Site icon vidhaatha

LPG Cylinder | బ‌డ్జెట్ నాడూ బాదుడే.. మ‌ళ్లీ పెరిగిన సిలిండ‌ర్ ధ‌ర‌

LPG Cylinder | విధాత‌: బ‌డ్జెట్ నాడు కూడా సామాన్యుల‌పై బాదుడు ఆగ‌లేదు. ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) వాణిజ్య ఎల్పీజీ సిలిండ‌ర్ల ధ‌ర‌ను మ‌ళ్లీ పెంచాయి. 19 కేజీల గ్యాస్ సిలిండర్‌ ధర రూ. 14 పెరిగింది. కొత్త రేట్లు గురువారం నుంచి అమ‌లులోకి వ‌చ్చాయి. ధరల పెంపు తర్వాత ఢిల్లీలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రిటైల్ ధర ఇప్పుడు రూ.1,769.50కి చేరింది. ముంబైలో రూ.1,723.50, కోల్‌క‌త్తాలో రూ. 1,887, చెన్నైలో రూ.1,937కు పెరిగింది.


అయితే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు మాత్రం యథాతథంగానే ఉన్నాయి. స్థానిక పన్నుల కారణంగా దేశీయ వంటగ్యాస్ ధరలు రాష్ట్రాలవారీగా మారుతూ ఉంటాయి. గ‌త ఏడాది మార్చి 1న 14 కిలోల‌ డొమెస్టిక్ సిలిండర్ ధరలలో చివరి సవరణ జరిగింది. 2021 జ‌న‌వ‌రి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో వాణిజ్య సిలిండ‌ర్ల ధ‌ర‌లు 50 సార్లు, డొమెస్టిక్ సిలిండ‌ర్ల ధ‌ర‌లు 17 సార్లు మారాయి.


మరోవైపు ఓఎంసీలు గురువారం విమాన ఇంధన ధరలను తగ్గించాయి. కిలో లీటరుకు దాదాపు రూ.1221 మేర ధరలు తగ్గాయి. విమాన చార్జీలను తగ్గించే అవకాశం ఉన్న ఏటీఎఫ్ ధరల్లో తగ్గింపు ఇది వరుసగా నాలుగోసారి. కొత్త ఏటీఎఫ్ ధరలు గురువారం నుంచి అమ‌ల‌వుతాయి.

Exit mobile version