Exam Stress | పరీక్షల వేళ పిల్లలు ఒత్తిడికి లోను కావద్దంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

  • Publish Date - March 17, 2024 / 03:19 PM IST

Exam Stress : ఇది పరీక్షల సమయం. ఈ పరీక్షల వేళ పిల్లలు ఒత్తిడికి లోను కాకూడదంటే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక మార్కులు, ర్యాంకులు అంటూ ఒత్తిడి చేయకూడదు. చదువుకునేటప్పుడు ఎలాంటి చికాకు లేకుండా మానసిక ప్రశాంతత కల్పించాలి. అధిక సమయం చదవడం వల్ల పిల్లలు శారీరకంగా కూడా అలసిపోతుంటారు. కాబట్టి వారికి బలవర్ధకమైన పోషకాహారం అందించాలి. కొందరు పిల్లలు మార్కులు తక్కువ వస్తే తల్లిదండ్రులు ఏమంటారో.. బంధువులు ఏమంటారో అని ఆందోళన చెందుతుంటారు. కాబట్టి పిల్లల శక్తికి మించి చదవమని పేరెంట్స్‌ ఒత్తిడి చేయకూడదు. ఇవేగాక పరీక్షల సమయంలో పిల్లల కోసం పేరెంట్స్‌ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

తగిన విశ్రాంతి తీసుకోవాలి

పరీక్షలు కదా అని పిల్లలు విరామం లేకుండా ఏకధాటిగా చదువుతూ కూర్చోకూడదు. దీనివల్ల మానసికంగా అలసిపోయి ఎంత చదివినా గుర్తుండకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మధ్యమధ్యలో విరామం, విశ్రాంతి అవసరం. కాబట్టి పిల్లలు విశ్రాంతి తీసుకునే సౌలభ్యం కల్పించాలి.

ధ్యానం చేయాలి

పరీక్షల సమయంలో రోజూ కనీసం 20 నిమిషాలపాటు రెగ్యులర్‌గా మెడిటేషన్ చేయడం వల్ల ఏకాగ్రత పెంపొందుతుంది. దాంతో చదివింది గుర్తుంచుకోవడం సులువు అవుతుంది. ఇది మానసిక ప్రశాంతతను కాపాడుతుంది.

పోషకాహారం తీసుకోవాలి

పరీక్షల వేళ మానసికంగా, శారీరకంగా అలసిపోకూడదంటే మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. అంటే వాల్ నట్స్‌, పండ్లు, ఒమేగా సమృద్ధిగా ఉండే ఆహారాలు, కూరగాయలు జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతాయి.

కంటినిండా నిద్రపోవాలి

పిల్లల ఆరోగ్యం బాగుండాలన్నా, పరీక్షల ఒత్తిడి తగ్గాలన్నా కంటినిండా నిద్ర చాలా అవసరం. అలసిపోయిన మెదడు తిరిగి కావాల్సిన శక్తిని పుంజుకోవడానికి నిద్ర తోడ్పడుతుంది.

Latest News