- తోటి ప్రయాణికుడు బాంబు అన్నాడని మహిళ ఫిర్యాదు
- ఢిల్లీ-ముంబై విస్తారా విమానం రెండు గంటలు ఆలస్యం
- దుబాయ్‌కి వెళ్లే వ్యక్తిని అదుపులోకి తీసుకొన్న సీఐఎస్ఎఫ్
విధాత: ఓ ప్రయాణికుడి నోటి వెంట వచ్చిన బాంబు అనే మాట అతడి అరెస్టుకు దారి తీసింది. ఢిల్లీ-ముంబై విస్తారా విమానం (Vistara flight) రెండు గంటలు ఆలస్యంగా వెళ్లేందుకు కారణమైంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)ను బెంబేలెత్తించింది.
అసలు ఏమి జరిగిందంటే.. గురువారం సాయంత్రం ఢిల్లీ-ముంబై విస్తారా విమానంలోకి ఓ ప్రయాణికుడు ఎక్కాడు. కాసేపట్లో విమానం బయలుదేరాల్సి ఉన్నది. ఈ క్రమంలో అతడు ఫోన్‌లో తన తల్లితో మాట్లాడుతున్నాడు. పేలుడు పదార్థాలు (బాంబులు) ఉంటాయనే భయంతో ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ నా బ్యాగ్‌లో కొబ్బరికాయను తీసుకెళ్లకుండా ఆపిందని ప్రయాణికుడు తల్లికి చెప్పాడు.
పక్క సీటులో కూర్చున్న మహిళా ప్రయాణికురాలికి బాంబు అనే పదం వినిపించింది. ఫోన్ సంభాషణలో సహ ప్రయాణికుడు ‘బాంబ్’ అని చెప్పడం విన్నట్టు ఆమె సెక్యూరిటీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వెంటనే అతడిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అదుపులోకి తీసుకున్నది.
ఆ తర్వాత ప్రయాణికులిద్దరినీ దింపి, విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసినా ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. ఈ ఘటనతో విమానం రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ముంబై నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఆ ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది స్థానిక పోలీసు అధికారులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.