Jeevan Reddy | తెలంగాణలో 1450 కోట్ల వడ్ల కుంభకోణం

రాష్ట్రంలో రూ.1450 కోట్ల వడ్ల కుంభకోణం జరిగిందని బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆరోపించారు.

  • Publish Date - April 13, 2024 / 02:40 PM IST

సీఎం రేవంత్‌రెడ్డికి ధన సేకరణపైన ధ్యాస
ధాన్యం సేకరణ సమస్యలపై ధ్యాస లేదు
ఇది స్కీమ్‌ల పాలన కాదు..స్కామ్‌ల పాలన
మాజీ ఎమ్మెల్యే జీవనరెడ్డి ధ్వజం

విధాత, హైదరాబాద్: రాష్ట్రంలో రూ.1450 కోట్ల వడ్ల కుంభకోణం జరిగిందని బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆరోపించారు. శనివారం (12.04.2024) తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్ముకుందని, రూ. 2183 మద్దతు ధర ఉంటే రూ. 1900 కే అమ్మారని, ఎంఎస్‌పీ కంటే తక్కువ ధరకు అమ్మారని, ఈ గ్లోబల్ టెండర్లు ఆంధ్రవాళ్లకు ఇచ్చారని, టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల వాటా ఎంతో చెప్పాలని జీవ‌న్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ వడ్ల స్కామ్ మీద సీబీఐ, ఈడీ సుమోటోగా కేసు నమోదు చేసి ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేశారు. తాము కూడా దీనిపై ఈడీ, సీబీఐలకు లేఖ రాస్తామన్నారు. బీజీపీ కూడా ఈ స్కామ్‌పై నోరు మెదపడం లేదని, ఇందులో బీజేపీ వాళ్ళ వాటా కూడా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రజలకు 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కార్తీక దీపం సీరియల్ లాగా కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఆర్‌ కుంభకోణం జరుగుతుందని, ఆర్‌ఆర్‌ అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి టాక్స్‌ అని అభివర్ణించారు.

కాంగ్రెస్ అంటనే కరప్షన్ పార్టీ

ఐఎన్‌సీ అంటే ఇండియ‌న్ నేష‌న‌ల్ క‌ర‌ప్ష‌న్ పార్టీ అని మాజీ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిది స్కీమ్‌ల పాల‌న కాదని, స్కామ్‌ల పాల‌న అని విమ‌ర్శించారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ప్రతి ఊర్లో కేసీఆర్ 7,429 కొనుగోలు కేంద్రాలు పెడితే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి 5 వేల దాకా మాత్ర‌మే పెట్టారని, దీంతో రైతులు ఆగ‌మై పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ధ‌న సేక‌ర‌ణ మీద పెట్టిన దృష్టి ధాన్యం సేక‌ర‌ణ మీద కాంగ్రెస్ ప్ర‌భుత్వం పెట్ట‌డం లేదని, కాంగ్రెస్ అంటేనే క‌రప్ష‌న్ పార్టీ అని, ఫాద‌ర్ ఆఫ్ ద క‌రప్ష‌న్ పార్టీ అని జీవ‌న్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి 420 స్కీములు డిసెంబర్ 9 కే ఇస్తామని చెప్పి డైవర్ట్ చేస్తున్నాడని, ఇప్పుడు ఇంకో 25 పథకాలు ఇస్తామని అంటున్నారని, కాంగ్రెస్ పార్టీ పథకాలు మరిచిపోయేలా రేవంత్ చేష్టలు ఉన్నాయని విమర్శించారు.

ఇళ్లు కట్టుకుందామంటే ఇల్లుకి పర్మిషన్ ఇవ్వడం లేదని, డబ్బులు ఇస్తేనే పర్మిషన్ అని, ఇచ్చిన డబ్బులను ఢిల్లీకి మోస్తున్నారని మండిపడ్డారు. తులం బంగారం ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మహిళలను మోసం చేస్తున్నారన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఉద్దేర ముఖ్యమంత్రి అన్నారు. చంద్రబాబు నాయుడు, భీమవరం అల్లుడు దగ్గరే సీఎం రేవంత్ రెడ్డి రిమోట్ ఉన్నదని ఆరోపించారు.

కోళ్ల డాక్టర్ రంజిత్‌రెడ్డి

చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థి రంజిత్ రెడ్డి చ‌ప్రాసీ ఉద్యోగానికి కూడా ప‌నికిరాడని మాజీ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి విరుచుకుప‌డ్డారు. అక్రమాస్తులు..భూకబ్జాలకు పాల్పడిన రంజిత్‌రెడ్డి ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతుందోనన్న భయంతో ఆ పార్టీలోకి వెళ్లాడని విమర్శించారు. రంజిత్ రెడ్డికి బీఆరెస్‌ పార్టీ ఏం త‌క్కువ చేయలేదని, కోళ్లు, గుడ్లు అమ్ముకునే రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి కేసీఆర్‌ ఎంపీని చేశారన్నారు.

నువ్వే నా గురువు, నువ్వే నా ఫాద‌ర్ అని రోజు కేసీఆర్‌కు చెప్పేవాడని, నా క‌న్న తండ్రి కంటే కేసీఆరే గొప్ప అని చెప్పాడని, కవిత అరెస్టయితే నవ్వుకుంటు పార్టీ మారిన విశ్వాస ఘాత‌కుడు రంజిత్ రెడ్డి అని, ఆయన డాక్ట‌ర్ రంజిత్ రెడ్డి కాదని, కోళ్ల‌కు సూదులిచ్చే డాక్ట‌ర్ రంజిత్ రెడ్డి అన్నారు. కోళ్ల దాణా అమ్మి.. 300 ఎక‌రాల భూములు గుంజుకున్నాడని, చాలా మందిని మోసం చేసిండని.. ఆ జాబితా కూడా త్వ‌ర‌లోనే బ‌య‌ట‌పెడుతానన్నారు.

రంజిత్‌రెడ్డిది చేవేళ్ల ఆయ‌న ఊరు కాదని, క‌రీంన‌గ‌ర్‌లో పుట్టిండు.. వ‌రంగ‌ల్‌లో బ‌తికిండు.. హైద‌రాబాద్‌లో కోళ్ల దుకాణం పెట్టాడని, ఆయ‌న‌కున్న ఆస్తుల‌ను అఫిడ‌విట్‌లో పొందుప‌ర‌చ‌లేదని ఆరోపించారు. రంజిత్‌రెడ్డి ఇవాళ ఎలాగైతే కేసీఆర్‌ను మోసం చేసిండో.. రేపు రేవంత్‌ను కూడా అలాగే మోసం చేస్తాడని జీవ‌న్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

Latest News