The Elephant Whisperers । బొమ్మన్‌, బెల్లీకి తమిళనాడు సీఎం సత్కారం

లక్ష చొప్పున ప్రోత్సాహకం అందజేత ఎలిఫెంట్‌ క్యాంపుల్లోని 91 మంది సిబ్బందికి కూడా The Elephant Whisperers । ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ చిత్ర దర్శక నిర్మాతలు ఆస్కార్‌ వేదికపై అవార్డులు అందుకుంటే.. ఆ డాక్యుమెంటరీలో ‘జీవించిన’ బొమ్మన్‌, బెల్లీలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తన చాంబర్‌కు పిలిపించుకుని సత్కరించారు. వారికి లక్ష చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేశారు. విధాత : ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ రియల్‌ స్టార్స్‌ బొమ్మన్‌, బెల్లి అరుదైన సత్కారం పొందారు. […]

  • Publish Date - March 15, 2023 / 10:42 AM IST

  • లక్ష చొప్పున ప్రోత్సాహకం అందజేత
  • ఎలిఫెంట్‌ క్యాంపుల్లోని 91 మంది సిబ్బందికి కూడా

The Elephant Whisperers । ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ చిత్ర దర్శక నిర్మాతలు ఆస్కార్‌ వేదికపై అవార్డులు అందుకుంటే.. ఆ డాక్యుమెంటరీలో ‘జీవించిన’ బొమ్మన్‌, బెల్లీలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తన చాంబర్‌కు పిలిపించుకుని సత్కరించారు. వారికి లక్ష చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేశారు.

విధాత : ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ రియల్‌ స్టార్స్‌ బొమ్మన్‌, బెల్లి అరుదైన సత్కారం పొందారు. వీరు ఏనుగులతో కలిసిపోయి జీవించిన కాలాన్ని అద్భుత దృశ్యకావ్యంగా మలిచినందుకు షార్ట్‌ ఫిలిం డైరెక్టర్‌ కార్తికి గొన్సాల్వెస్‌(Kartiki Gonsalves)కు, చిత్రాన్ని నిర్మించిన గునీత్‌ మొంగా (Guneet Monga) ఆస్కార్‌ అవార్డు పొందిన విషయం తెలిసిందే. ఈ విజయం నేపథ్యంలో బొమ్మన్, బెల్లిలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తన కార్యాలయానికి పిలిపించుకుని వారికి శాలువాలు కప్పి సన్మానించారు. వారికి చెరొక లక్ష రూపాయలు ప్రోత్సాహకంగా అందించారు.

తమిళనాడులో రెండు ఎలిఫెంట్‌ క్యాంపులు ఉన్నాయి. వీటిలో 91 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారందరికీ కూడా లక్ష చొప్పున ప్రోత్సాహకం అందించనున్నట్టు ప్రకటించారు. వీటికి తోడు క్యాంపులలో పనిచేసేవారికి పర్యావరణ హితంగా, వారి జీవన సంస్కృతిని ప్రతిబింబించేలా ఇళ్లు కట్టించి ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న రెండు క్యాంపులకు తోడు కోయంబత్తూర్‌ (Coimbatore)లో మరో క్యాంపును నెలకొల్పనున్నట్టు సీఎం స్టాలిన్‌ ప్రకటించారు.

గజరాజుల పట్ల తమిళనాడు అటవీ అధికారులు చూపే శ్రద్ధ ఈ డాక్యుమెంటరీ ద్వారా ప్రపంచం దృష్టికి వచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అనాథ అయిన రఘు అనే ఒక గున్న ఏనుగును బొమ్మన్‌, బెల్లి సాదిన తీరు ఈ చిత్ర కథాంశం. తమిళనాడు నీలగిరి సానువుల్లోని ముదుములై అటవీప్రాంతంలో ఈ షార్ట్‌ ఫిలింను చిత్రీకరించారు. 40 నిమిషాల ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణ పూర్తయ్యేందుకు ఆరు సంవత్సరాలు పట్టింది. అనాథ అయిన చిన్నారి గున్న ఏనుగు ఆరేళ్లలో ఎలా పెరుగుతూ వచ్చిందో, ఆ సమయంలో బొమ్మన్‌, బెల్లి దానితో ఎలా మమేకమైపోయారో చిత్రంలో చూపించారు.

కిటకిటలాడుతున్న తెప్పకాడు ఎలిఫెంట్‌ క్యాంప్‌

ఈ చిత్రం విజయం నేపథ్యంలో రఘు అనే ఏనుగు ఉన్న తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్‌ (Mudumalai Theppakadu elephant camp) సందర్శకుల రద్దీతో కిటకిటలాడిపోతున్నది. అక్కడికి వచ్చిన సందర్శకులు రఘును చూసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

మనకు, మన ప్రకృతి మాతకు ఉన్న పవిత్ర సంబంధం ఇది

అవార్డు అందుకున్న సందర్భంగా గొన్సాల్వెన్స్‌ మాట్లాడుతూ.. ‘మనకు, మన ప్రకృతి మాతకు మధ్య ఉన్న పవిత్రమైన సంబంధాన్ని గురించి మాట్లాడేందుకు నేనీ రోజు ఇక్కడ నిలబడి ఉన్నాను.. స్థానిక గిరిజన తెగల గౌరవం కోసం మాట్లాడుతున్నాను’ అని చెప్పారు.

Latest News