Bandi Sanjay | బండి సంజయ్ అరెస్టు మర్మం? హై డ్రామా వెనుక రాజకీయ కోణాలున్నాయా?

ప్రధాని పర్యటనకు ముందు బండి లోపలికి విధాత: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం మంగళవారం అర్ధరాత్రి మొదలు అనేక మలుపులు తిరుగుతున్నది. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు ముందు బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కరీనంగర్ ఎంపి బండి సంజయ్ (Bandi Sanjay) ను అరెస్టు చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా ప్రధాని పర్యటనకు మూడు రోజుల ముందు అరెస్టు చేయడంలో ఏమైనా పొలిటికల్ మైలేజీ ఉందా? మరేదైనా కారణాలు ఉన్నాయా? అనేది […]

  • Publish Date - April 6, 2023 / 12:08 PM IST

  • ప్రధాని పర్యటనకు ముందు బండి లోపలికి

విధాత: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం మంగళవారం అర్ధరాత్రి మొదలు అనేక మలుపులు తిరుగుతున్నది. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు ముందు బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కరీనంగర్ ఎంపి బండి సంజయ్ (Bandi Sanjay) ను అరెస్టు చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా ప్రధాని పర్యటనకు మూడు రోజుల ముందు అరెస్టు చేయడంలో ఏమైనా పొలిటికల్ మైలేజీ ఉందా? మరేదైనా కారణాలు ఉన్నాయా? అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

బిఆర్ఎస్, బీజేపీ పరస్పర ఆరోపణలు

ఈ అరెస్టుపై బిఆర్ఎస్, బిజెపి నాయకులు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండగా… రెండు పార్టీలు కూడబలుక్కుని అరెస్టు డ్రామా ను తెరమీదకి తెచ్చాయని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. రెండు పార్టీలు కూడబలుక్కుని విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయనే అనుమానాలు ప్రజల్లో సైతం వ్యక్తమవుతున్నాయి.

అర్ధరాత్రి అరెస్టుతో హై డ్రామా

పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ ప్రధాన కుట్రదారుడిగా పోలీసులు అభియోగం మోపారు. వరంగల్ పోలీసు కమిషనర్ కార్యాలయం పరిధిలోని కమలాపూర్ లో ఒక పరీక్షా కేంద్రంలో జరిగిన లీకేజీ కేసులో బండి సంజయ్ ను ప్రధాన నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. ఆయన ప్రోద్భలంతోనే మిగతా వ్యక్తులు పరీక్షా కేంద్రం నుంచి దొంగతనంగా సేకరించి వాట్సప్ ద్వారా హిందీ పేపర్ ప్రశ్నపత్రాన్ని షేర్ చేశారని పోలీసులు చెబుతున్నారు.

ఈ ఘటనపై వరంగల్ పోలీసులు ప్రాథమికంగా ఆధారాలు సేకరించి మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్ లో బండి సంజయ్ ను ఆయన నివాసంలో అరెస్టు చేశారు. అర్ధరాత్రి మొదలైన అరెస్టు డ్రామా బుధవారం రాత్రి వరకు కొనసాగింది. కోర్టుకు సెలవు కావడంతో బుధవారం రాత్రి హన్మకొండలోని సుబేదారి లోని జిల్లా ప్రధాన మున్సిఫ్ మెజిస్ట్రేట్ రాపోలు అనిత నివాసంలో సంజయ్ ను హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ తరువాత సంజయ్ ను కరీంనగర్ జైలుకు తరలించారు. సుమారు ఇరవై గంటల పాటు అటు రాష్ట్ర ప్రజల్లో ఇటు మీడియాలో చర్చ నడిచే విధంగా అరెస్టు హైడ్రామా రక్తి కట్టించారనే గుసగుసలు విన్పిస్తున్నాయి.

అడుగడుగునా ఉద్రిక్తత

బండి సంజయ్ ను అరెస్టు చేసిన తరువాత నేరుగా వరంగల్ కు తీసుకు రాకుండా యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లడం, అక్కడికి మీడియా ప్రతినిధులను, బిజెపి నాయకులను రానివ్వకుండా అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పాలకుర్తిలో వైద్య పరీక్షల తరువాత జఫర్ గఢ్ మీదుగా మడికొండ లోని సిటీ పోలీసు ట్రైనింగ్ సెంటర్ కు సంజయ్ ను భారీ భద్రత నడుమ తరలించారు.

అనంత‌రం సాయంత్రం హన్మకొండలోని మెజిస్ట్రేట్ రాపోలు అనిత నివాసానికి తీసుకువెళ్లి ప్రవేశపెట్టగా, 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు విధించిన విషయం తెలిసిందే. మరోవైపు బిజెపి ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్ లను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. హైకోర్టులో కేసు వాదించేందుకు వెళ్తున్న తనను అక్రమంగా నిర్భంధించారంటూ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆరోపించారు.

టీఎస్పీఎస్సీ కేసులో ఇంత హడావుడి లేదేం?

ఈ ఎపిసోడ్ చూసిన తరువాత టీఎస్పీఎస్సీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇంత దూకుడుగా ఎందుకు వ్యవహరించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముప్పై లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మెతకగా ఉందనే విమర్శలు ఉన్నాయి.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ను అర్థరాత్రి అరెస్టు చేసి టిఎస్ పిఎస్సీ, ఢిల్లీ లిక్కర్ స్కాం అంశాలను తెర మరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రెండు పార్టీలు ముందుగా రచించుకున్న స్క్రిప్టు ప్రకారమే సంజయ్ అరెస్టు హైడ్రామాను రక్తి కట్టించారని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు.

Latest News