Telangana Sentiment । తెలంగాణ సెంటిమెంట్‌పై..మళ్లీ BRS ఆశలు?

హరీశ్‌ వ్యాఖ్యలు యథాలాపమా? ఉద్దేశపూర్వకమా? ఎన్నికల ఏడాది ఆంధ్రా, తెలంగాణ మధ్య తగాదాల సృష్టికి యత్నమా? విధాత: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 ఏళ్ల తరువాత అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ కొత్తగా సెంటిమెంట్‌ (Telangana Sentiment) రగిల్చే ప్రయత్నం చేస్తోందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. 8 ఏళ్లకుపైగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ త్వరలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తుందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు […]

  • Publish Date - April 14, 2023 / 06:26 PM IST
  • హరీశ్‌ వ్యాఖ్యలు యథాలాపమా? ఉద్దేశపూర్వకమా?
  • ఎన్నికల ఏడాది ఆంధ్రా, తెలంగాణ మధ్య తగాదాల సృష్టికి యత్నమా?

విధాత: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 ఏళ్ల తరువాత అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ కొత్తగా సెంటిమెంట్‌ (Telangana Sentiment) రగిల్చే ప్రయత్నం చేస్తోందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. 8 ఏళ్లకుపైగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ త్వరలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తుందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణ ఏర్పాటుకు ముందు సమైక్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన చివరి ఎన్నికల్లో నాటి టీఆర్‌ఎస్‌ను గెలిపించింది తెలంగాణ వాదమే. తదుపరి 2018 చివరిలో జరిగిన ఎన్నికల్లోనూ మళ్లీ ఆంధ్రోళ్లు వస్తారంటూ తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించింది. చంద్రబాబును బూచిగా చూపించి.. ఆంధ్రోళ్లపెత్తనం మళ్లీ కావాలా? అనే ప్రశ్నలు రేకెత్తించి.. గెలిచిందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఎన్నికలప్పుడే కాదు.. అడపాడదపా తెలంగాణ సెంటిమెంట్‌ను లేవనెత్తుతూనే వచ్చింది.

ఇప్పడు టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారింది. తమది జాతీయ పార్టీ అని ప్రకటించుకుంది. కానీ.. తెలంగాణ అనే పదాన్ని పార్టీ పేరు నుంచి తొలగించాల్సి వచ్చిన నేపథ్యంలో తన ఆత్మనే పార్టీ పేరు నుంచి తొలగించిందన్న విమర్శలు వచ్చాయి. దాంతో మళ్లీ తెలంగాణ అంశాన్ని ఆ పార్టీ నేతలు తరచూ ప్రస్తావిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

గత రెండు ఎన్నికలు తెలంగాణ సెంటిమెంట్‌ రూపంలో అధిగమించిన బీఆర్‌ఎస్‌ నేతలు ఈ ఏడాది చివరలో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే సరికొత్త తరహాలో సెంటిమెంట్‌ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారన్న సందేహాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో అభివృద్ధి జరుగలేదని, తెలంగాణలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతున్నదని హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను రాజకీయ పరిశీలకులు ఈ కోణంలోనే విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ఎవరి రాష్ట్రం అభివృద్ధిపై ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉంటాయి. అయితే.. ఏపీలో అభివృద్ధి లేదని విమర్శలు చేయడం వెనుక తెలంగాణ, ఆంధ్ర సెంటిమెంట్‌ను మరో కోణంలో రగిలించే ప్రయత్నమేనని పరిశీలకులు అంటున్నారు.

సహజంగానే ఏపీ మంత్రులు హరీశ్‌ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తమ రాష్ట్రంలో జరిగిన అభివృద్దిని చూపిస్తాం రావాలంటూ సవాల్‌ విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మంత్రులు, నేతలు ఎవరైనా తమ రాష్ట్రంలో చేసిన అభివృద్ధిపై చెప్పుకోవచ్చు కానీ, పక్క రాష్ట్రంతో కెలుక్కోవడం ఏమిటని అంటున్నారు.

మరోవైపు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తెలంగాణ సంస్థను కొనుగోలు చేస్తామని, బిడ్డింగ్‌లో కూడా పాల్గొంటామని సింగరేణి అధికారులు చెప్పారు. ఇది కూడా మరో సమస్యకు దారి తీస్తున్నది. ఏపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పట్టించుకోవడం లేదన్న భావనను అక్కడి ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే ఈ ప్రయత్నం జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హరీశ్‌రావు వ్యాఖ్యలు, విశాఖ ఉక్కును కొనుగోలు చేసేందుకు సింగరేణి ప్రయత్నాలతో ఏపీకి చెందిన మంత్రులు సైతం విద్వేషపూరిత వ్యాఖ్యలకు దిగడంతో రెండు రాష్ట్రాల నాయకత్వాల మధ్య చిచ్చు రేగింది. ఇది ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నదా? లేక యాధృచ్ఛికమా అనే సందేహాలు తలెత్తుతున్నాయి