విధాత: ధరణి స్పెషల్ డ్రైవ్‌కు ఎన్నికల బ్రేక్ పడింది. ధరణిలో పెండింగ్‌లో ఉన్న రైతుల భూమి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ పెట్టింది. ఈ మేరకు ధరణిపై ఏర్పాటైన అద్యయన కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ధరణి సమస్య ఒక కొలిక్కి రావడానికి చాలా సమయం పడుతుందని, ఈ లోగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరింది. ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో 2.40 లక్షల దరఖాస్తులున్నాయని, వాటిని పరిష్కరించినా రైతులకు చాలా వరకు రిలీఫ్ వస్తుందని తెలిపారు.
ధరణి కమిటీ చేసిన ఈ సూచనకు స్పంధించిన సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు అధికారులతో సమావేశమై స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు 2024 మార్చి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మొదట స్పెషల్ డ్రైవ్ పెట్టారు. ప్రతి మండలానికి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
సమస్యలు సులువుగా పరిష్కరించేందుకు వీలుగా తాసీల్దార్లకు, ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు అధికారాలు బదిలీ చేశారు. ధరణిలో లాగిన్స్ కూడా ఇచ్చారు. అయితే సమస్యల పరిష్కారానికి ఇంకా గడువు పెంచాలన్న విజ్ఞప్తి రావడంతో స్పెషల్ డ్రైవ్‌ను 2024 మార్చి 17వ తేదీ వరకు పొడిగించారు. అయితే 2024 మార్చి16వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్‌ను ఎన్నికలు పూర్తయ్యే వరకు స్పెషల్ డ్రైవ్‌ను నిలిపి వేసింది. అధికారులు, సిబ్బంది అంతా ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నం కావాలని ఆదేశించింది.