Election Commission। ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్యానెల్‌ నుంచి సీజే తొలగింపు

Election Commission। రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం ఈసీని తోలుబొమ్మ చేసే ప్రయత్నమన్న కాంగ్రెస్‌ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు కేంద్రం గురువారం రాజ్యసభలో ఒక బిల్లు ప్రవేశపెట్టింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముగింపునకు ఒక్క రోజు ముందు కేంద్రం బిల్లు తీసుకురావడం గమనార్హం. అయితే.. ఈ ప్యానెల్‌లో భారత ప్రధాన న్యాయమూర్తిని (Chief Justice of India) తొలగించడం వివాదానికి దారి తీసింది. ఈ బిల్లు పార్లమెంటు […]

  • Publish Date - August 10, 2023 / 01:03 PM IST

Election Commission।

  • రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం
  • ఈసీని తోలుబొమ్మ చేసే ప్రయత్నమన్న కాంగ్రెస్‌

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు కేంద్రం గురువారం రాజ్యసభలో ఒక బిల్లు ప్రవేశపెట్టింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముగింపునకు ఒక్క రోజు ముందు కేంద్రం బిల్లు తీసుకురావడం గమనార్హం. అయితే.. ఈ ప్యానెల్‌లో భారత ప్రధాన న్యాయమూర్తిని (Chief Justice of India) తొలగించడం వివాదానికి దారి తీసింది.

ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే.. ఎన్నికల కమిషనర్ల నియామకంలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. సీఈసీ, ఈసీలను నియామకంపై పార్లమెంటు చట్టం చేసే వరకూ ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండే ఒక ప్యానెల్‌ వారిని ఎంపిక చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) గతంలో తీర్పు చెప్పింది.

ఈ నేపథ్యంలో ప్యానెల్‌లో ఎవరు ఉండాలనే విషయంలో ఈ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ప్రతిపాదిత బిల్లు ప్రకారం.. ప్రధాన మంత్రి (Prime Minister), ప్రతిపక్ష నాయకుడు (Leader of Opposition), ప్రధాని నామినేట్‌ చేసే ఒక కేంద్ర మంత్రి (Union Cabinet Minister) ప్యానెల్‌లో ఉంటారు. మూడో సభ్యుడిగా సీజేఐ ఉండాల్సి ఉన్నా.. కేంద్రం ఆ స్థానంలో నామినేటెడ్‌ మంత్రిని తీసుకురావడం గమనార్హం.

కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయికి తగ్గని అధికారిని తగిన అర్హతల ఆధారంగా ప్యానెల్‌ ఎంపిక చేస్తుందని బిల్లులో పేర్కొన్నారు. క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శుల స్థాయికి తగ్గని ఇద్దరు అధికారులతో సెర్చ్‌ కమిటీ ఉంటుందని బిల్లు పేర్కొంటున్నది.

ఐదుగురి పేర్లను సెర్చ్‌ కమిటీ (search committee) సెలక్షన్‌ కమిటీకి సిఫారసు చేస్తుంది. ప్రతిపక్ష నేత విషయంలో స్పష్టతనిచ్చిన బిల్లు.. అతిపెద్ద పార్టీ నాయకుడు కాకుండా.. ప్రతిపక్ష నాయకుడు సభ్యుడిగా ఉంటారని తెలిపింది. అయితే.. బిల్లుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది సుప్రీం కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నదని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.

.ఎన్నికల కమిషన్‌(Election Commission)ను ప్రధాని చేతిలో తోలుబొమ్మలా చేసేందుకు ఈ బిల్లును ఉద్దేశించారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ విమర్శించారు. నిష్పాక్షిక ప్యానెల్‌ ఉండాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సంగతేంటని ఆయన ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన, ఏకపక్షమైన, పక్షపాతంతో కూడిన బిల్లు అని ఆయన ‘ఎక్స్‌’ పోస్టులో వ్యాఖ్యానించారు. దీనిని ప్రతి ఫోరంలోనూ తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.

Latest News