Site icon vidhaatha

Brij Bhushan Singh | బ్రిజ్‌కు రెండ్రోజులు బెయిల్

Brij Bhushan Singh

న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌కు ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. 25వేల రూపాయల పూచీకత్తుపై బ్రిజ్‌భూషణ్‌కు అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ హర్జీత్‌సింగ్‌ రెండు రోజుల బెయిల్‌ ఇచ్చారు. ఇదే కేసులో సస్పెన్షన్‌కు గురైన ఫెడరేషన్‌ సహాయ కార్యదర్శి వినోద్‌ తోమర్‌కు కూడా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

కోర్టు సమన్ల మేరకు వీరిద్దరూ మొదటిసారి న్యాయస్థానం ముందుకు హాజరయ్యారు. వారు బెయిల్‌ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు.. రెండు రోజుల పాటు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. మహిళా రెజ్లర్లు తీవ్ర ఆరోపణలు చేసినా.. రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేసినా అరెస్టు నుంచి తప్పించుకున్న బ్రిజ్‌భూషణ్‌.. తనపై చేస్తున్న ఆరోపణలు కొట్టిపారేస్తూ వచ్చారు.

మంగళవారం విచారణ సందర్భంగా వాదనలు వినిపించిన ఆయన తరఫు న్యాయవాది.. తన క్లయింట్‌పై మీడియా పరోక్ష విచారణ జరుపుతున్నదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మెజిస్ట్రేట్‌.. ఇదే కోర్టులో లేదా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. అయితే.. ఎలాంటి పిటిషన్‌ దాఖలు కాలేదు. రెండు రోజుల పాటు బెయిల్‌ ఇచ్చిన కోర్టు.. రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై గురువారం విచారణ జరుపనున్నది.

Exit mobile version