Site icon vidhaatha

నామినేషన్ దాఖలు చేసిన బోయినపల్లి వినోద్ కుమార్

కాంగ్రెస్, బిజెపి మినహా మరెవ్వరు ఉండకూడదన్నది ఆ రెండు పార్టీల ఉద్దేశం
నవోదయ పాఠశాలల కేటాయింపులో అంతులేని నిర్లక్ష్యం

విధాత బ్యూరో, కరీంనగర్: తెలంగాణ ప్రజల సమస్యలపై ఢిల్లీలో పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని ఆ పార్టీ నేత బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. శ‌నివారం కరీంనగర్ లోకసభ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి ఆయన తన నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం ఐదుగురు లోకసభ సభ్యుల బలంతోనే ఢిల్లీ వెళ్లి కొట్లాడి తెలంగాణ తీసుకు వచ్చిన ఘనత బీఆర్ఎస్ దక్కుతుందన్నారు. తాము మినహా ఇతర పార్టీలు ఉండకూడదనే లక్ష్యంతో కాంగ్రెస్, బిజెపి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాల్సి ఉన్నా, కేంద్రం ఇప్పటివరకు తెలంగాణకు ఒక్క పాఠశాల కూడా కేటాయించింది లేదన్నారు.

తెలంగాణలో 33 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి ఏడు సంవత్సరాలు పూర్తవుతున్నా, నవోదయ పాఠశాలల కేటాయింపులో కేంద్రం మోకాలొడ్డుతూ వస్తోందన్నారు. విభజన చట్టాల అమల్లో, రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం తెలంగాణ పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

Exit mobile version