Bihar |
- వివరాల వెల్లడి ఆపనక్కర్లేదు
- సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు
- బీహార్‌లో కుల సర్వేపై పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: బీహార్‌లో కుల గణనపై స్టే ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం శనివారం నిరాకరించింది. పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కును ఈ వివరాల వెల్లడి ఉల్లంఘిస్తుందన్న పిటిషనర్ వ్యాఖ్యలను తిరస్కరిస్తూ.. పిటిషన్‌ను కొట్టేసింది. బీహార్‌లో కుల గణన చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి, ఆ మేరకు ప్రక్రియను ఆగస్ట్ 6నాటికి పూర్తి చేసింది. అయితే.. మొదటి నుంచీ ఈ విషయంలో న్యాయపోరాటం నడుస్తూనే ఉన్నది.
తాజాగా ఆ వివరాల వెల్లడిని ఆపాలంటూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎవరైనా వ్యక్తి తన కులం లేదా ఉప కులం పేరును వెల్లడించినంత మాత్రాన అది అతని వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించినట్టు ఎలా అవుతుంది? పౌరుల వ్యక్తిగత వివరాలు విడుదల చేయడం లేదు.. అందరి వివరాలను గణన చేసి.. ప్రోదిచేసిన వివరాలను మాత్రమే విడుదల చేస్తారు’ అని ఈ పిటిషన్‌పై శనివారం విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్‌ఖన్నా వ్యాఖ్యానించారు.
అయితే.. సర్వే పేరుతో వ్యక్తుల కులాల వివరాలు వెల్లడించేలా బలవంతపెట్టరాదని యూత్ ఫర్ ఈక్వాలిటీ స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్ అడ్వొకేట్ సీఎస్ వైద్యనాథన్ వాదించారు. దీనిపై జస్టిస్ ఖన్నా స్పందిస్తూ.. ‘మీ కులమేంటో మీ పొరుగువారికి తెలుసు. ఈ సర్వేలో 17 ప్రశ్నలు అడిగారు. ఇందులో ఏ ప్రశ్న మీ గోప్యతను ఉల్లంఘిస్తున్నది?’ అని ప్రశ్నించారు.
అయితే.. సర్వేలో అడిగిన ప్రశ్నల్లో ఆధార్ సమాచారం తప్ప మిగిలినవన్నీ తప్పనిసరి అని ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత కాల ఆలోచనలకు ఇది తగినట్టు లేదని వాదించారు. బీహార్ ప్రభుత్వం తరుఫున వాదించిన శ్యాం దివాన్.. పిటిషనర్ వాదనలను తోసిపుచ్చారు. ఆయన వాదనలు దురుద్దేశాలతో కూడుకున్నవని అన్నారు. సర్వే ఈ నెల 6తేదీన పూర్తి అయిపోయిందని తెలిపారు. ‘ఇది సామాజిక సర్వే. ఇందులో సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వం విశ్లేషిస్తుంది’ అని ఆయన తెలిపారు.
సంక్షేమ పథకాలను మరింత సమర్థంగా అమలు చేసేందుకు ఈ సర్వే వివరాలు దోహదపడతాయని వాదించారు. సేకరించిన పౌరుల వివరాలు పూర్తిగా పరిరక్షిస్తామని తెలిపారు. మరో పిటిషన్‌ను కూడా కొట్టివేసిన కోర్టు.. ప్రోదిచేసిన గణాంకాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడానికి గానీ, వెల్లడించడానికి గానీ తమకేమీ అభ్యంతరం కనిపించడం లేదని పేర్కొన్నది. ప్రభుత్వానికి ఇప్పటికే ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది.
వివరాల సేకరణ పూర్తయిందని, ఆ వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని జస్టిస్ ఖన్నా పేర్కొన్నారు. అసలు బీహార్ ప్రభుత్వానికి కుల గణన చేపట్టే హక్కు లేదన్న వాదనను కూడా కోర్టు తిరస్కరించింది. బీహార్ ప్రభుత్వం కులగణన చేపట్టిన నేపథ్యంలో కేంద్రం కూడా జనాభాల లెక్కల్లో కులాలవారీగా జనాభాను గుర్తించాలన్న డిమాండ్‌ను ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి.
అయితే.. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. కుల గణన జరిగితే ఆయా కులాలకు వారి ప్రాతినిథ్యం మేరకు సంక్షేమ పథకాలు మరింత నిర్దిష్టంగా అందే అవకాశాలతోపాటు అనేక ప్రయోజనాలు ఉన్నాయని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అందుకే ఈ డిమాండ్‌పై గట్టిగా కేంద్రాన్ని నిలదీస్తున్నాయి.