Dharani | ధరణి కంటే అవే బెటర్‌! రాజస్థాన్‌లో టైటిల్‌ గ్యారెంటీ చట్టం.. అదే బాటలో ఏపీ

Dharani | మెరుగ్గా యూపీ, బీహార్‌ భూమి చట్టాలు యూపీలో రెవెన్యూ కోడ్-2006 అమలు బీహార్‌లో భూవివాదాల పరిష్కార చట్టం అనుబంధంగా ల్యాండ్‌ ట్రిబ్యునల్‌ యాక్టు రాజస్థాన్‌లో టైటిల్‌ గ్యారెంటీ చట్టం అమలు టైటిల్‌ గ్యారెంటీ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం రాష్ట్రపతి ఆమోదం పొందితే అమల్లోకి చట్టం క‌ర్ణాట‌క‌లో భూమి, కావేరి చ‌ట్టాల అమలు దానితో పాటు దిశాంక్ యాప్‌లో సేవలు ఒరిస్సాలో కొత్త భూచట్టానికి అసెంబ్లీ కమిటీ గ్రామస్థాయిలో రిసోర్స్‌ పర్సన్స్‌ నియామకం తెలంగాణలో […]

  • Publish Date - June 13, 2023 / 03:51 AM IST

Dharani |

  • మెరుగ్గా యూపీ, బీహార్‌ భూమి చట్టాలు
  • యూపీలో రెవెన్యూ కోడ్-2006 అమలు
  • బీహార్‌లో భూవివాదాల పరిష్కార చట్టం
  • అనుబంధంగా ల్యాండ్‌ ట్రిబ్యునల్‌ యాక్టు
  • రాజస్థాన్‌లో టైటిల్‌ గ్యారెంటీ చట్టం అమలు
  • టైటిల్‌ గ్యారెంటీ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
  • రాష్ట్రపతి ఆమోదం పొందితే అమల్లోకి చట్టం
  • క‌ర్ణాట‌క‌లో భూమి, కావేరి చ‌ట్టాల అమలు
  • దానితో పాటు దిశాంక్ యాప్‌లో సేవలు
  • ఒరిస్సాలో కొత్త భూచట్టానికి అసెంబ్లీ కమిటీ
  • గ్రామస్థాయిలో రిసోర్స్‌ పర్సన్స్‌ నియామకం
  • తెలంగాణలో భూ సమస్యకు సివిల్‌ కోర్టే దిక్కు
  • ప్రభుత్వ పరిధిలో లేని పరిష్కార వేదిక
  • మండల, డివిజనల్, జిల్లా రెవెన్యూ కోర్టులు రద్దు
  • మరి రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు ఎన్నడు?

రాష్ట్రంలోని రైతుల భూమికి రాష్ట్ర ప్రభుత్వమే జిమ్మేదారుగా ఉంటుంది. భూ యాజమాన్య హక్కులకు ప్రభుత్వమే గ్యారంటీ ఉండాలి. భూములకు ఒకటే రికార్డు ఉండాలి. భూముల హక్కులకు ఎలాంటి నష్టం జగినా ఇన్సురెన్స్‌ వచ్చేలా రాష్ట్రంలో కొత్తగా టైటిల్‌ గ్యారంటీ చట్టాన్ని రూపొందిస్తాం. గతంలో ఖమ్మం, మానుకోటలో జరిగిన బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

మానవ నాగరికతలో స్థిర నివాసం, స్థిర వ్యవసాయం మొదలైనప్పుడు భూములకు హద్దులు, భూమి హక్కుల అంశాలపై దృష్టి సారించడం మొదలైంది. ఆ వ్యవసాయ, నివాస భూములపై శిస్తుల రూపంలో ప్రభుత్వాలు/రాజులు ఆదాయాన్ని ఆశించడంతో ఒక వ్యక్తి ఆధీనంలో ఉన్న భూములకు పక్కా సరిహద్దులు, నివాస, సాగు భూముల సంరక్షణ కోసం భూమి హక్కులు అనివార్యంగా మారాయి. క్రమంగా భూములకు విలువ పెరగడంతో నేటి ప్రభుత్వాలకు భూముల హద్దుల పర్యవేక్షణ, భూ చట్టాల అమలు ఒక సవాల్‌గా మారింది.

ఈ క్రమంలోనే అనేక ప్రభుత్వాలు గతంలో అమల్లో ఉన్న భూ చట్టాలలో సవరణలు చేస్తున్నాయి. లేదంటే నూతన చట్టాలను రూపొందించుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా 2020లో నూతన ఆర్ఓఆర్ (రైట్స్‌ ఆఫ్‌ రికార్డు-2020)ను రూపొందించుకోవడంతో పాటు వ్యవసాయ భూముల కోసం ధరణి పేరుతో వెబ్‌ ల్యాండ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ధరణి పనితీరు అద్భుతం అని ప్రభుత్వం చెప్తుండగా.. దానితో రైతులు అవస్థలు పడుతున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న నూతన రెవెన్యూ చట్టాలపై ‘విధాత’ ప్రత్యేక కథనం. – (బూడిద సుధాక‌ర్‌, విధాత ప్రతినిధి, హైదరాబాద్)

బీహార్‌ ప్రభుత్వం 2012లో బీహార్‌ భూ వివాదాల పరిష్కార చట్టం-2012 అమల్లోకి తీసుకొచ్చింది. భూ సమస్యల పరిష్కార వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉంచాలనే సంకల్పంతో బీహార్‌ ల్యాండ్‌ ట్రిబ్యునల్ యాక్ట్ – 2012ను కూడా తీసుకువచ్చింది. ఇందులో మొదటగా ఏదేని రైతుకు ఏదైన భూ సమస్య వస్తే ఎలా పరిష్కరించుకోవాలి? ఏ అధికారిని సంప్రదించాలి? అది ఏ భూమికి (ప్రభుత్వ. ప్రైవేటు, ఎండోమెంట్‌, ఫారెస్ట్‌ తదితర) సంబంధించిన సమస్య? మండల స్థాయిలో పరిష్కారం అవుతుందా? డివిజన్‌ స్థాయిలోనా? ఎన్ని రోజులలో పరిష్కారం అవుతుంది? అనే విషయాలు స్పష్టంగా పేర్కొన్నారు. జిల్లా స్థాయిలోను భూ సమస్యలను పరిష్కరించే అథారిటీ కలిగిన వ్యవస్థ ఉంటుంది.

కిందిస్థాయి అథారిటీ చేసిన పరిష్కారంపై రైతులకు భిన్నమైన అభిప్రాయం ఉంటే సివిల్‌ కోర్టుకు వెళ్లకుండా నేరుగా ట్రిబ్యునల్‌కు వెళ్తారు. గతంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో బీహార్‌ భూ వివాదాల పరిష్కార చట్టం-2012, బీహార్‌ ల్యాండ్‌ ట్రిబ్యునల్ యాక్ట్ – 2012 అద్భుతంగా ఉన్నాయని, ఇతర రాష్ట్రాల్లోను అమలు చేస్తే భాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే తెలంగాణలో భూ సమస్యను పరిష్కారం చేసే వ్యవస్థ అందుబాటులో లేదు. ప్రతి భూ సమస్యకు సివిల్‌ కోర్టుకే వెళ్లాలి. భూ సమస్యను పరిష్కరించే అధికారం ప్రభుత్వ పరిధిలో కూడా లేదు. దీంతో తెలంగాణలో ప్రతిరోజూ సివిల్‌ కోర్టులలో కుప్పలు కుప్పలుగా భూ సంబంధిత కేసులు నమోదు అవుతున్నాయి. పరిష్కారం కోసం రెండేండ్ల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నా ప‌రిష్కారం కాలేద‌ని బాధిత రైతులు వాపోతున్నారు.

యూపీలో రెవెన్యూ కోడ్ – 2006

ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో అన్ని భూ చ‌ట్టాల‌ను క్రోడీక‌రించి, ఒకే చ‌ట్టంగా రూపొందించారు. రెవెన్యూ కోడ్‌ను 16 చాప్ట‌ర్లు, 234 సెక్ష‌న్లు, 4 విభాగాలుగా రూపొందించారు. రెవెన్యూ ధికారుల‌తో ఓ బోర్డును ఏర్పాటు చేశారు. ఇందులో గ్రామీణ స్థాయి రెవెన్యూ అధికారి నుంచి జిల్లా క‌లెక్ట‌ర్ వ‌ర‌కు ఉంటారు. గ్రామీణ స్థాయిలోనే రెవెన్యూ రికార్డుల ప‌ర్య‌వేక్ష‌ణ‌, నిర్వ‌హ‌ణ ఉంటుంది. మొత్తం గ్రామాలు, గ్రామాల రెవెన్యూ మ్యాపులు, ఆర్ ఓ ఆర్, రికార్డుల‌లో స‌వ‌ర‌ణ‌లు, మ్యుటేషన్‌, సక్సెషన్‌ రికార్డుల‌ నిర్వ‌హ‌ణ.. ఇలా రైతుల‌కు సంబంధించిన అనేక రికార్డులు గ్రామ స్థాయిలో ఉండ‌టంతో పాటు నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ కూడా గ్రామ స్థాయిలోనే ఉంటుంది.

యూపీలో ఆన్‌లైన్ రికార్డుతో పాటు ప్ర‌తి క‌మ‌తానికి ఖ‌చ్చిత‌మైన మాన్యువ‌ల్ రికార్డు కూడా ఉంటుంది. ప్ర‌తి భూ స‌మ‌స్య రెవెన్యూ అధికారుల‌తో ఏర్పాటు చేసిన బోర్డు ప‌రిధిలోనే ప‌రిష్కారం అవుతుంది. వాళ్ల ప‌రిధిలో పరిష్కరించలేని స‌మ‌స్య‌ల‌కు సంబంధించిన వివాదాలు మాత్రమే సివిల్ కోర్టు వ‌ర‌కు వెళ్తాయి. యూపీలో ఉన్న రెవెన్యూ కోడ్ లాగ‌నే ఉమ్మ‌డి ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో దేవేంద‌ర్ గౌడ్ రెవెన్యూ మంత్రిగా (1999లో) ఉన్నప్పుడు అసెంబ్లీ ఆమోదించి, రాష్ట్ర‌ప‌తి ఆమోదం కోసం పంపిన‌ప్ప‌టికీ.. ప‌లు అంశాల‌పై అభ్యంత‌రాల‌ను చెప్తూ ఆ బిల్లును తిప్పి పంపడంతో అది అక్క‌డితో ఆగిపోయింది.

అయితే ప్ర‌స్తుతం ధ‌ర‌ణిలో ఆన్‌లైన్ రికార్డు మాత్రం ఓ ప్రైవేటు కంపెనీ ఆధీనంలో ఉంటుంది. ఆ పోర్ట‌ల్ ఏ మాత్రం ట్యాంప‌రింగ్ జ‌రిగినా.. మాన్యువ‌ల్ రికార్డు లేని కార‌ణంగా రాష్ట్రంలో భూ యాజ‌మాన్య హ‌క్కుల‌న్నీ తారుమారు అయ్యే అవకాశం ఉన్నదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

రాజ‌స్థాన్‌లో టైటిల్ గ్యారంటీ చ‌ట్టం-2016

రాజ‌స్థాన్ రాష్ట్రంలో అక్క‌డి రాష్ట్ర ప్ర‌భుత్వం 2016లో టైటిల్ గ్యారంటీ యాక్టును తీసుకొచ్చింది. దేశంలోనే టైటిల్ గ్యారంటీ యాక్టును అమ‌లుచేస్తున్న ఏకైక రాష్ట్రం రాజ‌స్థాన్‌. భూమి, ఆస్తి యాజమాన్యానికి సమర్థవంతంగా హామీ అక్క‌డి రైతుల‌కు ల‌భిస్తుంది. ఈ చ‌ట్టం పూర్తిగా ఒక సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అమ‌లు జ‌రుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి నామమాత్రపు రుసుము చెల్లించడం ద్వారా వారి భూముల యాజమాన్యం యొక్క ధృవీకరణ పత్రాన్ని పొందవచ్చు.

భూ య‌జ‌మానుల వ‌ద్ద ఉన్న అన్ని ర‌కాల ప‌త్రాల‌ను, రికార్డుల‌ను ప‌రిశీలించి మొద‌ట‌గా ప్రొవిజ‌న‌ల్ స‌ర్టిఫికెట్‌లు జారీ చేస్తారు. ఈ స‌ర్టిఫికెట్‌పై ఎలాంటి అభ్యంత‌రాలూ రాన‌ట్లైతేనే భూ య‌జ‌మానికి స‌ర్టిఫికెట్‌ను, భూమికి సంబంధించిన మ్యాపును జారీ చేస్తారు. భూ సంస్క‌ర‌ణ‌ల‌లో ఈ చ‌ట్టం అత్యంత పార‌ద్శ‌క‌మైన‌, స‌మ‌ర్థ‌వంత‌మైన చ‌ట్టం అని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.

టైటిల్ గ్యారెంటీ చ‌ట్టం చేస్తూ ఏపీ అసెంబ్లీ ఆమోదం..

రాజ‌స్థాన్‌లో అమ‌లు జ‌రుగుతున్న‌టైటిల్ గ్యారంటీ యాక్టును ఏపీలోనూ అమలు చేసేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇప్ప‌టికే అసెంబ్లీ ఆమోదం చేసిన బిల్లును రాష్ట్ర‌ప‌తి ఆమోదానికి పంపారు. రాష్ట్ర‌పతి ఆమోదం పొందితే ఏపీలోను టైటిల్ గ్యారంటీ చ‌ట్టం అమ‌ల్లోకి రానుంది. అలాగే ఏపీలో స‌మ‌గ్ర భూ స‌ర్వే ప్ర‌క్రియ‌ను కూడా వేగంగా జ‌రుగుతున్నది.

క‌ర్ణాట‌క‌లో భూమి, కావేరి చ‌ట్టాల‌తో పాటు మొబైల్‌ యాప్‌

తెలంగాణ స‌రిహ‌ద్దు రాష్ట్ర‌మైన క‌ర్ణాట‌క‌లో భూ యాజ‌మాన్య హ‌క్కుల నిర్వ‌హ‌ణ కోసం భూమి, కావేరి చ‌ట్టాల‌తో పాటు గూగుల్ మ్యాపులో ప్రాంతాల పేర్లు క‌నిపించిన‌ట్లుగానే ప్ర‌తి స‌ర్వే నంబ‌ర్ హ‌ద్దుల‌ను కూడా చూపించేలా అక్క‌డి ప్ర‌భుత్వం దిశాంక్ అనే మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. భూమి చ‌ట్టంలో రెవెన్యూ స‌ర్వీసుల‌తోపాటు భూ వివాదాలు, ఏ గ్రామంలో ఎన్ని స‌మ‌స్య‌లు పెండింగ్‌లో ఉన్నాయి.

భూమి డ్యాష్ బోర్డు, మ్యుటేషన్‌ వివ‌రాలు, ల్యాండ్ క‌న్వ‌ర్ష‌న్ వివ‌రాలు, భూమి స‌ర్వే, ద‌ర‌ఖాస్తులు, రెవెన్యూ మ్యాపులు, రిజిస్ట్రేష‌న్, వెరిఫికేష‌న్‌, ఆన్‌లైన్ మ్యుటేషన్‌ స‌ర్వీసులు, ప్ర‌తి క‌మ‌తాన్ని అత్యంత స్ప‌ష్టంగా చూసుకునే వీలు ఈ చ‌ట్టం ద్వారా అక్క‌డి రైతుల‌కు క‌లుగుతుంది. కాబ‌ట్టి అక్క‌డ త‌హ‌సీల్దార్‌, క‌లెక్ట‌ర్ల‌చుట్టూ రైతులు తిర‌గాల్సిన ప‌నిలేదు. కావేరి చ‌ట్టం రిజిస్ట్రేష‌న్ శాఖ‌ను రెవెన్యూ శాఖ‌తో అనుసంధానం చేస్తుంది. దీంతో క్ర‌య‌విక్ర‌యాలు జ‌రిగిన ప్ర‌తి వ్య‌వ‌సాయ భూమి, ప్లాట్ వెనువెంట‌నే రెవెన్యూ రికార్డులో న‌మోదు అవుతుంది.

కాబ‌ట్టి డ‌బుల్ రిజిస్ట్రేష‌న్లకు ఆస్కారం ఉండ‌దు. దిశాంక్ యాప్ ద్వారా ప్ర‌తి ఒక్క‌రు త‌మ‌త‌మ‌త భూముల‌ను మొబైల్‌ నుంచి కూడా చూసుకోవ‌చ్చు. తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ధ‌ర‌ణితో రిజిస్ట్రేష‌న్ శాఖ‌కు సంబంధంలేదు. దీంతో ఒకే భూమిపై ప్లాట్లుగా రిజిస్ట్రేష‌న్‌ శాఖ‌లో సేల్‌డీడ్‌, మ‌ళ్లీ వ్య‌వ‌సాయ భూమిగా ధ‌ర‌ణిలో రిజిస్ట్రేష‌న్లు జ‌రుగుతున్నాయి. దీంతో భూ యాజ‌మాన్య హ‌క్కుల నిర్వ‌హ‌ణ‌లో పార‌ద‌ర్శ‌క‌త లోపించిందన్న అభిప్రాయాలు ఉన్నాయి.

ఒరిస్సాలో క‌మిటీ..

నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టం రూపొందించుకునేందుకు ఒరిస్సా ప్ర‌భుత్వం ఓ క‌మిటీని ఏర్పాటు చేసింది. క‌మిటీ నివేదిక వ‌చ్చిన త‌ర్వాత నూత‌న చ‌ట్టం రూప‌క‌ల్ప‌న చేయ‌నున్నారు. గ్రామాల్లో భూముల వివ‌రాల‌ను న‌మోదు, గుర్తించేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం కమ్యూనిటీ రిసోర్స్ ప‌ర్స‌న్స్‌ను నియ‌మించింది.

మ‌న్మోహ‌న్ సింగ్ సూచ‌న‌లపై నిర్ల‌క్ష్యం..

ప్ర‌ధానిగా మ‌న్మోహ‌న్ సింగ్ ఉన్న‌ స‌మ‌యంలో ప్ర‌తి భూ క‌మ‌తానికి ఒక యూల్పీఐఎన్ (యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్) నంబ‌ర్ ఇవ్వాల‌ని, 2024 నాటికి ఈ ప్ర‌క్రియ‌ పూర్తి చేయాల‌ని రాష్ట్రాల‌కు సూచించారు. కానీ రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోలేదు. భూ రికార్డులు కంప్యూట‌రీక‌ర‌ణ జ‌ర‌గాలి.

కానీ వాస్త‌వ ప‌రిస్థితుల‌కు అద్దం ప‌ట్టేలా ఉండాల‌ని, అలాగే భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం ఒకే దగ్గర, ఒకే రికార్డు ఉండాల‌ని ప్ర‌తిపాదించారు. కానీ తెలంగాణ‌లో ఉన్న రికార్డుల‌ను తొల‌గించి, కేవ‌లం ఒక్ వెబ్ పోర్ట‌ల్‌పై ఆధార‌ప‌డాల్సిన వ‌స్తుంద‌ని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.

తెలంగాణ‌లో ధ‌ర‌ణి ఇలా..

కాగితాల్లో ఉన్న రికార్డు కంప్యూటర్‌కు ఎక్కాయి. అందరికీ అందుబాటులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సులభతరం, వేగవంతం అయ్యాయి. ఇప్పుడు ఈ రెండు ఒకేరోజు ఒకేచోట నిమిషాల్లో అవుతున్నాయి. ఈ రికార్డు ఆధారంగానే రైతులకు ప్రభుత్వ పధకాలు అందుతున్నాయి. కానీ ధరణిలో చాలా వివరాలు తప్పుగా నమోదయ్యాయి. ప్ర‌థమిక అంచనా ప్రకారం ప్రతి ఊరిలో వంద మందికి పైగా రైతులకు సంబందించిన భూమి వివరాలు ధరణిలో సరిగ్గా నమోదు కాలేదు.

ధరణిలో దాదాపు 45 రకాల సమస్యలు ఉన్నాయ‌ని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ధరణి సమస్యల పరిష్కారం క్లిష్టంగా, రైతులకు భారంగా మారింది. రైతుల స‌మ‌స్య‌ల‌పై స్వీక‌రించే ద‌ర‌ఖాస్తుల‌కు ట్రాకింగ్ లేదు. ఒక్కో ద‌ర‌ఖాస్తును కార‌ణంగా తెల‌ప‌కుండానే అనేక‌సార్లు తిర‌స్క‌రిస్తున్నారు. దీంతో రైతు మ‌ళ్లీ డ‌బ్బులు చెల్లించి దర‌ఖాస్తు చేయాల్సి వ‌స్తుంది. జిల్లా క‌లెక్ట‌ర్‌ల చ‌ట్టూ తిరగాల్సి వ‌స్తుంది. ప్ర‌భుత్వ ప‌రిధిలో ప‌రిష్కార వేధిక లేనికార‌ణంగా ప్ర‌తి స‌మ‌స్య‌కు సివిల్ కోర్టుకు పోవాల్సిన దుస్థితి ఉంది.

అసలు ధరణి అంటే: భూమి సునీల్ కుమార్‌, ప్ర‌ముఖ భూ చ‌ట్టాల నిపుణులు

కాగితాల నుంచి కంప్యూటర్లకు ఎక్కిన భూమి/రెవెన్యూ రికార్డులే ధరణి. అప్పటి 1బి రికార్డే ఇప్పటి ధరణి. ఎనభయ్యవ దశకంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సీఎల్‌ఆర్‌, ఆ తరువాత వచ్చిన ఎన్ఎల్ఆర్ఎంపీ, ఇప్పుడు అమలులో ఉన్న డీఐఎల్‌ఆర్‌ఎంపీ పథకాలు భూమి రికార్డులను కంప్యూటరీకరించాలని అంటున్నాయి. భూమి రికార్డులు కాగితాల్లో ఉండొద్దని, కంప్యూటర్లోనే ఉండాలని నిర్దేశిస్తున్నాయి.

భూమి రికార్డులన్నీ కంప్యూటర్లోనే ఉండాలి. భూమిపై హక్కులు వచ్చిన వెంటనే రికార్డు మారాలి. అంతిమంగా భూమి రికార్డుకు ప్రభుత్వమే హామీ ఇచ్చే వ్యవస్థ తేవాలి అనేవి ఈ పథకాల లక్ష్యాలు.
ఇందులో భాగంగా వచ్చినవే ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన ‘వెబ్ ల్యాండ్’, తెలంగాణ ఏర్పడిన తరువాత వచ్చిన ‘మా భూమి’, ఇప్పుడున్న ‘ధరణి’. ధ‌ర‌ణి చ‌ట్ట‌బ‌ద్ద‌త‌పై సందిగ్ధ‌త ఉంది. ఆ చ‌ట్టం ప్ర‌కారం భూ స‌మ‌స్య‌ల‌ను పరిష్కారం చేసే అధికారమే క‌లెక్ట‌ర్ల‌కు కూడా లేదు.

భూ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే అధికారం క్షేత్ర‌, మండ‌ల‌, డివిజ‌న‌ల్‌, జిల్లా స్థాయిలో లేక‌పోవ‌డం వ‌ల‌న స‌మ‌స్య‌ల‌పై అధికారులు ఎలాంటి ఆర్డ‌ర్ల‌ను జారీ చేయ‌డం లేదు. ఎలాంటి ఆర్డ‌ర్‌లు లేకుండా భూ యాజ‌మాన్య హ‌క్క‌ల‌ను స‌వ‌రించ‌డం వ‌ల‌న నిజ‌మైన ప‌ట్టాదారు త‌న హ‌క్క‌ల‌ను కొల్పోయో అవ‌కాశం ఉంటుంది. ఒక ఆర్డర్ కూడా లేకుండా సవరణలు ఎలా చేస్తారు. ప్రతి క్లాజ్‌కు ఓ ఆర్డర్ ఉండాలి. రికార్డులో తప్పులను సవరించేందేకు సవరించే అధికారం ఇప్పడు అధికారులకు లేదు. అలాగే తెలంగాణ‌లో ఒక్క ధ‌ర‌ణినిస‌మ‌స్య‌గా చూపుతున్నారు. ధ‌ర‌ణిలో స‌వ‌ర‌ణ‌లతో పాటు ప్ర‌భుత్వం వీటిపై దృష్టిసారించాలి.

భూ రికార్డుల సమస్యలు తీరాలంటే ఏం చెయ్యాలి?

  • భూముల రీ సర్వే చేసి కొత్త రికార్డులను రూపొందించుకోవడం సమస్యకు సమగ్ర, శాశ్వత పరిష్కారం.
  • ఈ లోపు ప్రజల భాగస్వామ్యంతో ధరణిలో ఉన్న తప్పులను గుర్తించి గ్రామాలలో సదస్సులు / కోర్టులు నిర్వహించి రికార్డులను సరిచేయాలి.
  • ప్రతి సంవత్సరం జమాబందీ నిర్వహించి రికార్డుల్లో తప్పులుంటే సరిచేయాలి.
  • ధరణి, ఇతర ముఖ్యమైన భూమి రికార్డులతో కూడిన ‘భూమి రికార్డుల కిట్’ ను ప్రతి రైతుకు అందించాలి.
  • కంప్యూటర్ రికార్డు భూయజమానికి తెలియకుండా ఎలాంటి మార్పు జరిగే వీలులేని విదంగా రూపొందించాలి. బ్లాక్ చైనా టెక్నాలజీ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భూమి రికార్డులకు భద్రత చేకుర్చాలి.
  • రైతులకు భూమి రికార్డులపై అవగాహన కల్పించాలి.
  • కాగితాల్లో ఉన్నా, కంప్యూటర్లో ఉన్నా అవి కేవలం రికార్డులు మాత్రమే. ఈ రికార్డులను వినియోగించుకునేదాన్ని బట్టే సమస్యల పరిస్కారం, హక్కుల రక్షణ ఉంటుంది. కాబట్టి, రికార్డుల కంప్యూటరీకరణతో పాటు చట్టాలలో మార్పులు, సమస్యల పరిస్కారానికి ప్రత్యేక వ్యవస్థ, మెరుగైన భూపరిపాలనకు యంత్రాంగం ఏర్పాటు జరగాలి.
  • ఒకే భూమి రికార్డు. ఆ రికార్డులో ఉన్న వివరాలకు ప్రభుత్వమే హామీ. భూయజమానికి నష్టం జరిగితే పరిహారం చెల్లింపు. ఇందుకోసం టైటిల్ గ్యారంటీ చట్టం తేవాలి.