విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: అప్పుడప్పుడు కొన్ని యాదృచ్ఛిక సంఘటనలు జరిగి ఆసక్తికర చర్చనీయాంశంగా మారుతాయి. ఇదే తరహా సంఘటన మంగళవారం వరంగల్ రాజకీయాల్లో జరిగింది. జిల్లాలో కీలక పాత్ర నిర్వహిస్తున్న ఎర్రబెల్లి బ్రదర్స్‌గా గుర్తింపు పొందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు మధ్య నెలకొన్న భిన్న రాజకీయ దృక్పథాలకు అన్నదాత భూమికగా మారడం గమనార్హం.
ఎర్రబెల్లి వర్సెస్ ఎర్రబెల్లి
ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూ కొనియాడారు. మరొకరు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రతిపక్ష బీజేపీ పార్టీలో నాయకునిగా కొనసాగుతూ రాష్ట్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రెండు సంఘటనలు యాదృచ్ఛికంగా ఒకేరోజు జరగడం విశేషం. ఒక విధంగా ఎర్రబెల్లి వర్సెస్ ఎర్రబెల్లిగా కార్యక్రమాలు జరిగాయి. ఒకరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తే మరొకరు నిరసన తెలియజేసిన ఆసక్తికర సంఘటన మంగళవారం జరిగింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
అన్న అభినందన
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు రైతు కుటుంబం నుంచి వచ్చారు. అనుకోకుండానా లేక ముందస్తు ప్రణాళిక ప్రకారమో ఏదైనా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం తన స్వగ్రామం పర్వతగిరిలోని సొంత పొలంలో పనులు జరుగుతుంటే చూసి, వెంటనే బురద పొలంలోకి దిగి గొర్రు పట్టి అరకదున్నారు.
ఆ తర్వాత నాటు కార్యక్రమంలో మహిళా కూలీలతో కలిసి నడుమొంచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దండగ అన్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ గారు పండగ చేశారని అభినందించారు. సీఎం ఆశయ సాధనలో అడుగులు వేస్తామంటూ ప్రకటించారు. రైతు రాజు అయితే రాజు కూడా రైతని రుజువు చేస్తున్నారని కొనియాడారు.
కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, అధికారులు, మంత్రులు ఇష్టంగా వ్యవసాయం చేయడంతో నేడు తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందన్నారు. గతంలో నెర్రెలు పారిన పొలాలు స్వరాష్ట్రంలో పచ్చని పంట పొలాలతో కళకళ లాడుతున్నాయనీ అన్నదాత కళ్లలో ఆనందం పండిస్తున్నాయన్నారు.
అపర భగీరధుడు కేసీఆర్ గారి ఆలోచనలతో ప్రాజెక్టులు రూపొంది, నీళ్లు పరవళ్ళు తొక్కుతుంటే చెరువులు కుంటలు, నిండి ఉప్పొంగుతుంటే మంత్రులు కూడా సొంత పొలాల్లో దిగి వ్యవసాయం చేస్తుంటే ఊరు వాడ, చేను చెలక మళ్ళీ ప్రాణం పోసుకుని పరవశిస్తున్నాయి. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణమనే నినాదం నిజమైందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
తమ్ముడు నిరసన
భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా వరంగల్ తూర్పులో బీజేపీ నాయకునిగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తమ్ముడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు నిరసన దీక్ష సందర్భంగా వరంగల్ లో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై విమర్శించారు.
రైతాంగం సమస్యలు పట్టించుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. ఈ క్రమంలో వరంగల్ కోట నుంచి ఎడ్ల బండి పై జొన్న కంకులు చేతపట్టి నిరసన కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు.రైతుల ఆత్మహత్యలకూ కేసీఆర్ కారణమంటూ రైతు బంధు ఇచ్చి మిగతావి బందు చేసిన ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని ప్రదీప్‌రావు పిలుపునిచ్చారు. రైతుల రుణాలను మాఫీ చేసే వరకు చేపట్టిన ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఉమ్మడి జిల్లాలో బీజేపీ దీక్షలు
బీజేపీ ఆధ్వర్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన దీక్షలు నిర్వహించారు. దీక్షల్లో హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, మల్లాడి తిరుపతి రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి , ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, ఎడ్ల అశోక్ రెడ్డి , కుసుమ సతీష్, డాక్టర్ మురళీధర్ గౌడ్, మార్తినేని ధర్మ రావు , మొలుగురి భిక్షపతి, బీజేపీ రాకేష్ రెడ్డి, గురుమూర్తి శివకుమార్, గుజ్జ సత్యనారయణ రావు, దేశిని సదానందం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.