రికార్డు స్థాయిలో న‌గ‌దు స్వాధీనం.. 75 ఏండ్ల లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ చ‌రిత్ర‌లో ఇదే అత్య‌ధికం

17వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో ధ‌న ప్ర‌వాహం ఏరులై పారుతోంది

  • Publish Date - April 15, 2024 / 02:41 PM IST

న్యూఢిల్లీ : 17వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో ధ‌న ప్ర‌వాహం ఏరులై పారుతోంది. ఎక్క‌డ చూసినా న‌గ‌దు క‌ట్ట‌లు కుప్ప‌లు తెప్ప‌లుగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. న‌గ‌దు ఒక్క‌టే కాదు.. బంగారం, వెండితో పాటు ఇత‌ర విలువైన వ‌స్తువులు ప‌ట్టుబ‌డుతున్నాయి. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి రోజుకు స‌గ‌టున రూ. 100 కోట్ల న‌గ‌దు ప‌ట్టుబ‌డుతున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 4,650 కోట్ల న‌గ‌దు ప‌ట్టుబ‌డిన‌ట్లు స్ప‌ష్టం చేశారు ఎన్నిక‌ల అధికారులు. ఈ స్థాయిలో న‌గ‌దు ప‌ట్టుబ‌డ‌టం 75 ఏండ్ల లోక్‌స‌భ ఎన్నిక‌ల చ‌రిత్ర‌లో ఇదే అత్య‌ధికం అని అధికారులు స్ప‌ష్టం చేశారు. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మొత్తం రూ. 3,475 కోట్ల న‌గ‌దు ప‌ట్టుబ‌డితే.. ఇప్పుడు తొలి విడ‌త నాటికే రూ. 4,650 కోట్లు ప‌ట్టుబ‌డ‌టం విశేషం. అయితే 2019 ఎన్నిక‌ల‌తో పోల్చితే ఇప్పుడు న‌గ‌దు ప‌ట్టుబ‌డ‌టం 34 శాతం పెరిగింద‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌ల అధికారులు ప్ర‌తి రాష్ట్రంలో విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈసీఐ వెల్లడించిన డేటా ప్రకారం.. మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్‌ 13వ తేదీ వరకు తొలి విడతలో డబ్బు, మద్యం, బంగారం, ఇతర వస్తువుల రూపంలో మొత్తం రూ. 4,650 కోట్లు రికవరీ అయ్యింది. అంటే సగటున రోజుకు రూ. 100 కోట్ల మేర రికవరీ జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు. మొత్తం రిక‌వ‌రీలో 45 శాతం మేర మాద‌క ద్ర‌వ్యాలు ఉన్న‌ట్లు తేలింది. మొత్తంగా రూ. 2,068.85 కోట్ల విలువైన డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రూ. 395.39 కోట్ల న‌గ‌దు, రూ. 562.10 కోట్ల విలువ చేసే బంగారం, వెండి వంటి విలువైన ఆభ‌ర‌ణాలు, రూ. 489.31 కోట్ల విలువ చేసే 3.58 లీట‌ర్ల మ‌ద్యం ప‌ట్టుబ‌డిన‌ట్లు అధికారులు తెలిపారు. 2019 ఎన్నికల సమయంలో రూ. 1,279.9 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. ఇక టీవీలు, ఫ్రిడ్జిలు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, బహుమతుల రూపంలో రూ. 1,142.49 కోట్ల మేర స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ వివరించింది.

రాష్ట్రాల వారీగా ప‌రిశీలిస్తే.. రాజ‌స్థాన్‌లో అత్య‌ధికంగా రూ. 778.5 కోట్లు, ఆ త‌ర్వాత గుజ‌రాత్‌లో రూ. 605.33 కోట్లు, త‌మిళ‌నాడులో రూ. 460.8 కోట్లు, మ‌హారాష్ట్ర‌లో రూ. 431.3 కోట్లు, పంజాబ్‌లో రూ. 311.8 కోట్ల విలువైన న‌గ‌దు, ఇత‌ర వ‌స్తువులు ప‌ట్టుబ‌డ్డాయి. తెలంగాణ నుంచి రూ. 121.84 కోట్ల మేర రికవరీ చేసుకోగా, ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 125.97 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ అధికారులు పేర్కొన్నారు.

Latest News