విధాత: ఫిలిప్పీన్స్ (Philippines) లోని ఒక యూనివర్సిటీలో బాంబు పేలుడు జరిగింది. అల్లర్లతో అతలాకుతలమవుతున్న దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని మారావీ అనే నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో నలుగురు చనిపోగా 50 మంది గాయాలపాలయ్యారు. యూనివర్సిటీలోని ఒక ప్రార్థనా మందిరంలో క్యాథలిక్ క్రైస్తవులు గుమిగూడి ఉండగా ఈ బాంబు దాడి జరిగింది. ముస్లిం మెజారీటీగా ఉన్న ఈ నగరంలో ఇస్లామిక్ ఉగ్రవాదం హెచ్చుమీరిందని తాజా నివేదికలు చెబుతున్నాయి.
2017లో ఈ నగరాన్ని ఏకంగా అయిదు నెలల పాటు మిలిటెంట్లు చేజిక్కించుకుని పాలన సాగించారు. ఇది కచ్చితంగా ఉగ్రదాడేనని.. ఏ వర్గాల మధ్యా ఘర్షణ కాదని ఘటన జరిగిన మందగాన్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. మత కార్యక్రమానికి హాజరైన వారిపై దాడి జరిగిందని..దీనిని ఖండిస్తున్నామని తెలిపింది.
ఇస్లామిక్ ఉగ్రవాదుల పనే అనే కోణాన్ని కొట్టిపరేయలేమని.. దర్యాప్తును వేగంగా చేస్తున్నామని బ్రిగేడియర్ జనరల్ ఆలన్ నోబ్లోజా వెల్లడించారు. మిలిటెంట్లు పేలుడుకు ఉపయోగించినవి ఐఈడీలా లేక గ్రనేడ్ల అన్నదానిపై స్పష్టత లేదని ఆయన అన్నారు. పేలుడు జరిగిన వెంటనే సైన్యం, పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని ఉమ్మడి దర్యాప్తును ప్రారంభించారు. మరోవైపు క్రైస్తవులు, ముస్లింలు సంయమనంతో ఉండాలని.. శాంతిని పాటించాలని నగర మేయర్ పిలుపునిచ్చారు. కాగా తాము దవ్‌లా ఇస్లామియా ఫిలిప్పీన్స్ అనే ఇస్లామిక్ సంస్థకు చెందిన 11 మంది మిలిటెంట్లను మట్టుబెట్టామని సైన్యం ప్రకటించిన 24 గంటల్లోనే ఈ దాడి జరిగింది. దీంతో దీనిని ప్రతీకార దాడిగా ఆ దేశ భద్రతా నిపుణులు పేర్కొంటున్నారు.