Site icon vidhaatha

ప్రారంభమైన భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ భేటీ

హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

విధాత, హైదరాబాద్‌: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నివాసంలో భువనగిరి పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం కొనసాగుతుంది. భువనగిరి పార్లమెంటు స్థానం ఇంచార్జిగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశానికి భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మేల్యేలు వేముల వీరేశం, బీర్ల అయిలయ్య, కుంభం అనిల్ కుమార్‌రెడ్డి, మందుల సామెల్, మల్ రెడ్డి రంగారెడ్డిలు సహా ముఖ్య నాయకులు హాజరయ్యారు.

నియోజకవర్గాల పునర్విభజన అనంతరం భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో 2009లో కాంగ్రెస్ నుంచి రాజగోపాల్‌రెడ్డి గెలువగా, 2014లో బీఆరెస్ నుంచి బూర నర్సయ్యగౌడ్, 2019లో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గెలుపొందారు. భువనగిరి లోక్‌సభ నియోజవకర్గం పరిధిలోని ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్‌(ఎస్సీ), తుంగతుర్తి(ఎస్సీ), ఇబ్రహీంపట్నంలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

జనగామలో మాత్రం బీఆరెస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏడింటిలో ఆరు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోనే ఉండటంతో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న ధీమాతో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. అయితే బీసీ ఓటర్లు మెజార్టీగా ఉన్న భువనగిరి లోక్ సభ స్థానంలో బీఆరెస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌యాదవ్, బీజేపీ నుంచి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్‌లు బీసీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.

ముఖ్యంగా బీజేపీ అభ్యర్థికి బూర నర్సయ్యగౌడ్ గతంలో ఈ నియోజకర్గం నుంచి బీఆరెస్ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండటం, మోదీ చరిస్మా నేపథ్యంలో ఆయన నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. దీంతో అప్రమత్తమైన సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా రాజగోపాల్ రెడ్డికి ఇంటికి వెళ్లి ఆయన నివాసంలోనే భువనగిరి లోక్‌సభ స్థానంలో పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన అంశాలపైన, గెలుపు వ్యూహాలపైన సమీక్ష చేస్తున్నారు.

Exit mobile version