల దీపావళి సందర్భంగా బండ్ల గణేష్ ఇచ్చిన గ్రాండ్ పార్టీ కూడా టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. పలువురు సినీ ప్రముఖులు హాజరైన ఆ వేడుకలో ఆయన ఉత్సాహంగా కనిపించడంతో… మళ్లీ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే ఆ వార్తలను బండ్ల గణేష్ ఖండించారు. మొత్తానికి ‘ఓజీ’ విజయం పవన్ కళ్యాణ్, సుజీత్‌ల మధ్య ఉన్న బంధాన్ని మరోసారి బయటపెట్టడమే కాకుండా… టాలీవుడ్‌లో కృతజ్ఞత, అభిమానం అంటే ఏమిటో చూపించిందని అభిమానులు అంటున్నారు.
