DD News | కాషాయం లోగో.. హిందీ అక్షరాలు

సార్వత్రిక ఎన్నికల సమయంలో దూరదర్శన్ తన లోగోతో పాటు రంగును మార్చుకోవడం పట్ల విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని దూరదర్శన్ లోగో మార్పులు చోటుచేసుకున్నాయి

  • Publish Date - April 19, 2024 / 04:54 PM IST

మారిన దూరదర్శన్ లోగో
నెటిజన్ల విమర్శలు

విధాత, హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల సమయంలో దూరదర్శన్ తన లోగోతో పాటు రంగును మార్చుకోవడం పట్ల విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని దూరదర్శన్ లోగో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు ఎరుపు రంగులో ఉన్న డీడీ లోగో కాషాయ రంగు పులుముకుంది. లోగో కింద ఉండే డీడీ న్యూస్‌ ఇంగ్లీష్‌ అక్షరాల స్థానంలో న్యూస్ అని హిందీ అక్షరాలు చేర్చారు. అత్యాధునిక స్టూడియో సిస్టమ్‌, పునరుద్ధరించిన వెబ్‌సైట్‌ను డీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

తాజా మార్పులపై స్పందించిన డీడీ రూపం మారిన విలువలు అలాగే ఉన్నాయంటూ ప్రకటించింది. ఇప్పుడు మేము కొత్త అవతార్‌లో మీకు అందుబాటులో ఉన్నామని, కానీ మా విలువలు అలాగే ఉన్నాయని, మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త వార్తలను అందిస్తామని పేర్కోంది. వేగంపై ఖచ్చితత్వం, దావాల కంటే వాస్తవాలు, సెన్సేషనలిజం కంటే నిజాలు మీ ముందు ఉంచుతాం.. అంటూ ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో డీడీ బృందం పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియోను డీడీ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. డీడీ లోగో మార్పులపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఎంతో చరిత్ర ఉన్న డీడీ న్యూస్‌ లోగో కాషాయరంగులోకి మారిపోయిందని, ఇది ప్రసార భారతి కాదు ప్రచార భారతి’ అని దూరదర్శన్‌ మాజీ సీఈవో టీఎంసీ ఎంపీ జవహర్‌ సర్కార్‌ విమర్శించారు. దూరదర్శన్‌ చర్యను కేరళ సీఎం పినరయి విజయన్‌ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం పట్ల స్వామి భక్తిని ప్రదర్శించి వార్తలను ప్రసారం చేసే దూరదర్శన్‌ న్యూస్‌ ఛానల్‌ లోగో రంగును కాషాయ రంగులోకి మార్చేసి తన విధేయతను ప్రదర్శించుకుందని మండిపడ్డారు. బీజేపీపై పెద్దయెత్తున నెటిజన్లతో పాటు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

Latest News