Congress
- ఒక్కోచోట మూడు నుంచి నలుగురు వరకు
- వారసుల కోసం జానారెడ్డి పాట్లు
- ఎదురు లేని సీనియర్లు
- గ్రేటర్ లో వలస నేతలపై ఆశలు
(విధాత న్యూస్ నెట్ వర్క్)
పార్టీ రాష్ట్రంలో కనుమరుగైందా? అన్న పరిస్థితి నుంచి వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికార పగ్గాలు చేపట్టే అవకాశం ఉందన్న స్థాయికి కాంగ్రెస్ పార్టీ ఎదిగింది. బీఆరెస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అన్నఅభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. మునుగోడు ఉప ఎన్నికలు ముగిసే వరకు రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా బీజేపీని చూసిన ప్రజల్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. దీనికి తోడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ తీసుకువచ్చింది.
ఆ తరువాత వరుసగా జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ, బీఆరెస్ మధ్య రహస్య అవగాహన కుదిరిందన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చజరిగింది. దీంతో బీజేపీలోకి వెళ్లాలనుకున్న సీనియర్ నేతలు చాలా మంది ఆగిపోయారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు లాంటి బలమైన నేతలు కాంగ్రెస్ లో చేరారు.
అలాగే సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై పోరాటం, ధరణి రద్దు తదితర అంశాలపై చేపట్టి కార్యక్రమాలతో పార్టీ యాక్టివిటీ పెరిగింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్ననమ్మకం కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో, నాయకత్వంలో ఏర్పడింది. దీంతో మెజార్టీ నియోజక వర్గాలలో కాంగ్రెస్ పార్టీకీ ఆశావాహుల సంఖ్య పెరిగింది. సీనియర్ లీడర్లు మినహా మిగిలినచోట్ల అభ్యర్థిత్వం కోసం నేతలు పోటీపడుతున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఒకటి రెండు నియోజక వర్గాలలో పార్టీకి అనుకూల వాతావరణం ఉన్నాఅక్కడ బలమైన నేతలు లేరు. దీంతో పార్టీ నాయకత్వం ఇతర పార్టీలోని బలమైన నేతలపై కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై విధాత న్యూస్ నెట్ వర్క్ చేసిన పరిశీలనలో 71 నియోజకవర్గాలలో తమకు టికెట్ కావాలనే ఆశావాహుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
కాగా పార్టీకి రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకులున్న 39 నియోజకవర్గాలలో ఒక్కరే అభ్యర్థి పోటీలో ఉన్నారు. కాగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, హైదరాబాద్ లోని గోషామహల్ లో పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ అక్కడ బలమైన నేతలు లేక పోవడంతో ఇతరులపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కాగా హైదరాబాద్ పాత నగరంలోని 7 సీట్లలో పార్టీ నామమాత్రంగానే ఉండడంతో ఇక్కడ అధిష్టానం ఎవరిని నియమిస్తే వాళ్లే పోటీ చేసే అవకాశం ఉంది.
టికెట్ల లొల్లి..
రాష్ట్రంలో వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆరెస్ కు సహజంగానే జనంలో కొంత వ్యతిరేకత నెలకొనడం, బీఆరెస్ సిటింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి, కర్ణాటక ఎన్నికల పిదప పెరిగిన కాంగ్రెస్ గ్రాఫ్ తో కాంగ్రెస్ తిరిగి బలం పుంజుకుంటున్న నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యం కాంగ్రెస్ సీనియర్లలో కనిపిస్తుంది.
అయితే కాంగ్రెస్ లో ఉండే అపరిమిత అంతర్గత ప్రజాస్వామ్యం వల్ల ఆయా నియోజకవర్గాలలో గ్రూప్ తగాదాలు, టికెట్ ఆశిస్తున్న నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఆ పార్టీకి సమస్యగా తయారైంది. పచ్చి గడ్డి వేస్తే బగ్గు మనే స్థాయిలో విభేదాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ నేతలు సమన్వయం గా ముందుకు వెళితే గమ్యాన్ని సులువుగా చేరుకోవచ్చునన్నఅభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వెలువడుతోంది.
రేవంత్ తో పెరిగిన దూరంతో..
సంగారెడ్డి లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నప్పటికీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తో గ్యాప్ వచ్చింది. ఆయన టిఅర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. డీసీసీ అధ్యక్షురాలుగా ఉన్న ఆయన సతీమణి నిర్మలా జగ్గారెడ్డి పార్టీ మారడని ఇటీవల స్పష్టం చేసినప్పటికీ కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఒక వేళ జగ్గారెడ్డి బిఆర్ఎస్లోకి వెళ్తే మాజీ ఉప ముఖ్యంత్రిగా పనిచేసిన దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినిరెడ్డిని సంగారెడ్డి నియోజక వర్గంలో కాంగ్రెస్ నుండి పోటీ చెసే అవకాశాలు ఉన్నాయి.
మూడు గ్రూపులు.. ఆరు వర్గాలు
ఒకరంటే ఒకరు గిట్టని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుల్లో నెలకొంది. బహిరంగంగా విమర్శించుకోవడమే కాకుండా పలు సందర్భాల్లో తన్నుకోవడం అలవాటుగా మారింది. వరంగల్ లో ఇటీవల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా రెండు వర్గాలు పోటీపడి తన్నుకున్నాయి. వీరిద్దరిని సమన్వయం చేయలేక ఆ జిల్లా పార్టీకి అధ్యక్షుడిని నియమించే పరిస్థితి లేకపోవడం పార్టీ దుస్థితికి అద్దంపడుతోంది. పైగా జంగారెడ్డి అనుచరులను పార్టీ నుంచి సస్పండ్ కూడా చేశారు.
కరీంనగర్ పై పట్టు కోసం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకనాడు బలీయమైన రాజకీయ శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఏర్పాటు అనంతరం ఉనికి కోల్పోయింది. గత శాసనసభ ఎన్నికల్లో జిల్లాలోని 13 స్థానాల్లో కేవలం ఒకే ఒక స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ కరీంనగర్ పై ప్రత్యేక దృష్టి సారించింది.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నట్టు పార్టీ అంతర్గత సర్వేల్లో తేలడంతో, ఆయా నియోజకవర్గాల్లో ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థుల కోసం పార్టీ అన్వేషిస్తోంది.
గెలుపు అవకాశాలపై ఇప్పటికే మూడు సర్వేలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని కుండబద్దలు కొట్టింది. నియోజకవర్గాల వారీగా సామాజిక సమీకరణలు, ఆశావహులు, వారి బలా,బలాలు, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల బలాబలాపై పిసిసి దృష్టి సారించింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో…
జిల్లాపై ఆధిపత్యం కోసం ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు జిల్లా రాజకీయాలపై పట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సిట్లు గెలిచే అవకాశం ఉందన్న సర్వేల నేపధ్యంలో టికెట్ల కోసం నేతల పోటీ పెరిగింది.
అధిష్టానం నిర్లక్ష్యంతో..
వరంగల్ జిల్లాలో నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నప్పటికి పరిష్కరించలేక చేతులెత్తేసినట్లు కన్పిస్తోంది. దీంతో పార్టీని నమ్ముకున్న నాయకులు, శ్రేణుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల విశ్వాసం సన్నగిల్లుతోంది. ముఖ్యంగా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో నాయకులంటే అసహ్యించుకునే పరిస్థితి దాపురించింది. కొత్తగా పార్టీలో చేరేవారు ఈ దుస్థితిని చూసి వెనుకంజ వేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి కొంత మొదటి నుండి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ వారికి దిశ నిర్దేశం చేయాల్సిన నాయకులే గ్రూపులు కట్టుకొని వర్గ విభేదాలతో ఉండడంతో ఎవరితో ఉండాలో తెలియని అయోమయ పరిస్థితిలో కొన్ని నియోజకవర్గాలున్నాయి. మార్పుకు ప్రజలు రెడీగా ఉన్నప్పటికీ కొంత కాంగ్రెస్ అభ్యర్థుల్లో వర్గ పోరు తో పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసే ఆశావాహుల సంఖ్య ఉమ్మడి జిల్లాల వారీగా..(టేబుల్)
జిల్లా ఎక్కువ మంది ఒక్కరే మొత్తం
వరంగల్ 8 4 12
నల్లగొండ 8 4 12
ఖమ్మం 7 3 10
నిజామాబాద్ 7 1 9 (ఆర్మూర్ లో పోటీచేసే స్థాయినాయకులు లేరు)
హైదరాబాద్ 6 1 15 ( 8పార్టీ ఎవరిని ఆదేశిస్తే వారు)
రంగారెడ్డి 9 5 14
మెదక్ 7 3 10
మహబూబ్ నగర్ 4 10 14
కరీంనగర్ 6 7 13
ఆదిలాబాద్ 9 1 10
మొత్తం 71 39 119 (9)
ఓరుగల్లులో..
1.జనగామ లో మాజీ పీసీసీ అధ్యక్షడు పొన్నాల లక్ష్మయ్యకు పీసీసీ మెంబర్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక్కడ మూడవ గ్రూపుగా ఉన్న జంగా రాఘవరెడ్డి హనుమకొండకు మకాం మార్చారు.
2. స్టేషన్ ఘన్ పూర్ లో సింగారపు ఇందిర, పార్టీ నాయకుడు కిష్టయ్యలు రెండు వర్గాలుగా కొనసాగుతున్నారు. ఈ సెగ్మంట్ పై మాజీ పోలీసు అధికారి దొమ్మాటి సాంబయ్య దృష్టి కూడా ఉంది.
3. వరంగల్ పశ్చిమలో ఈ దఫా నాకే టికెట్ అనే ధీమాతో ఉన్న హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డికి పోటీగా గత ఎన్నికల్లో పాలకుర్తి నుంచి పోటీ చేసి ఓటమిపాలైన జంగారాఘవరెడ్డి రంగంలోకి దిగి పోటీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు వేం సురేందర్ రెడ్డి కూడా ఆశలు పెట్టుకున్నారు.
4. వరంగల్ తూర్పులో పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా నియమించబడిన ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసిన సురేఖ నాలుగేండ్లుగా తూర్పుకు దూరంగా ఉన్నారు.
5. వర్ధన్నపేటలో ఇంచార్జ్ నమిండ్ల, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఇటీవల పార్టీలో చేరిన మాజీ పోలీసు ఆఫీసర్ నాగరాజులు పోటీ పడుతున్నారు.
6. నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఉన్నారు. ఆయన ఏకపక్ష విధానాల పట్ల అధిష్టానం అసంతృప్తితో ఉంది. మాధవరెడ్డి స్థానంలో ఇతరులు చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా నాయకత్వంతో కూడా ఆయనకు సయోధ్యలేదనే విమర్శలున్నాయి.
7. మహబూబాబాద్ లో మాజీ కేంద్ర మంత్రి బలరామ్ నాయక్, ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట చైర్మన్ బెల్లయ్యనాయక్, డాక్టర్ మురళీ నాయక్ టికెట్ ఆశిస్తున్నారు.
8. డోర్నకల్ లో నెహ్రూ నాయక్, రామచంద్ర నాయక్ లు పోటీ పడుతున్నారు
9. ములుగులో ఎమ్మెల్యే సీతక్కకు పార్టీలో వర్గపోరులేదు. నియోజకవర్గంలో బలమైన నాయకురాలిగా ఆమె కొనసాగుతుంది. ప్రజల్లో మంచి పట్టు కూడా ఉంది.
10. పాలకుర్తి కాంగ్రెస్ నాయకురాలిగా రంగంలోకి దిగిన ఎన్ఆర్ఐ ఝాన్సీరెడ్డి కి ప్రస్తుతానికి వర్గపోరులేనప్పటికీ ఈ నియోకవర్గం పై రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురాంరెడ్డి కన్నేసినట్లు చెబుతున్నారు.
11. భూపాలపల్లిలో ఇంచార్జ్ గండ్ర సత్యనారాయణరావుకు పార్టీలో పోటీ లేదు.
12. పరకాల లో పార్టీ ఇంచార్జ్ ఇనుగాల వెంకట్రాం రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో..
1. నల్గొండలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేయనున్నారు.
2. హుజూర్ నగర్ లో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేయనున్నారు.
3. కోదాడలో పద్మావతి పోటీ చేయనున్నారు.
4. సూర్యాపేటలో మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డిలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు.
5. భువనగిరిలో పంజాల రామాంజనేయులు గౌడ్, పోత్నాక్ ప్రమోద్ కుమార్, పొతంశెట్టి వెంకటేశ్వర్లు టికెట్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ లో చేరుతామని ఇప్పటికే ప్రకటించిన జిట్టా బాలకృష్ణారెడ్డి, బీఆరెస్ నేత చింతల వెంకటేశ్వర్ రెడ్డిలు కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
6. ఆలేరులో బీసీ వర్గం నేత బీర్ల ఐలయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే నగేష్,నేతలు కల్లూరి రామచంద్రారెడ్డి, డీసీసీ నూతన అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, వంచ వీరారెడ్డి, జనగాం ఉపేందర్ రెడ్డి, బండ్రు శోభారాణి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయోధ్యరెడ్డిలు టికెట్ రేసులో ఉన్నారు.
7. మునుగోడులో పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి ల మధ్య టికెట్ కోసం పోరు సాగుతుంది. బీసీ కోటాలో పున్న కైలాష్ నేత, చెరుకు సుధాకర్ గౌడ్ లు కూడా టికెట్ రేసులో ఉన్నారు.
8. మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, అలుగుబెల్లి అమరేందర్ రెడ్డిలు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత కే. జానారెడ్డి తన కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి ని బరిలో దించాలని ప్రయత్నిస్తున్నారు. ఒకే కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వని పక్షంలో జానా రెడ్డి తన అనుచరుడైన శంకర్ నాయక్ ను తెరపైకి తీసుకు వచ్చే అవకాశం ఉంది.
9. నాగార్జునసాగర్ లో సీనియర్ నేత కే. జానారెడ్డి తన రెండవ కుమారుడు జయవీర్ రెడ్డిని దించేందుకు నిర్ణయించారు.
10. నకిరేకల్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి దైద రవీందర్, దామోదర్ రెడ్డి అనుచరుడు వేదాసు వెంకన్న, ఆయన కుమారుడు వేదాసు శ్రీధర్, జానారెడ్డి వర్గీయుడు కొండేటి మల్లయ్యలు టికెట్ రేసులో ఉన్నారు.
11. తుంగతుర్తి లో అద్దంకి దయాకర్ , కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు వడ్డేపల్లి రవి, దామోదర్ రెడ్డి అనుచరుడు గుడిపాటి నరసయ్యలతో పాటు నాగరి గారి ప్రీతం, అన్నెపర్తి జ్ఞాన సుందర్, ఇటికాల చిరంజీవి టికెట్ రేసులో ఉన్నారు. ఇటీవల బీఆరెస్ కు రాజీనామా చేసిన మందుల సామేల్ కూడా టికెట్ ఆశిస్తున్నారు.
12) దేవరకొండ లో మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, నేనావత్ కిషన్ నాయక్, కేతావత్ బిల్యా నాయక్ లు టికెట్ రేసులో పోటీ పడుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..
1. వైరాలో టికెట్ కోసం నలుగురు నాయకులు పోటీ పడుతున్నారు. రామ్మూర్తి నాయక్, విజయభాయి, రాందాస్ నాయక్, బాలాజీ నాయక్లు టికెట్ కోసం పోటీ పడుతున్నారు.
2. పినపాకలో పాయం వెంకటేశ్వర్లు, ములుగు ఎమ్మెల్యే సీతక్క కుమారుడు సూర్యలు పోటీ పడుతున్నారు.
3. భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పోడెం వీరయ్య ఉన్నారు.
4. మధిరలో సీల్పీనేత మల్లు భట్టి విక్రమార్క ఒక్కరే..
5. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పోటీ చేస్తే టికెట్ అడిగే నాయకులు ఎవరూ ఉండరని అంటున్నారు. పొంగులేటి కాదంటే మహ్మద్ జావెద్, వర ప్రసాద్రెడ్డిలు టికెట్ పోటీలో ఉన్నారు.
6.కొత్తగూడెంలో ఎడవెల్లి కృష్ణ, పొట్ల నాగేశ్వరరావులు పోటీ పడుతున్నారు.
7. సత్తుపల్లిలో మట్ట దయానంద్, పిడమర్తి రవిలు టికెట్ ఆశిస్తున్నారు.
8. పాలేరులో మద్ది శ్రీనివాస్రావు, రామసాయం నరేష్రెడ్డిలు టికెట్ ఆశిస్తున్నారు. అయితే వైఎస్సార్ టీపీ నాయకురాలు షర్మిల కాంగ్రెస్ లో చేరితే ఆమె ఇక్కడి నుంచే పోటీ చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
9. అశ్వారావుపేటలో జారె ఆదినారాయణ, దాడి వెంకటేశ్వర్లులు పోటీ పడుతున్నారు.
10. ఇల్లందులో కోరం కనకయ్య ఒక్కరే టికెట్ ఆశిస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో…
1. నిజామాబాద్ అర్బన్ లో ధర్మపురి సంజయ్, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, కేశవ వేణుగోపాల్
2. నిజామాబాద్ రూరల్ లోభూపతి రెడ్డి, అరికెల నర్సారెడ్డి, కే నగేష్ రెడ్డి
3. బోధన్లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కెప్టెన్ కరుణాకర్ రెడ్డి
4. ఆర్మూర్ లో ప్రస్తుతం ఎవరు లేరు.bjp నుండి వినయ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరి బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఆకుల లలిత brs నుంచి కాంగ్రెస్ లో చేరి పోటీలో నిలిచే అవకాశాలు ఉన్నాయి.
5. బాల్కొండలో ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్
6. కామారెడ్డి లో మాజీ మంత్రి షబ్బీర్ అలీ
7. ఎల్లారెడ్డిలో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావు
8. బాన్సువాడలో కాసుల బాల్ రాజ్, మాసాని శ్రీనివాస్
9. జుక్కల్ లో సౌదాగర్ గంగారం, ఎన్నారై తోట లక్ష్మీకాంతరావు, గడుగు గంగాధర్
హైదరాబాద్ జిల్లాలో..
1.ఖైరతాబాద్‌లో దివంగత సీఎల్పీ నేత పీజే ఆర్ కూతురు కార్పోరేటర్ విజయారెడ్డి, రోహన్‌రెడ్డి
2.జూబ్లీ హిల్స్‌లో హజారుద్దీన్, దివంగత సీఎల్పీ నేత పీజే ఆర్ కుమారుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి
3.సనత్‌నగర్‌లో కోటనీలిమ, డాక్టర్ రవీంద్ర గౌడ్ , ఇటీవలి కాలంలో బీజేపీలో చేరిన సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి కుమారుడు మర్రి ఆదిత్య రెడ్డి
4.సికింద్రాబాద్‌లో షర్మిల కాంగ్రెస్‌లో చేరితే ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం. అలాగే ఆగం సంతోష్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేయడం కోసం టికెట్ ఆశిస్తున్నారు.
5.ముషీరాబాద్ లో అంజన్ యాదవ్ కుమారుడు అనిల్‌కుమార్ యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు.
6.అంబర్‌పేటలో లక్ష్మణ్ యాదవ్, నూతి శ్రీకాంత్ గౌడ్‌లు
7.కంటోన్మెంట్‌లో మల్లు రవి, అద్దంకి దయాకర్, పిడమర్తి రవిలు టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు.
8.గోషామహల్, 9.నాంపల్లి, 10.మలక్‌పేట, 11.యాకుత్ పుర, 12.చంద్రాయణగుట్ట, 13.చార్మినార్, 14.కార్వాన్, 15.బహదూర్‌పుర లలో పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్లు పోటీ చేస్తారు. ఇక్కడ పోటీ నామమాత్రమే.
రంగారెడ్డి జిల్లాలో..
1. మల్కాజిగిరి లో నందికంటిశ్రీధర్
2.మహేశ్వరం లో పారిజాతం నర్సింహారెడ్డి, దీపా భాస్కర్‌రెడ్డి, చల్లానర్సింహారెడ్డి
3.కుత్బుల్లాపూర్ లో కొలన్ హన్మంతరెడ్డి, భూపతిరెడ్డి నర్సింహారెడ్డి
4.మేడ్చల్ లో తోటకూర జంగయ్య యాదవ్, హరివర్థన్‌రెడ్డి, కేఎల్ ఆర్
5.ఇబ్రహింపట్నం లో మల్‌రెడ్డి రంగారెడ్డి,
6.కూకట్‌పల్లి లో గొట్టెముక్కల వెంగళరావు టికెట్ ఆశిస్తున్నారు.
7.శేరిలింగంపల్లి లో రఘునాథ్ యాదవ్, వడ్డె జైపాల్, బీబీ సత్యనారాయణరావులు పోటీ పడుతున్నారు.
8.రాజేంద్రనగర్ లో జ్నానేశ్వర్ ముదిరాజ్ ఆశిస్తున్నారు.
9.చేవెళ్ల లో శాబాద్ దర్షన్, వసంతం, భీమ్ భరత్, సిద్దేశ్వర్ లు పోటీ పడుతున్నారు. మాజీ మంత్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ లో చేరితే అతనికే టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి.
10.పరిగి లో రామ్మోహన్‌రెడ్డి
11.తాండూరు లో కాల్వసుజాత, కాంగ్రెస్‌లో చేరితే మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి
12.వికారాబాద్ లో గడ్డం ప్రసాద్, కాంగ్రెస్‌లో చేరితే మాజీ మంత్రి చంద్రశేఖర్
13.ఉప్పల్ లో రాగిడి లక్ష్మారెడ్డి , పరమేశ్వర్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి
14.ఎల్‌బీనగర్ లో మల్‌రెడ్డి రామిరెడ్డి, జక్కిడి ప్రభాకర్‌రెడ్డి
ఉమ్మడి మెదక్ జిల్లాలో
1. మెదక్ లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం 5 గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. డీసీసీ అధ్యక్షులు కంటా రెడ్డి తిరుపతి రెడ్డి,మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి, పిసిసి కార్యదర్శి మ్యాడం బాలకృష్ణ, పిసిసి సభ్యులు సీహెచ్ సుప్రభాత్ రావు, రామాయంపేట మాజీ ఎమ్మెల్యే అల్లుడు ప్రముఖ న్యాయవాది మెదక్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వి.ప్రతాప్ రెడ్డి
2. దుబ్బాక లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి , గాల్ రెడ్డి , కత్తి కార్తీక
3. గజ్వేల్ లో సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే తూం కుంట నర్సారెడ్డి, పొన్నాల రఘుపతి రావు, కృష్ణా రెడ్డి
4. సిద్దిపేట లో భావాని రెడ్డి , దాస అంజయ్యతో పాటు ఒక ఎన్ ఆర్ ఐ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు
5. నారాయణఖేడ్ లో సంజీవ రెడ్డి, మాజీ,ఎమ్మెల్యే, సురేష్ శేట్కార్ , మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్
6. నర్సాపూర్ లో అవుల రాజిరెడ్డి, ఆంజనేయులు గౌడ్,గాలి అనిల్ కుమార్
7. పటాన్ చెరువు లో కాట సుదా శ్రీనివాస్ గౌడ్,కార్పొరేటర్ శంకర్ గౌడ్, గాలి అనిల్ కుమార్
8. జహీరాబాద్ లో మాజీ మంత్రి గీతారెడ్డి
9. సంగారెడ్డి లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి
10. అందోల్ లో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో..
1. మహబూబ్ నగర్ లో ఒబేధుల్లా కొత్వాల్, సంజీవ్ ముదిరాజ్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పార్టీ మాత్రం కొత్త నేత కోసం వెతుకుతున్నారని సమాచారం.
2. కొడంగల్ లో టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
3.దేవరకద్ర లో మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షులు గౌని మధుసూదన్ రెడ్డి
4. నారాయణ పేట లో కుంభం శివకుమార్ రెడ్డి
5. మక్తల్ లో వాకిటి శ్రీహరి
6.జడ్చర్ల లో మాజీ ఎమ్మెల్యే చంద్ర శేఖర్ ( ఎర్ర శేఖర్ ), పారిశ్రామిక వేత్త జనుంపల్లి అనిరుద్ రెడ్డి
7. నాగర్ కర్నూల్ లో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మరొకరు ఎమ్మెల్సి కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి. ఇందులో దామోదర్ రెడ్డి తన కుమారుడు రాజేష్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇప్పించాలని అనుకుంటున్నారు.
8. అచ్చంపేట లో వంశీ కృష్ణ
9. కల్వకుర్తి లో వంశీచంద్ రెడ్డి
10. వనపర్తి లో మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి
11.కొల్లాపూర్ లో చేరిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు , చింతలపల్లి జగదీశ్వర్ రావు
12.గద్వాల లో ఇటీవల బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జెడీ చైర్‌పర్సన్ సరిత
13. అలంపూర్ లో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్
14.షాద్ నగర్ లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో..
1. కరీంనగర్ లో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత మేనేని సత్యనారాయణ రావు బంధువు మేనేని రోహిత్ రావు, సీఎం కేసీఆర్ సోదరుని కుమార్తె రేగులపాటి రమ్యారావు, మీడియా సంస్థల అధిపతి కొత్త జయపాల్ రెడ్డి, బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్ ఇక్కడి నుండి పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ టి సంతోష్ కుమార్ పార్టీ ఆహ్వానిస్తే తిరిగి సొంతగూటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
2. మానకొండూరు లో కవ్వంపల్లి సత్యనారాయణ ఉన్నారు.ఒక్కరే ఇక్కడ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. గతంలో పార్టీని వీడి వెళ్లిన మాజీ శాసనసభ్యుడు ఆరేపల్లి మోహన్ తిరిగి సొంతగూటికి వస్తే, ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలించవచ్చు.
3. హుజురాబాద్ లో ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తో పాటు మరో బలమైన అభ్యర్థి కోసం పార్టీ అన్వేషణ కొనసాగిస్తోంది.
4. హుస్నాబాద్ లో అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి తో పాటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
5. చొప్పదండి లో మేడిపల్లి సత్యం, నాగి శేఖర్, గంగాధర మండలానికి చెందిన గునుకొండ బాబు
6. సిరిసిల్ల లో కేకే మహేందర్ రెడ్డి, కెసిఆర్ బంధువు చీటీ ఉమేష్ రావు
7, వేములవాడ లో సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్
8. జగిత్యాల లో ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి
9. కోరుట్ల లో సీనియర్ నేత స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు తనయుడు నర్సింగరావు, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ స్వర్గీయ కె.వి రాజేశ్వరరావు అన్న కొడుకు కల్వకుంట్ల సుజిత్ రావ్, మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి తనయుడు కరణ్ చంద్
10.పెద్దపల్లి లో మాజీ ఎమ్మెల్యే చింతకుంట్ల విజయ రమణారావు
11.మంథని లో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు
12.రామగుండంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, జనక్ ప్రసాద్,హర్కర వేణుగోపాలరావు
13.ధర్మపురిలో అడ్లూరు లక్ష్మణ్ కుమార్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో..
1. ఆదిలాబాద్ లో డిసిసి అధ్యక్షుడు సాజిద్ ఖాన్ , పీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత , మాజీ ఎంపీ దివంగత రామచంద్ర రెడ్డి మేనల్లుడు సంజీవరెడ్డి , ఈ మధ్యనే బిజెపి పార్టీ నుండి వచ్చిన ఎన్నారై కంది శ్రీనివాసరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు.
2. నిర్మల్ లో డిసిసి అధ్యక్షులుగా ఇటీవల నియమితులైన కె. శ్రీధర్ రావు, సారంగాపూర్ జెడ్పిటిసి సభ్యుడు పత్తి రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ నేత అంజుమాన్ లు టికెట్ ఆశిస్తున్నారు .
3. ఖానాపూర్ లో పార్టీ నేత వొడమ బొజ్జు ,జడ్పీటీసీ చారులత రాథోడ్, భారత్ సవాల్ ,వినోద్ నాయక్ లు టికెట్ కోసం పోటీ పడుతున్నారు .
4. బోథ్ లో నరేష్ జాదవ్, ఆడే గజేందర్, రాథోడ్ పార్వతి, డాక్టర్ వన్నెల అశోక్ టికెట్ ఆశిస్తున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుండి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిన ఎంపీ సోయం బాబురావు మళ్లీ తిరిగి వచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం కొనసాగుతుంది. ఆయన హస్తం గుటికి వస్తే ఆయనకే టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయని ఓ ప్రచారం కొనసాగుతుంది.
5.ముధోల్ లో విజయ్ కుమార్ రెడ్డి ఎన్నారై, ఆనందరావు పటేల్, కిరణ్ కుమార్ లు టికెట్ కోసం పోటీ పడుతున్నారు
6. సిర్పూర్ లో కోనేరు కోనప్ప మేనల్లుడు రావి శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఓడిపోయిన తరువాత బీజేపీలో చేరిన పాల్వాయి హరీష్ బాబు తిరిగి హస్తం గూటికే వస్తారన్న ప్రచారం ఉంది. ఇదే జరిగితే ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి .
7. అసిఫాబాద్ లో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ వర్గానికి చెందిన నేత డాక్టర్ గణేష్ జాదవ్ ,డిసిసి అధ్యక్షుడి వర్గానికి చెందిన అభ్యర్థి పరుచుకోల సరస్వతి లు పోటీపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయానికి అధికార పార్టీలో ఒకరికి టికెట్ రాని పక్షంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి .
8. మంచిర్యాల లో సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు, కేవీ ప్రతాప్ టికెట్ ఆశిస్తున్నారు.
9. బెల్లంపల్లి లోమాజీ మంత్రి గడ్డం వినోద్, చిలుముల శంకర్, నేతరి ఎల్లయ్య టికెట్ ఆశిస్తున్నారు.
10. చెన్నూరు లో చంద్ర శేఖర్, డాక్టర్ రాజా రమేష్ , దాసరి శ్రీనివాస్, రామిల్ల రాధిక, నూకల రమేష్, మేకల శంకర్ , దుర్గం అశోక్ లు టికెట్ ఆశిస్తున్నారు.