విధాత: హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరుగుతున్న 35వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనకు తెలంగాణ ఆర్టీఐ కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి, సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రొఫెసర్ హరగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అలిశెట్టి ప్రభాకర్ వేదికపై కట్టా శేఖర్ రెడ్డి మాట్లాడారు.
బుక్ ఫెయిర్‌లో విద్యార్థలను, పుస్తకాభిమానులను చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. పుస్తక ప్రదర్శనకు తండోప తండాలుగా వచ్చి, పుస్తకాలను కొనుగోలు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. ప్రతి పుస్తకం మనల్ని ఎంతో ప్రభావితం చేస్తుందన్నారు.
సిద్ధాంతాల ప్రాతిపదిక కాకుండా అన్నిరకాలైన పుస్తకాలు చదవాలని సూచించారు. సాంకేతిక విప్లవంలో భాగంగా అరచేతిలో ప్రపంచం చూస్తున్నప్పటికీ అచ్చు విలువ తగ్గలేదని కట్టా శేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
పుస్తకం జ్ఞాన కవచం: సుద్దాల
సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. పుస్తకం ఒక జ్ఞాన కవచమన్నారు. పుస్తకం లేకుంటే తాను లేనని చెప్పారు. శరీరానికి మలినం అయితే స్నానం చేస్తాం. అదేవిధంగా మనసు, హృదయం స్నానం చేయాలంటే పుస్తకాలు చదవాలని అన్నారు. బుక్ ఫెయిర్ ఒక స్థలి, ఒక పుణ్య క్షేత్రమన్నారు. ఈ క్షేత్రం ఇక్కడే ఉంటుంది.
పుస్తకం చైతన్య రథం: ప్రొఫెసర్ హరగోపాల్
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. వేల పుస్తకాలు చదివినా తీరని కోరికలుగానే ఉంటుందని అన్నారు. పుస్తకాలంటే కేవలం అక్షరాలే కాదన్నారు. పుస్తకాలు అంటే ఒక విద్యుత్ వంటిదని, అది చైతన్య రథమని పేర్కొన్నారు.