- అల్లు అర్జున్ మామా చంద్రశేఖర్
విధాత, హైదరాబాద్ : బీఆరెస్‌కు చెందిన పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ చేరారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జడ్పీ చైర్మన్ పట్నం సునీత, కుమారుడు పట్నం రినీశ్‌రెడ్డిలు, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన సతీమణి చర్లపల్లి కార్పొరేటర్ శ్రీదేవిలు, అల్లు అర్జున్ మామా కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, చలమల కృష్ణారెడ్డిలు గాంధీభవన్‌లో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
అనంతరం వారంతా అసెంబ్లీకి వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. వారిలో పట్నం మహేందర్ రెడ్డి, బొంతు రాంమోహన్, చంద్రశేఖర్ రెడ్డిలు పార్లమెంటు ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్నారు. వీరంతా మల్కాజిగిరి, సికింద్రాబాద్ ఎంపీ స్థానాల టికెట్లను ఆశిస్తున్నారు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో తాను పోటీ చేయాలని భావిస్తున్నానని, మల్కాజిగిరి, సికింద్రాబాద్ ఏ టికెట్ ఇచ్చిన తాను పోటీ చేస్తానని, తన కోసం అల్లు అర్జున్ కూడా ఈ దఫా ఎన్నికల్లో ప్రచారం చేస్తారని ప్రకటించారు.
చంద్రశేఖర్ రెడ్డి 2014 ఎన్నికల వేళ బీఆరెస్‌లో చేరి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలో 47,292 ఓట్లు సాధించిన ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతిలో 11,056 ఓట్ల తేడాతో ఓడిన అనంతరం కొంతకాలం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డి బీఆరెస్ నుంచి నాగార్జున సాగర్ టికెట్ ఆశించి నిరాశ చెందారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో అయినా టికెట్ వస్తుందన్న నమ్మకం లేకపోవడంతో బీఆరెస్‌ను వీడారు.