విధాత: పహల్గామ్ ఉగ్రదాడి పరిణామాల క్రమంలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ అధికారులు పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేసినట్లు వెల్లడించారు. సెలవులపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని మిలిటరీ విభాగాల్లో జమ్మూకశ్మీర్‌లో సైన్యాన్ని పెంచారు. అలాగే శ్రీనగర్‌లోని విమానాశ్రయంలో సైన్యం భద్రతను కూడా పెంచారు. ఉగ్రవాదుల కోసం వేట మొదలు పెట్టారు. అలాగే జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిపైన…సరిహద్దులలో సైన్యం పటిష్టతను పర్యవేక్షించేందుకు భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేదీ కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. శ్రీనగర్, ఉదమ్‌పూర్‌లో పర్యటన సాగించారు. కశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ, పహల్గాం దాడి నేపథ్యంలో భద్రతా బలగాలకు కీలక సూచనలు చేశారు.
పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భారత్, పాక్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పాక్‌తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచివెళ్లాలని ఆదేశించింది. పాకిస్తాన్ కూడా ప్రతికార చర్యలకు దిగింది. సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కనబెడుతున్నట్లు ప్రకటించింది. తమ గగనతలంలో భారత్‌కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపేస్తున్నట్లు వెల్లడించింది.
సరిహద్దుల్లో భారత్ సైన్యంపై పాక్ దళాల కాల్పులు
పహల్గాం ఉగ్ర దాడి అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రికత్తలు సరిహద్దుల్లో యుద్ద వాతావరణాన్ని రగిలిస్తుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ నియంత్రణ రేఖ (ఎల్ వోసీ) వెంట పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి భారత్ సైన్యంపై కాల్పులకు తెగబడింది. పాక్ సైన్యం కాల్పులకు భారత ఆర్మీ ధీటుగా బదులిస్తోంది. ఇరువైపుల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని ఆర్మీ అధికారులు వెల్లడించారు.
సింధు నది జలాల నిలిపివేత
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ తో సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్ తాజాగా సింధు నది నీటి ప్రవాహాన్ని నిలిపివేసింది.
నాలుగు గేట్లను మూసివేసినట్లు అధికారులు వీడియో విడుదల చేశారు.