Holidays | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉప ఎన్నికకు 11వ తేదీన పోలింగ్ జరగనుంది. 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఉప ఎన్నిక పోలింగ్, ఓట్ల లెక్కింపు నేపత్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో నవంబర్ 10, 11, 14వ తేదీల్లో ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలున్న కార్యాలయాలు, సంస్థలకు పెయిడ్ హాలిడే ప్రకటించారు.
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఈ ఏడాది జూన్‌లో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతా గోపీనాథ్‌కు కేసీఆర్ టికెట్ కేటాయించారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉందని చెప్పొచ్చు.
