Site icon vidhaatha

Bharat Jodo Yatra-2 । అక్టోబర్‌ 2 నుంచి భారత్‌జోడో -2 యాత్ర

Bharat Jodo Yatra-2: న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తన భారత్‌ జోడో యాత్ర -2ను అక్టోబర్‌ రెండున ప్రారంభించనున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు నిర్వహించిన తొలి యాత్ర అద్భుతంగా విజయవంతమైన నేపథ్యంలో రెండోయాత్రను పశ్చిమం నుంచి తూర్పు దిశగా నిర్వహించనున్నారు.

మహాత్మాగాంధీ జయంతి రోజైన అక్టోబర్‌ 2న, ఆయన జన్మస్థలం (Mahatma’s birthplace) పోర్‌బందర్‌ నుంచి రెండో విడత యాత్ర (Bharat Jodo Yatra-2) ప్రారంభం అవుతుందని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. గుజరాత్‌ రాష్ట్రంలో మొదలయ్యే యాత్ర.. త్వరలో ఎన్నికలు జరుగబోయే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం మీదుగా సాగే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని లోహిత్‌ జిల్లా పరశురాం కుండ్‌ పుణ్యక్షేత్రం వద్ద ముగస్తుందని తెలిపాయి. తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా రాహుల్‌ పాదయాత్ర ఉంటుందా? అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కేసీ వేణుగోపాల్‌, జైరాంరమేశ్‌ తదితరులతో కూడిన బృందం రాహుల్‌ పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను ఖరారు చేసే పనిలో ఉన్నారని సమాచారం.

ఇందుకోసం యాత్ర సాగే రాష్ట్రాల కాంగ్రెస్‌ నాయకులతోనూ వారు సంప్రదిస్తున్నారని తెలుస్తున్నది. మొదట్లో యాత్రను గువాహతిలోని కామాఖ్యదేవి ఆలయం వద్ద ముగించాలని భావించినప్పటికీ.. మణిపూర్‌ ఘటనలు మొత్తం ఈశాన్య రాష్ట్రాల ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో అరుణాచల్‌ప్రదేశ్‌ వరకు పొడిగించారని సమాచారం. భారత్‌ జోడో యాత్ర అనేది కాంగ్రెస్‌ పార్టీ గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ చేపట్టని అతిపెద్ద మాస్‌ కార్యక్రమం.

కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ఈ యాత్ర పాత్ర కూడా కొంత ఉన్నది. 21 రోజుల పాటు కర్ణాటకలో రాహుల్‌ యాత్ర కొనసాగింది. భారత్‌జోడో-2 యాత్ర నాలుగు నెలలపాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. పరశురాం కుండ్‌ (Parshuram Kund) అనేది ఈశాన్య రాష్ట్రాల కుంభ్‌గా చెబుతారు. జనవరిలో మకర సంక్రాంతి రోజున దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

Exit mobile version