Site icon vidhaatha

వచ్చే ఎన్నికలు..పేదలకు పెత్తందారులకు మధ్య యుద్దం

విధాత, హైదరాబాద్ : 2024 అసెంబ్లీ ఎన్నికల యుద్ధం రెండు సిద్ధాంతల మధ్య జరగబోతోందని, పేదలకు.. పెత్తందారులకు మధ్య జరగబోతుందని, విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగబోతుందని,వేరే రాష్ట్రాల్లో ఉంటూ.. అప్పుడప్పుడు మోసం చేసేందుకు వచ్చే ‘నాన్ రెసిడెన్సీ ఆంధ్రాస్ వాళ్లకు, ఈ గడ్డ మీద పుట్టి, ఇక్కడే మీ మధ్య ఉంటున్న మనకు మధ్య జరిగే యుద్దమని ఈ యుద్దానికి మీరంతా సిద్ధమా అని ఏపీ సీఎం జగన్ ప్రజలను ప్రశ్నించారు. రాప్తాడు వైసీపీ సిద్ధమా సభలో ఆయన ప్రసంగిస్తూ 57 నెల్లలో కనివినీ ఎరుగని విధంగా విప్లవాత్మక రాష్ట్రంలో మార్పులు తీసుకొచ్చామని జగన్‌ తెలిపారు.


ఐదేళ్ల కిందట టీడీపీ పాలన, ప్రస్తుత వైసీపీ పాలన గురించి ప్రతి ఇంటికి వివరించాలని కార్యకర్తలకు సీఎం సూచించారు. 125 సార్లు బటన్ నొక్కి రూ.2.55 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రతి గ్రామంలో జగన్ మార్క్ కనపడుతోందని తెలిపారు. ప్రజలు ఒక్కసారి ఆశీర్వదిస్తేనే ఇంత మంచి చేయగలిగామని, రెండు, మూడు, నాలుగో సారీ గెలిపిస్తే ఎంత మంచి జరుగుతుందో అందరికీ వివరించాలని కోరారు.


మరోవైపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రైతులకు ఏమైనా చేశారా అంటూ దుయ్యబట్టారు. అక్కాచెల్లెమ్మలకు కనీసం ఒక్క పథకమైనా పెట్టారా… బడికి వెళ్లే విద్యార్థులకు ఏమైనా చేశారా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల కోసం ఏమీ చేయలేదని.. ఒక్క పథకం తీసుకురాలేదన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకం గుర్తుకు రాదని విమర్శించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. మీరిచ్చిన మేనిఫెస్టోలో కనీసం మూడు శాతం అమలు చేశారా అని ప్రశ్నించారు.


ఇప్పుడు మరోసారి అలాంటి అబద్ధాలు, మోసాలతో మేనిఫెస్టోతో ముందుకువస్తున్నాడన్నారు. బంగారు కడియం ఇస్తామని ఊబిలోకి దింపి మనుషులను తినేసే పులి మాదిరిగా ఎర చూపిస్తున్నారని దుయ్యబట్టారు. ఆరు స్కీమ్ లు అంటాడని,రంగురంగుల మేనిఫెస్టోతో మళ్లీ మోసం చేసేందుకు బయల్దేరాడని అన్నారు. నమ్మినవాడు మునుగుతాడు.. నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడనే చంద్రబాబు సిద్ధాంతమన్నారు. చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసపూరితమని, గతంలో 87 వేల 612 వందల కోట్ల రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేశారన్నారు.


ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో…సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి


మరో రెండు నెలల్లోనే ఎన్నికలు రానున్నాయని.. ఈరోజు నుంచి చూస్తే మరో 55 రోజులు కూడా ఉండవేమోనని అన్నారు. ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పని చేయడానికి చంద్రబాబు ప్రచారాలు, వారి అబద్ధాలు, మోసాలు.. వీటన్నింటిని నుంచి ఇంటింటి అభివృద్ధి, పేదవాడి భవిష్యత్ను కాపాడేందుకు మీరంతా సిద్దం కావాలన్నారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలని, తాగేసిన టీ గ్లాసు సింక్ లోనే ఉండాలని జగన్‌ డైలాగ్ కొట్టారు. గత ఎన్నికల్లో చొక్కాలు మడిచి ప్రజలు మీ కుర్చీ మడత పెట్టేశారని, మీకెందుకు ఓటేయాలని ప్రశ్నించారు.


మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయని.. ఆ సెల్ ఫోన్లు ఒక్కసారి బయటకు తీయండని, అందులో లైట్ ఐటన్ నొక్కండని, సెల్ టార్చర్ ఆన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా వైసీపీని గెలిపించేందుకు, చంద్రబాబును ఓడించేందుకు సిద్ధమే అని చెప్పండని అన్నారు. ప్రతి కార్యకర్త, బూత్ కమిటీ సభ్యులుగా, గృహసారథులుగా, వాలంటీర్లుగా మీ పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. సమరభేరి మోగిద్దాం, సమరనాదం వినిపిద్దాం.. మరో గొప్ప చారిత్రాత్మక విజయానికి మరో అడుగు వేయడానికి అందరం కూడా సిద్దం కావాలన్నారు.


ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు వయసు 80కి చేరుతుందని, అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ రూపురేఖలు కూడా ఎక్కడా కనిపించవని ఆరోపించారు. ఈ ఎన్నికలు చాలా కీలకమని, అందుకే పెత్తందార్లంతా ఏకం అవుతున్నారని, తోడేళ్లుగా ఏకం అవుతున్నారన్నారన్నారు. వీరంతా సరిపోరు అని జాతీయ పార్టీలను కూడా పరోక్షంగా ఒకరితో, ప్రత్యక్షంగా ఒకరితో పొత్తు తెచ్చుకొనేందుకు వెంపర్లాడుతున్నాడని దుయ్యబట్టారు. ఈ తోడేళ్లను ఎదుర్కోవాలంటే మీ జగన్ ఒకడికే సాధ్యం కాదని, మీ జగన్‌కు ప్రతి గుండె తోడుగా నిలబడాలన్నారు.


ప్రతి ఇంట్లో ఉన్న అక్కచెల్లెమ్మ, అవ్వాతాత, తల్లీతండ్రీ, రైతన్న కూడా మీ జగన్కు తోడుగా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు రేప్పొద్దున పేదవాడి భవిష్యత్ను, జీవితాన్ని నిర్ణయించే ఓటు అవుతుందన్నారు. పొరపాటు జరిగిందంటే పేదవాడి బతుకులు అతలాకుతలం అవుతాయని పేర్కొన్నారు. పేదవాడి భవిష్యత్ మారాలంటే, పేదవాడి పిల్లాడు రేప్పొద్దున 10-15 సంవత్సరాలకు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడాలంటే, పెత్తందార్లతో పోటీ పడుతూ పెద్ద కంపెనీలతో ఉద్యోగాలు సంపాదించుకోవాలంటే జరగబోయే ఎన్నికలలో మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలన్నారు.


నిజంగా జగన్ మంచి చేయలేదని అనుకుంటే మేనిఫెస్టోలో చెప్పినవి చేయలేదనుకుంటే ప్రజాబలం లేదనుకుంటే ఇంతమందితో చంద్రబాబుకు పొత్తు ఎందుకని జగన్‌ నిలదీశారు. తన నడక కోసం ఆటో కర్ర ఇటో కర్ర ఎందుకయ్యా చంద్రబాబు అని ప్రశ్నించారు. తన సైకిల్ తోయడానికి నీకు ఒక ప్యాకేజి స్టార్ ఎందుకని మండిపడ్డారు. ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టలో బంధించిన చంద్రముఖి బెడద శాశ్వతంగా ఉండదన్నారు. పొరపాటు చేశారంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుందని విమర్శించారు. టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుందని పేదల రక్తం తాగేందుకు లక లక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుందని ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండని కార్యకర్తలను జగన్ కోరారు.

Exit mobile version