BJP | అట్టహాసంగా బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ తొలి రోజున బీజేపీ అభ్యర్థులు భారీ ర్యాలీలతో అట్టహాసంగా తమ నామినేషన్లు దాఖలు చేశారు

  • Publish Date - April 18, 2024 / 03:40 PM IST

గెలుపుపై మల్కాజ్‌గిరిలో ఈటల ధీమా

విధాత : తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ తొలి రోజున బీజేపీ అభ్యర్థులు భారీ ర్యాలీలతో అట్టహాసంగా తమ నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్ధుల నామినేషన్లకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు హాజరయ్యారు. బీజేపీ నుంచి మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ, మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్, మెదక్‌లో రఘనందనరావు నామినేషన్లు దాఖలు చేశారు. రఘనందనరావు నామినేషన్ ర్యాలీలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, ఈటల రాజేందర్ నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరీ, మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ నామినేషన్ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్ హాజరయ్యారు.

మళ్లీ మోదీనే ప్రధాని..అభివృద్ధి కోసం గెలిపించండి : ఈటల

దేశ ప్రజలంతా మళ్లీ కేంద్రంలో ప్రధాని మోదీ కావాలనుకుంటున్నారని, మల్కాజ్‌గిరిలో కేంద్రం సహకారంతో భారీ అభివృద్ధి కోసం బీజేపీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని ఈటల రాజేందర్ కోరారు. మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఈటల రాజేందర్ మాట్లాడారు. ఇది ప్రత్యేక ఎన్నిక అని, ఎక్కడికిపోయిన ఈ సారి మోదీకి ఓటు వేస్తామని చెప్తున్నారని, మళ్లీ ఆయనే ప్రధాని కావాలని యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ముస్లిం మహిళలు కూడా ట్రిపుల్ తలాక్ రద్దు చేసినందుకు ఓటు వేస్తామని చెప్తున్నారని, ఇన్నాళ్లు మైనారిటీలను ఓట్ల కోసం వాడుకున్నారని, మోదీ మా జీవితాల్లో వెలుగు నింపారు అని చెప్తున్నారని ఈటల చెప్పారు.

మోదీ పాలనలో మత ఘర్షణలు లేవని, ఉపాధి అవకావశాలు పెరిగాయని, దేశ ప్రతిష్ట పెరిగిందన్నారు. మల్కాజ్‌గిరిలో నా గెలుపుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, దొంగ సర్వేలతో పెయిడ్ ఆర్టికల్స్ తో ప్రజల అభిప్రాయాన్ని మార్చలేరన్నారు. నీకు మిగతా అభ్యర్థులకు పోలిక లేదు అని ప్రజలు చెబుతున్నారని, 70-80 సంఘాలకు భవనాలు కట్టించామని, అణగారిన వర్గాలకు అండగా ఉన్నావని, చైతన్యం నింపడానికి, స్ఫూర్తి నింపడానికి మీ అవసరం ఉందని అంటున్నారన్నారు. నేను చేసిన ఉద్యమాలకు వారికి చేసిన సేవకు వారు ఈరోజు నాకు అండగా ఉంటామని చెప్తున్నారని, డబ్బు సంచులతో రేవంత్ సర్కార్ వస్తుందన, ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని, నా గెలుపును కాపాడే శక్తి ఒక్క మల్కాజ్‌గిరి ప్రజలకు మాత్రమే ఉందన్నారు.

చైతన్యానికి మారుపేరు మినీ ఇండియా మల్కాజ్‌గిరి అని, మోదీ పార్లమెంటు ఎన్నికల తొలి శంఖారావం ఇక్కడే చేశారని, గెలిచిరండి ఏది అవసరం అయితే అది ఇస్తా అని మోదీ మీకు చెప్పమని చెప్పారని తెలిపారు. మల్కాజ్‌గిరి పట్ల నాకో విజన్ ఉందని, మల్కాజ్‌గిరిని సంపూర్ణ అభివృద్ధి చేస్తాననన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ ఇంచార్జి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి వంశా తిలక్, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు భాషా, బీజేపీ రాష్ట్ర మహిళామోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి పాల్గొన్నారు.

Latest News