Site icon vidhaatha

ఐఫోన్ ఆర్డ‌ర్ చేశాడు.. డ‌బ్బుల్లేక డెలివరీ బాయ్‌ను క‌త్తితో పొడిచి చంపాడు..

Karnataka | ఓ యువ‌కుడు ఆన్‌లైన్‌లో ఐఫోన్( iphone ) ఆర్డ‌ర్ చేశాడు. అది తీరా డెలివ‌రీ అయ్యాక డ‌బ్బుల్లేవ‌ని.. ఏకంగా డెలివ‌రీ బాయ్‌ను క‌త్తితో విచ‌క్ష‌ణార‌హితంగా పొడిచి చంపాడు. ఆ త‌ర్వాత మృత‌దేహాన్ని ఇంట్లోనే నాలుగు రోజుల పాటు దాచి ఉంచాడు. ఈ దారుణ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని హ‌స‌న్ జిల్లాలో ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. హ‌స‌న్ జిల్లాకు చెందిన హేమంత్ ద‌త్త అనే యువ‌కుడు ఆన్‌లైన్‌లో రూ. 46 వేల‌కు సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ను బుక్ చేశాడు. ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన ఇ-కార్ట్ డెలివ‌రీ బాయ్ ఆ ఫోన్‌ను హేమంత్ ఇంటికి తీసుకొచ్చాడు. డ‌బ్బులు ఇవ్వ‌క‌ముందే సెల్‌ఫోన్ పార్శిల్ విప్పాల‌ని డెలివ‌రీ బాయ్‌ను హేమంత్ కోరాడు. డ‌బ్బులు ఇస్తేనే పార్శిల్ విప్పుతాన‌ని డెలివరీ బాయ్ తేల్చిచెప్పాడు.

డ‌బ్బు తీసుకొస్తాను.. ఇంట్లోనే కూర్చో..

అయితే త‌న వ‌ద్ద డ‌బ్బు లేదు.. ఇప్పుడే తీసుకొస్తాను.. త‌న ఇంట్లో కూర్చోమ‌ని డెలివ‌రీ బాయ్‌ను న‌మ్మించాడు. హేమంత్ మాట‌లు న‌మ్మిన డెలివ‌రీ బాయ్.. ఇంట్లోకి వెళ్లి కూర్చున్నాడు. అనంత‌రం ఇంటి గ‌డియ పెట్టి.. డెలివరీ బాయ్‌పై క‌త్తితో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశాడు. ఆ క‌త్తి పోట్ల‌కు బాయ్ అక్క‌డికక్క‌డే మృతి చెందాడు.

మృత‌దేహాన్ని బాత్రూమ్‌లో దాచిపెట్టి..

డెలివ‌రీ బాయ్ మృత‌దేహాన్ని హేమంత్ త‌న ఇంట్లోని బాత్రూమ్‌లో దాచి పెట్టాడు. నాలుగు రోజుల త‌ర్వాత దుర్వాస‌న రావ‌డంతో.. డెడ్ బాడీని గోనెసంచిలో కుక్కాడు. అనంత‌రం బైక్‌పై తీసుకెళ్లి, స‌మీపంలోని రైలు ప‌ట్టాల‌పై ప‌డేసి పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టాడు.

డెలివ‌రీ బాయ్ సోద‌రుడి ఫిర్యాదుతో వెలుగులోకి..

డెలివ‌రీ బాయ్ సోద‌రుడి ఫిర్యాదుతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. నాలుగు రోజులైనా డెలివ‌రీ బాయ్ ఇంటికి రాక‌పోవ‌డంతో అత‌ని సోద‌రుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. డెలివ‌రీ బాయ్ కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీల‌ ఆధారంగా హేమంత్ ద‌త్త‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే డెడ్‌బాడీని బైక్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన‌ట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version