Cheetahs Fight
- రెండు దక్షిణాఫ్రికా చిరుతలకు గాయాలు
భోపాల్: అటవీ ప్రాంతంలో ఎవరు ఏ పరిధిలో ఉండాలనే విషయంలో చిరుతలకు గెట్టు పంచాయితీ వచ్చింది. అంతే రెండు గ్రూపులుగా విడిపోయి.. కొట్టుకున్నాయి. ఒకదానిపై మరొకటి దాడి చేసుకున్నాయి. చివరకు పంచాయతీ ఏం తేలిందో కానీ.. రెండు చిరుతలకు మాత్రం గాయాలయ్యాయి. ఈ ఘటనలో సౌత్ ఆఫ్రికన్ చీతాలు గాయపడ్డాయి. అందులో ఒకదానికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చోటు చేసుకున్నది. దేశంలో అంతరించి పోయిన చీతాల సంఖ్యను పెంచేందుకంటూ నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి కేంద్ర ప్రభుత్వం చీతాలను తెప్పించిన సంగతి తెలిసిందే. ఇటీవల వీటిని అటవీ ప్రాంతంలోకి వదిలిపెట్టారు.
అయితే.. ఏ ప్రాంతంపై ఎవరిది ఆధిపత్యం అనే విషయంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగిందని అటవీ అధికారులు తెలిపారు. అదే సమయంలో ఆడ చిరుతలను ఆకర్షించే విషయంలో కూడా అవి తగాదా పడి ఉంటాయని మరికొందరు అధికారులు చెప్పారు.
ఈ ఘర్షణలో దక్షిణాఫ్రికా నుంచి తెప్పించిన చీతా ‘అగ్ని’ ప్రత్యర్థి చీతాల పంజా దెబ్బలకు, పంటి గాట్లకు తీవ్రంగా గాయపడిందని కునో నేషనల్ పార్క్ డీఎఫ్‌వో ప్రకాశ్ కుమార్ వర్మ తెలిపారు. మరో చీతా ‘వాయు’ కూడా గాయపడింది. గాయపడిన చీతాలను మూసివేసి ఉంచిన భారీ పంజరాల్లోకి తరలించామని, వాటికి పశువైద్యులు చికిత్స అందిస్తున్నారని అధికారులు తెలిపారు.
అయితే వాటికి ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పారు. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి అగ్ని, వాయు.. నమీబియా నుంచి వచ్చిన గౌరవ్, శౌర్య మధ్య బుధవారం ఈ ఘర్షణ జరిగింది. నమీబియాకు చెందిన చీతాల్లో వేటీకి పెద్దగా గాయాలు కాలేదని, వాటికి ప్రత్యేకంగా చికిత్స ఏమీ అవసరం లేదని అధికారులు చెప్పారు.