విజయశాంతి చివరి మజిలీ బీజేపీయే కావాలి: బండి సంజయ్ కుమార్

పార్టీ కార్యాలయంలో ఘనంగా విజయశాంతి పాతికేళ్ల రాజకీయ ప్రస్థాన కార్యక్రమం పార్టీని వీడిన వారు తిరిగి బీజేపీలోకి రావాల‌ని పిలుపు బండి నాయకత్వంలోనే ఎన్నికలకు పోతామన్న విజయశాంతి విధాత: ప్రత్యేక పరిస్థితుల్లో మధ్యలో పార్టీని వీడినప్పటికీ తిరిగి పార్టీలోకి వచ్చిన విజయశాంతికి చివరి మజిలీ బీజేపీయే కావాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆకాంక్షించారు. శుక్రవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా […]

  • Publish Date - January 28, 2023 / 04:13 AM IST

  • పార్టీ కార్యాలయంలో ఘనంగా విజయశాంతి పాతికేళ్ల రాజకీయ ప్రస్థాన కార్యక్రమం
  • పార్టీని వీడిన వారు తిరిగి బీజేపీలోకి రావాల‌ని పిలుపు
  • బండి నాయకత్వంలోనే ఎన్నికలకు పోతామన్న విజయశాంతి

విధాత: ప్రత్యేక పరిస్థితుల్లో మధ్యలో పార్టీని వీడినప్పటికీ తిరిగి పార్టీలోకి వచ్చిన విజయశాంతికి చివరి మజిలీ బీజేపీయే కావాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆకాంక్షించారు. శుక్రవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర పార్టీ నాయకత్వం ఆమెను ఘనంగా సన్మానించింది.

కార్యక్రమంలో బండి సంజయ్ తోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, తమిళనాడు సహాయ ఇంచార్జ్‌ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, జి.వివేక్, మాజీమంత్రి బాబూమోహన్, మాజీ ఎంపీలు చాడా సురేష్ రెడ్డి, రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, జిట్టా బాలక్రిష్ణారెడ్డి, రాణిరుద్రమ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు 25 ఏళ్లు రాజకీయాల్లో కొనసాగడం మామూలు విషయం కాదన్నారు. సినిమా అనేది గ్లామర్ ప్రపంచమని, రాజకీయాల్లో ప్రశంసలకంటే విమర్శలే ఎక్కువ అని అన్నారు. వాటన్నింటినీ తట్టుకుని తెలంగాణ ఉద్యమకారిణి విజయశాంతి 25 ఏళ్లు తన రాజకీయ ప్రస్థానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం సంతోషమన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్‌ ‘‘చిన్న చిన్న సమస్యలకు ఇబ్బందిపడి భావోద్వేగాలతో బీజేపీకి దూరమైన వారిని నేను ఒక్కటే కోరుతున్నా… సైద్ధాంతిక భావాలుండి పార్టీని వీడిన వారంతా బీజేపీలోకి తిరిగి రావాలని కోరుతున్నా. అందరం కలిసి కేసీఆర్ నియంత పాలనపై పోరాడుదాం. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకుందాం’’ అని పిలుపునిచ్చారు.

బీజేపీలోనే50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవాలి: కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి
పార్లమెంట్ లో కేసీఆర్ లేకపోయినా తెలంగాణ బిల్లుకు విజయశాంతి మద్దతు పలికారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఎవరికీ తలవంచకుండా ఆమె పనిచేశారని కితాబు ఇచ్చారు. విజయశాంతి బీజేపీలోనే 50 ఏళ్ల ప్రస్థానాన్నిపూర్తి చేసుకోవాలని కోరుతున్నానన్నారు. విజయశాంతి అంటే మహిళలకు ప్రత్యేకంగా అభిమానమని చెప్పారు.

ఉద్యమకారులను వాడుకొని వదిలేసిన బీఆర్‌ ఎస్‌: త‌రుణ్‌ఛుగ్‌
తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడేందుకు విజయశాంతి ఎంతో పోరాటం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ వాడుకొని వదిలేసిందని ఆరోపించారు. విజయశాంతి రాజకీయాల్లో మరో పాతికేళ్లు కొనసాగాలని ఆకాంక్షించారు.

అన్యాయంపై పోరాడేందుకే రాజకీయాల్లోకి వచ్చా.: విజ‌య‌శాంతి
తెలంగాణకు జరిగిన అన్యాయంపై పోరాడేందుకే రాజకీయాల్లోకి వచ్చానని విజయశాంతి అన్నారు. తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదన్నారు. ఆనాడు తనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే కోరికే ఉండేదని, ఆ రోజు సమైక్యవాద నాయకులు తెలంగాణ రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేసుకున్నారు. అందుకే సమైక్యవాదులతో పోరాడేందుకు తల్లి తెలంగాణ పార్టీ పెట్టానన్నారు. ఆరోజు పార్టీని వీడినందుకు ఏడ్చానన్నారు.

నాలుగున్నరేళ్లు పార్టీని నడిపి ఎన్నో సమస్యలపై పోరాడానని ఆమె తెలిపారు. ఆ సమయంలో ఒక రాక్షసుడు ఎదురయ్యాడని, తెలంగాణ పేరుతో ముసుగు కప్పుకుని వచ్చి నమ్మించి మోసం చేశాడన్నారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి పూనుకున్నాడన్నారు. విలీనం చేసినప్పటి నుండి తాను ఏనాడూ ప్రశాంతంగా లేనని, టార్చర్ అనుభవించానని చెప్పారు. తాను ఎంపీగా పోటీ చేసిన సమయంలో ఓడగొట్టేందుకు కుట్ర జరిగిందన్నారు.

2013లో తెలంగాణ రాష్ట్ర ప్రకటన రాగానే అదేరోజు రాత్రి నన్ను సస్పెండ్ చేశారని, తన తప్పేమిటో చెప్పలేదని తెలిపారు. ఆనాడు తనకు విముక్తి కలిగినందుకు ఆనంద పడ్డానే తప్ప బాధపడలేదన్నారు.
పార్లమెంట్‌లో బిల్లు పెట్టినప్పుడు తెలంగాణ రాకూడదని కేసీఆర్ సహా చాలా మంది ఎంపీలు భావించారని విజయశాంతి విమర్శించారు. నా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణకు సేవ చేసుకుంటానన్నారు. ఈ ఒక్కసారి గట్టిగా పనిచేస్తే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. బండి సంజయ్‌ నాయకత్వంలోనే ఎన్నికలకు పోతున్నామని ఆమె ప్రకటించారు

Latest News