Site icon vidhaatha

Supreme Court I వివేకా కేసు విచారణాధికారిని మార్చండి.. సుప్రీం కోర్ట్ ఆదేశం

విధాత‌: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) కేసు విచారణ మళ్ళీ మొదటికి వచ్చింది. దాదాపు నాలుగేళ్లుగా సాగుతున్న సీబీఐ (CBI) విచారణ తీరును సుప్రీమ్ కోర్టు ఆక్షేపిస్తూ ఇక మీ ప్రతాపము చాలు… ఇంకెన్నాళ్లు చేస్తారు.. ముందు ఆయన్ను మార్చండి అంటూ కేంద్రాన్ని ఆదేశించింది. హత్యకు దారితీసిన ప్రధాన కారణాలు దాని వెనుక ఉన్న ఉద్దేశాలు బయటపెట్టాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు(Supreme court) న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా సీబీఐ(CBI)కి ఆదేశాలు జారీ చేశారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు అధికారిని మార్చాలంటూ ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దర్యాప్తు వేగంగా జరగడం లేదని.. అందువల్ల దర్యాప్తు చేస్తున్న అధికారులను మార్చాలని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసును ఇంకా ఎంత కాలం విచారిస్తారని సుప్రీంకోర్టు సీబీఐని ప్రశ్నించింది. కేసు అంతా రాజకీయ దురుద్దేశంతో కూడినదేనని రిపోర్ట్లో రాశారని న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా అన్నారు.

హత్యకు దారితీసిన ప్రధాన కారణాలు దాని వెనుక ఉన్న ఉద్దేశాలను సీబీఐ(CBI) బయటపెట్టాలని న్యాయస్థానం సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. విచారణాధికారిని మార్చాలని.. లేదా ఇంకో అధికారిని నియమించాలని సూచించింది. అలాగే అవసరమైతే ఇప్పుడున్న అధికారిని కొనసాగించవచ్చంది.

కాగా వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన సీల్డ్ కవర్ నివేదికను ఆసాంతం చదివామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ స్టేటస్ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేదని సీబీఐపై మండిపడింది. తదుపరి దర్యాప్తు పేరుతో ఎంతకాలం ఈ కేసు విచారణను సాగదీస్తారని ప్రశ్నించింది. స్టేటస్ రిపోర్టులో ఎక్కడ చూసినా రాజకీయ వైరం అని మాత్రమే రాశారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. విస్తృత స్థాయిలో ఉన్న కుట్ర గురించి ఏమాత్రం దర్యాప్తు చేసినట్టు లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Exit mobile version