Cyber Crime Police | 26 కోట్ల సైబర్ మోసానికి చెక్.. ఇద్దరి అరెస్టు

పెట్టుబడుల పేరుతో 26కోట్ల అక్రమ నగదు బదిలీ చేసుకుని బాధితులను మోసగించిన ఇద్దరు సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లుగా సైబర్ క్రైం డీసీపీ కవిత తెలిపారు. కేసు వివరాలను శనివారం ఆమె మీడియాకు వెల్లడించారు

  • Publish Date - April 13, 2024 / 05:40 PM IST

విధాత, హైదరాబాద్‌: పెట్టుబడుల పేరుతో 26కోట్ల అక్రమ నగదు బదిలీ చేసుకుని బాధితులను మోసగించిన ఇద్దరు సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లుగా సైబర్ క్రైం డీసీపీ కవిత తెలిపారు. కేసు వివరాలను శనివారం ఆమె మీడియాకు వెల్లడించారు. నిందితులు నౌషద్, కబీర్ కేరళలో ఉన్నట్లు గుర్తించి… అక్కడికి వెళ్లి అరెస్టు చేసినట్టు చెప్పారు. పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో టెలిగ్రామ్ యాప్ ద్వారా బాధితులకు నిందితులు పరిచయమయ్యారు.

లింక్ షేర్ చేసి.. దానిని క్లిక్ చేయడం ద్వారా బాధితులను టెలిగ్రామ్ యాప్‌లో యాడ్ చేస్తారు. లైక్ చేయడం, లింక్స్ క్లిక్ చేయడం, అంతర్జాతీయ కంపెనీల రివ్యూలు రాయడం వంటి టాస్క్‌లు ఇచ్చి పార్ట్ టైం ఉద్యోగంగా బాధితులను ఆకర్షించి తొలుత వారికి కొంత నగదు వచ్చేలా చేస్తారు. తర్వాతా వారితో పెట్టుబడులు పెట్టించి మరికొంత నగదు తిరిగి ఇస్తారు. వారి మాటలు నమ్మి బాధితులు రూ.9 లక్షలకుపైగా పెట్టుబడులు పెట్టారు.

నిందితులు తిరిగి చెల్లింపులు చేయకుండా అకౌంట్ బ్లాక్ చేశారు. ఖాతా స్తంభించి పోయింది కాబట్టి.. నగదు రిలీజ్ అవ్వాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని చెబుతారు. వేర్వేరు అకౌంట్లలోకి డబ్బులు జమ చేయిస్తారు. ఇలాంటి 18 బ్యాంకు ఖాతాలను గుర్తించామని, ఇందులో రూ.26 కోట్ల అక్రమ నగదు బదిలీ చేశారని గుర్తించామని డీసీపీ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు జనవరిలో కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి నిందితులను అరెస్టు చేశామన్నారు.

Latest News