Site icon vidhaatha

Heat Stroke | మహారాష్ట్ర అవార్డుల వేడుకల్లో అపశృతి.. వడదెబ్బతో 11 మంది మృత్యువాత..!

Heat Stroke |

మహారాష్ట్ర భూషణ్‌ అవార్డుల కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకున్నది. ఆదివారం జరిగిన అవార్డుల ప్రదానం కార్యక్రమంలో వడదెబ్బ కారణంగా 11 మంది దుర్మరణం చెందారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తెలిపారు. అలాగే 100 మందికిపైగా ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.

మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సామాజిక కార్యకర్త అప్పా సాహెబ్‌ ధర్మాధికారికి హోంమంత్రి అమిత్‌షా అందజేశారు. నవీ ముంబయిలో ఈ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం సమయంలో వేడుక జరగ్గా.. ఆ సమయంలో పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల వరకు నమోదైంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేతో పాటు డెప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ సైతం హాజరయ్యారు.

అవార్డుల కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన అవార్డు ప్రదానోత్సవం మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాగింది. మైదానం జనంతో కిక్కిరిసిపోయింది. అయితే, హాజరైన జనానికి ఎలాంటి నీడ లేకపోవడంతో ఎండలోనే కూర్చోవాల్సి వచ్చింది. అధిక వేడి కారణంగా చాలా మంది వడదెబ్బకు గురయ్యారు.

ఇందులో 11 మంది పరిస్థితి విషమించి మృతి చెందారు. మరో 100 మంది వరకు ఆసుపత్రిలో చేరగా.. ప్రస్తుత 24 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై సీఎం షిండే విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. వడదెబ్బతో ఆసుపత్రిలో చేరిన వారి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు.

Exit mobile version