BRS For BJP | బీఆర్‌ఎస్‌ మంత్రం.. బీజేపీ కోసం!?

BRS For BJP బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ టీం అంటున్న ఎన్సీపీ, శివ‌సేన‌ నాడు యూపీలో ఓవైసీ.. నేడు మహారాష్ట్రలో కేసీఆర్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ నుంచి భారీ వలసలు పట్టించుకోకుండా పొరుగు రాష్ట్రానికి భారీ పర్యటన మండిపడుతున్న శివసేన(ఉద్ధవ్‌), ఎన్సీపీ నాయకులు నాటకాలేస్తే.. తెలంగాణలోనూ ఓడుతారని వ్యాఖ్యలు బీజేపీ నేతలే కేసీఆర్‌ను ఉసిగొల్పారని అనుమానాలు తెలంగాణ సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర ప‌ర్య‌ట‌న వెనుక బీజేపీ వ్యూహం ఉందా? ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ఎంఐఎం త‌ర‌హా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను […]

  • Publish Date - June 28, 2023 / 12:43 AM IST

BRS For BJP

  • బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ టీం అంటున్న ఎన్సీపీ, శివ‌సేన‌
  • నాడు యూపీలో ఓవైసీ.. నేడు మహారాష్ట్రలో కేసీఆర్‌
  • రాష్ట్రంలో కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ నుంచి భారీ వలసలు
  • పట్టించుకోకుండా పొరుగు రాష్ట్రానికి భారీ పర్యటన
  • మండిపడుతున్న శివసేన(ఉద్ధవ్‌), ఎన్సీపీ నాయకులు
  • నాటకాలేస్తే.. తెలంగాణలోనూ ఓడుతారని వ్యాఖ్యలు
  • బీజేపీ నేతలే కేసీఆర్‌ను ఉసిగొల్పారని అనుమానాలు

తెలంగాణ సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర ప‌ర్య‌ట‌న వెనుక బీజేపీ వ్యూహం ఉందా? ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ఎంఐఎం త‌ర‌హా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను ఈసారి మ‌హ‌రాష్ట్ర ఎన్నిక‌ల్లో బీఆరెస్ పోటీ ద్వారా బీజేపీ పొందాల‌నుకుంటోందా? ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్‌ప‌వార్ ఊహిస్తున్న‌ట్లు బీఆర్‌ఎస్‌.. బీజేపీకి బీ టీమ్‌గా రానున్న సార్వ‌త్రిక ఎన్నికల్లో ప‌నిచేయ‌నుందా?

సొంత రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎంపీ, మంత్రుల‌తో స‌హా 12 మంది మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతుంటే తెలంగాణ‌లో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాల్సిన కేసీఆర్ మ‌హ‌రాష్ట్రలో బీఆర్‌ఎస్‌ బ‌లోపేతం పేరుతో భారీ కాన్వాయ్‌తో వెళ్లడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)ని ఎదుర్కొనేందుకు మోడీ-షాలు బీఆర్‌ఎస్‌ను తెలివిగా మ‌హ‌రాష్ట్రలో పోటీ చేయిస్తున్నారా? అంటే.. అవున‌నే అంటున్నారు మహారాష్ట్ర నాయకులు.

(విధాత ప్రత్యేక ప్రతినిధి)
సొంత రాష్ట్రం తెలంగాణ‌లో రోజూ బీఆర్‌ఎస్‌ నాయ‌కులు కాంగ్రెస్ కండువా క‌ప్పుకొంటున్నారు. క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత తెలంగాణ‌లో కాంగ్రెస్ బ‌లం పుంజుకుంటోంద‌ని స‌ర్వేలు వెల్ల‌డిస్తున్నాయి. సాధార‌ణంగా ఇలాంటి స‌మ‌యంలో ఏ పార్టీ అధ్య‌క్షుడు అయినా న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌డ‌తారు. అసంతృప్త నేత‌ల‌ను పిలిచి మాట్లాడి పార్టీలోనే కొన‌సాగేటట్లు చూస్తారు. కానీ కేసీఆర్ దీనికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ మంత్రులతో సహా 12 మందికి పైగా మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ నేతల జాబితాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యేలు పాణ్యం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, రాకేష్‌రెడ్డి, కోట రాంబాబు సహా 35 మంది ఉన్నారు. జులై మొదటి వారంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు వీరంతా అధికారికంగా కాంగ్రెస్‌లో చేరనున్నారు.

కానీ కేసీఆర్‌కు మాత్రం ఈ ప‌రిణామాలు కించిత్ షాక్‌కు గురిచేసిన‌ట్లు క‌నిపించ‌డం లేదు. ఈ ప‌రిస్థితుల్లోనే రెండు రోజుల సోలాపూర్ పర్యటన కోసం మహారాష్ట్రకు రోడ్డు మార్గంలో వెళ్లిన సీఎం కేసీఆర్.. ఏకంగా 600 కార్లు, 2 బస్సుల్లో భారీ కాన్వాయ్‌తో వెళ్లారు. నెట్టింట్లో ఈ కాన్వాయ్ వైర‌ల్ అయింది. ఇదీ కేసీఆర్‌ బ్రాండ్ అని కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తే.. అన్ని కార్లు ఎందుకు బుజ్జీ.. పెట్రోల్ వేస్ట్ అని మరికొందరు సెటైర్లు వేశారు.

బీజేపీ- బీఆర్‌ఎస్‌ వ్యూహం ఫ‌లిస్తుందా?

తెలంగాణ రాష్ట్ర స‌మితిని భార‌త రాష్ట్ర స‌మితిగా మార్చిన త‌రువాత కేసీఆర్ దేశంలోని ప‌లు రాష్ట్రాల‌లో ప‌ర్య‌టించారు. బీజేపీని వ్య‌తిరేకిస్తున్న శ‌ర‌ద్ ప‌వార్‌, ఉద్ధ‌వ్ థాక్రే, నితీష్ కుమార్‌, అర‌వింద్ కేజ్రీవాల్‌, కుమార్ స్వామి, మ‌మ‌తా బెన‌ర్జీ వంటి వారితో మూడో ప్ర‌త్యామ్నాయం ఏర్పాటు చేయాల‌ని చూశారు.

త‌న కుమార్తె క‌విత‌ను వెంట బెట్టుకుని కొంత‌మంది నేత‌ల‌ను స్వ‌యంగా క‌లిశారు. త‌న‌ను ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తే మొత్తం ఎన్నిక‌ల ఖ‌ర్చు పెట్టుకుంటానంటూ కేసీఆర్ మాట్లాడిన‌ట్లుగా ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు రాజ్‌దీప్ స‌ర్దేశాయ్ కూడా బయపెట్టారు. ఈ సంద‌ర్భంలోనే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌కు చెందిన పలువురు నేతలు కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)లో చేరారు.

ఇలా చేరిన వారిలో మధ్యప్రదేశ్ జున్నార్డియో నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రాందాస్‌ ఊకే, సర్వజన్‌ కల్యాణ్‌ పార్టీ అధ్యక్షుడు సంజయ్‌ యాదవ్‌, గోండ్వానా పార్టీ అధ్యక్షుడు శోభరామ్‌ బలావి, భువన్‌ సింగ్‌ కోరమ్‌, లక్ష్మణ్‌ మాస్కోలేలు ఉన్నారు. ఇప్పుడు మ‌హారాష్ట్రలో కూడా చాలామంది నాయ‌కుల‌ను చేర్చుకునే ప్ర‌ణాళిక‌తోనే కేసీఆర్ ప‌ర్య‌టిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఎప్పుడైనా మహారాష్ట్ర ఎన్నికలు?

2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల తర్వాత శివసేన (ఉద్ధవ్ వర్గం), శరద్ ప‌వార్‌, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో ఏర్పడిన రాష్ట్రస్థాయి రాజకీయ సంకీర్ణం మ‌హా వికాస్ అఘాడి. ఎన్సీపీ, కాంగ్రెస్‌, సమాజ్‌వాది పార్టీ, సీపీఎం స‌హా మరికొన్ని పార్టీల మద్దతుతో ఈ కూటమి ఏర్పడి అధికారంలోకి వ‌చ్చింది.

2022 మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం త‌రువాత శివసేన సీనియర్ నాయకుడు ఏక్‌నాథ్‌ షిండే.. మహా వికాస్ అఘాడీని విచ్ఛిన్నం చేసి మళ్లీ బీజేపీ-శివసేన సంకీర్ణాన్ని స్థాపించాలనుకున్నారు. తదనంతరం అతను తన పార్టీలోని 2/3 వంతు సభ్యుల మద్దతును కూడగట్టుకుని సీఎం సీట్లో కూర్చున్నారు. జూన్ 29న అవిశ్వాస తీర్మానానికి ముందు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

జూన్ 30న డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, కొత్త ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్‌ షిండే ప్రమాణం చేశారు. ఇలా మ‌హారాష్ట్రలో బీజేపీ- శివ‌సేన (షిండేవ‌ర్గం) ప్ర‌భుత్వం ఉన్న‌ప్ప‌టికీ, ప్ర‌స్తుతం మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మ‌హా వికాస్ అఘాడినే అతిపెద్ద కూటమి. మహారాష్ట్ర శాసనసభలో అధికారిక ప్రతిపక్షం కూడా ఎంవీఏనే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌హా వికాస్ అఘాడీకే ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు మెండుగా ఉందని స‌ర్వేల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.

మ‌హా వికాస్ అఘాడీ ఓట్ల‌ను చీల్చ‌డ‌మే ల‌క్ష్యంగా మోడీ-షాలు కేసీఆర్‌ను మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లోకి దించారన్న‌ది శివ‌సేన నాయ‌కుడు సంజ‌య్ రౌత్ వాద‌న‌. ‘ఈసారి ఎన్నిక‌ల్లో బీజేపీ ఒంట‌రిగా మ‌హారాష్ట్రలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌న్న టార్గెట్‌తో ఉంది. దానికి అవ‌స‌ర‌మైన రాజ‌కీయ వ్యూహాల‌న్నీ ఆచ‌ర‌ణ‌లో పెట్టింది. అందులో భాగ‌మే కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌లు అయి ఉండ‌వ‌చ్చు’ అని ఒక రాజ‌కీయ ప‌రిశీల‌కుడు అభిప్రాయ‌పడ్డారు.

పాట్నాలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల సమావేశం రోజే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేంద్ర మంత్రులతో భేటీ కావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కేసీఆర్‌ కూడా బీఆర్‌ఎస్‌ను దేశమంతా విస్తరిస్తామని చెప్పి ఏపీ, ఇతర రాష్ట్రాల్లోని నాయకులను పార్టీలోకి ఆహ్వానించారు. కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి పోటీ చేస్తామన్నారు. అదీ చేయలేదు. అక్కడ ఎన్నికల సమయంలో కేసీఆర్‌ వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేశారు.

బీజేపీకి లబ్ధి చేకూర్చడానికే ఆయన ఎన్నికలకు దూరంగా ఉన్నారని, ఆయన పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారనే విమర్శలు వచ్చాయి. కొంతకాలంగా ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌ నేతలను పార్టీలో చేర్చుకుంటూ.. మహారాష్ట్ర రాజకీయాలపై మాత్రమే దృష్టి సారించడం అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్‌ వర్గాలు సీఎం సీటుపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో అక్కడ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చన్న వాతావరణం నెలకొని ఉన్నది. ఎన్నికలు రావొచ్చు అనుకుంటున్న సందర్భంలో అక్కడ మహా వికాస్‌ అఘాడీని బలహీనపరచడానికే కేసీఆర్‌ ఇక్కడ పర్యటిస్తున్నారని ఎన్సీపీ, శివసేన నేతలు విమర్శిస్తున్నారు.

యూపీ ఫార్ములానే మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో….!

‘బీజేపీ వ్య‌తిరేక కూట‌మికి ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ ఉన్న రాష్ట్రాల‌లో త‌న బీ-టీంల‌ను పోటీలో దింపి ఓట్లు చీల్చే కుట్ర‌కు మోడీ-షాలు ఎప్పుడో ప్ర‌ణాళిక వేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ఎంఐఎంను పోటీకి దింప‌డం వ‌ల్ల సుమారు 40 స్థానాల్లో స‌మాజ్‌వాదీ పార్టీ అభ్య‌ర్థులు 500 నుంచి 1000 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

బీజేపీకి వ్య‌తిరేకంగా స‌మాజ్‌వాదీ పార్టీకి ప‌డాల్సిన ముస్లిం ఓట్ల‌న్నీ ఎంఐఎంకు ప‌డ్డాయి. దీంతో రెండోసారి యూపీలో బీజేపీ సునాయాసంగా అధికారం చేప‌ట్టింది. ఇప్పుడు ఇదే ఫార్ములాను అనేక రాష్ట్రాల‌లో అమ‌లు చేస్తోంది బీజేపీ.

మ‌హ‌రాష్ట్ర, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ల‌లో బీఆర్ ఎస్ పోటీ కూడా ఇలాంటి వ్యూహంలో భాగ‌మే అయి ఉండ‌వ‌చ్చు’ అని విశ్లేషించారు ఒక రాజ‌నీతి శాస్త్ర ప్రొఫెస‌ర్‌. మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. బీఆరెస్ టార్గెట్ అంతా బీజేపీకి లాభం చేకూర్చ‌డానికే అన్న‌ట్లు ఉంద‌ని అన్నారు.

లాతూర్‌లో బీఆరెస్ కండువా క‌ప్పుకొన్న ఎన్సీపీ నేత‌లంతా ఈ వ్యూహంలో చిక్కిన‌వాళ్లే అని చెప్పారు. మహారాష్ట్ర నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు భగీరథ భాల్కే, ఆయ‌న కుమారుడు భ‌గీర‌థ భాల్కేలను కూడా ఈ వ్యూహంలో భాగంగానే కేసీఆర్ ఆకర్షించారంటున్నారు.

గ్రామీణ స్థాయి నేత‌ల చేరిక‌పైనే దృష్టి!

మ‌హ‌రాష్ట్రలో కేసీఆర్ ప‌ర్య‌ట‌న అస‌లు ల‌క్ష్యం గ్రామీణ స్థాయి నేత‌ల‌ను చేర్చుకోవ‌డ‌మేన‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివ‌సేన‌ (ఠాక్రే వ‌ర్గం) కింది స్థాయి నేత‌ల‌ను ఆక‌ర్షించేందుకే కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. చంద్రపూర్, ఔరంగాబాద్, నాందేడ్, లాతూర్ ప్రాంతాల నుంచి బీఆర్‌ఎస్‌లో చేరుతున్న‌వాళ్లు అధిక సంఖ్య‌లో ఉన్నారు.

భారతీయ జనతా పార్టీకి సహాయం చేయడానికి ఓట్లను విభజించే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌లు ఉంటున్నాయ‌ని, ఇక్క‌డ రైతులు ఇబ్బందులు ప‌డుతున్నారంటున్న కేసీఆర్ తెలంగాణ రైతుల గురించి మాట్లాడ‌రేం అని మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్ ప్ర‌శ్నించారు. ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో జాతీయ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన కేసీఆర్ మ‌హారాష్ట్ర రైతుల‌ను నిలువునా మోసం చేశార‌ని ఆరోపించారు.

2019లో ఎంఐఎం పాత్రే ఇప్పుడు బీఆర్ ఎస్ పోషిస్తోంది

కేసీఆర్‌ బీజేపీకి బీ టీమ్ అని స్పష్టంగా తెలుస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ ఎంఐఎంను పోటీ చేయించి బహుజన్ అఘాడీ (కాంగ్రెస్-ఎన్సీపీ) ఓట్లను చీల్చింది. ఇప్పుడు కేసీఆర్ కూడా ఇక్క‌డ సీట్ల‌ను గెల‌వాల‌ని పోటీ చేయ‌డం లేదు. ఓట్లను విభజించడమే బీఆరెస్‌ ఉద్దేశం’ అని శివ‌సేన అధికార ప్ర‌తినిధి సంజయ్ రౌత్ అభిప్రాయ‌ప‌డ్డారు. ‘ఎంవీఏపై బీఆర్ ఎస్‌ను పోటీ చేయించే వ్యూహంలో భాగంగా కేసీఆర్ బీజేపీ కోసం పనిచేస్తున్నారు.

చంద్రాపూర్, ఔరంగాబాద్ నాందేడ్ త‌దితర ప్రాంతాల‌ నుండి కూట‌మి నుండి ఎక్కువ మంది నాయకులను చేర్చుకోవ‌డంపై బీఆరెస్‌ దృష్టి సారించింది. మ‌హా వికాస్ అఘాడీ ఓట్ల‌ను చీల్చేందుకు బీజేపీ కేసీఆర్‌ను ఉసి గొల్పింది’ అని ఆయన చెప్పారు. కేసీఆర్‌కు ఫైటర్‌ అనే ఇమేజ్‌ ఉన్నది. ఎందుకు బీజేపీకి పాదాక్రాంతమవుతున్నారు? కేసీఆర్‌ ఇలాగే నాటకాలు ఆడితే.. తెలంగాణలోనూ అధికారం కోల్పోవడం ఖాయం.

కేవలం ఓటమి భయంతోనే కేసీఆర్‌ మహారాష్ట్రకు వస్తున్నారు. 12 నుంచి 13 మంది బీఆరెస్‌ నేతలు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణలో బీఆరెస్‌, కాంగ్రెస్‌ మధ్య పోరు నడుస్తున్నది. కావాలంటే మీ రెండు పార్టీల మధ్య మేం మధ్యవర్తిత్వం చేస్తాం. కానీ.. మీరు మహారాష్ట్రలో ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే.. మీరు బీజేపీ కోసం పని చేస్తున్నట్టు నేను చెప్పాల్సి వస్తుంది.

మ‌హా వికాస్ అఘాడీ ఓట్ల‌ను చీల్చేందుకు బీజేపీ కేసీఆర్‌ను ఉసి గొల్పింది. కేసీఆర్‌ ప్రభావం మహారాష్ట్ర రాజకీయాలపై ఏమీ ఉండదు. మహా వికాస్‌ అఘాడీ ఇక్కడ బలంగా ఉన్నది.

బీజేపీకి సాయం చేసేందుకే కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌లు

భారతీయ జనతా పార్టీకి సహాయం చేయడానికి ఓట్లను చీల్చే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌లు ఉంటున్నాయి. ఇక్క‌డ రైతులు ఇబ్బందులు ప‌డుతున్నారంటున్న కేసీఆర్.. తెలంగాణ రైతుల గురించి మాట్లాడ‌రేం? ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో జాతీయ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన కేసీఆర్ మ‌హారాష్ట్ర రైతుల‌ను నిలువునా మోసం చేశారు.
– జయంత్ పాటిల్, మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు

ఎందుకు బీజేపీకి పాదాక్రాంతమవుతున్నారు?

బీజేపీ హైదరాబాద్‌ నుంచి మొదట అసదుద్దీన్‌ను పంపింది. ఇప్పుడు కేసీఆర్‌ను పంపుతున్నది. కేసీఆర్‌కు ఫైటర్‌ అనే ఇమేజ్‌ ఉన్నది. ఎందుకు బీజేపీకి పాదాక్రాంతమవుతున్నారు? కేసీఆర్‌ ఇలాగే నాటకాలు ఆడితే.. తెలంగాణలోనూ అధికారం కోల్పోవడం ఖాయం. ఓటమి భయంతోనే కేసీఆర్‌ మహారాష్ట్రకు వస్తున్నారు. తెలంగాణలో బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య పోరు నడుస్తున్నది. కావాలంటే మేం మధ్యవర్తిత్వం చేస్తాం. కానీ.. మహారాష్ట్రలో ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే.. మీరు బీజేపీ కోసం పని చేస్తున్నట్టు నేను చెప్పాల్సి వస్తుంది. మ‌హా వికాస్ అఘాడీ ఓట్ల‌ను చీల్చేందుకు బీజేపీ కేసీఆర్‌ను ఉసి గొల్పింది.
– సంజయ్‌ రౌత్‌, శివసేన (ఠాక్రే) నేత

కేసీఆర్ మాట‌లు న‌మ్మి ఉల్లి రైతులు నిండా మునిగారు: శ‌ర‌ద్ ప‌వార్‌

మహారాష్ట్రలో కంటే తెలంగాణలో ఉల్లి రైతులు తమ ఉత్పత్తులను క్వింటాల్‌కు రూ.1,800 నుంచి 2,100కు అమ్ముకుంటున్నారు అన్న కేసీఆర్ మాట‌లు న‌మ్మి ప‌లువురు రైతులు తెలంగాణ‌లో ఉల్లిపాయ‌లు అమ్మ‌డానికి వెళ్లారు. అక్క‌డ కేసీఆర్ చెప్పిన దాంట్లో స‌గం ధ‌ర కూడా లేద‌ని గుర్తించారు. త‌న‌ రాజకీయ ఎజెండా కోసం, ఉల్లి రైతులకు మంచి ధర లభిస్తున్నట్లు కేసీఆర్ న‌మ్మ‌బ‌లికారు.
– శరద్ పవార్, ఎన్సీపీ అధ్యక్షుడు

బీఆర్ ఎస్‌ పక్కా బీజేపీకి బీ టీమ్‌

‘మహారాష్ట్ర రాజకీయాలపై ఆయన ప్రభావం ఉండబోదు. ఓట్ల చీలిక ఎవరికి మేలు చేస్తుందో ప్రజలకు తెలుసు. తెలంగాణలో బీఆర్ెస్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. అనేక మంది నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. తెలంగాణ నమూనా కూడా గుజరాత్‌ మోడల్‌ వంటి మోసపూరితమైనదే ఆషాఢ ఉత్సవాల సందర్భంగా విఠోభా ఆలయానికి లక్షలాది మంది వస్తారు. ఇటువంటి సమయంలో600 కార్లు వేసుకుని రావడం సబబేనా?
– మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోల్‌