Nagarjunasagar |
- చోద్యం చూస్తున్న అధికారులు
- డ్యాం అత్యవసరాలకు మట్టి కొరత
విధాత: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నాగార్జునసార్ డివిజన్ పరిధిలో పైలాన్ కాలనీ వైకుంఠదామం దిగువ ప్రాంతం నుంచి పట్టపగలు ట్రాక్టర్లు పెట్టి జేసిబీతో మట్టిని అనుమతులు లేకుండా అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ప్రజల స్వంత అవసరాలకో, ప్రభుత్వ అవసరాలకో కాదు. వ్యాపారం చేసేందుకు మట్టిని పట్టపగలు తరలిస్తున్నారు. లోతైన గుంతలు పెట్టి మట్టిని వందల ట్రాక్టర్లు తరలిస్తున్నారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్నప్పటికి అటవీశాఖ అధికారులు గానీ, సాగర్ డ్యాం అధికారులు గానీ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.
మట్టి అక్రమ త్రవ్వకాల ప్రాంతం ఎక్కడో కాదు.. బహుళార్థసాధక ప్రాజెక్టయిన నాగార్జునసాగర్ ఎర్త్ డ్యాం దిగువననే ఈ అక్రమాలు జరుగుతున్నాయి. అత్యవసర సమయంలో ఎర్త్ డ్యాంకు మట్టి అవసరమైతే దగ్గరి ప్రాంతంలో ఎక్కడ దొరికే పరిస్థితి లేకుండా పోతుంది.
ఇప్పటికే రోడ్డు వెంట కూడా 5 నుంచి 10మీటర్ల లోతు గుంతలు పెట్టి మట్టిని ఎత్తారు. రోడ్డు వెంట కంప చెట్లను చాటు చేసుకోని మట్టిని తవ్వారు. ఈ ప్రాంతంలో వాహనాలు రోడ్డు దిగితే పల్టీకొట్టే విధంగా గుంతలు ఏర్పడ్డాయి. మట్టిని తరలించే వారిని ప్రశ్నించగా ఫారెస్ట్ అధికారులు అనుమతితోనే ఎప్పటినుండో మట్టి తోలుకుంటున్నామనే సమాధానం రావడo గమనార్హం.
కేవలం అటవీశాఖ అధికారుల కనుసన్నలలో మెలుగుతున్న వారే మట్టిని విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో సంబంధిత శాఖ అధికారులను వివరణ కోరగా మట్టి త్రవ్వకాలు జరుగుతున్న ప్రదేశం నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోకి వస్తుందని ప్రాజెక్ట్ అధికారులతో చర్చించి విచారణ చేస్తామని తెలిపారు.