Telangana Cabinet | ఆధ్యాత్మికతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ).. కాశీ( Kashi ), శబరిమల( Sabarimala ) వెళ్తే తెలంగాణ భక్తులకు( Telangana Devotees ) శుభవార్త వినిపించారు. తెలంగాణ భక్తులకు వసతి సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని కాశీ, శబరిమలలో రూ. 25 కోట్ల చొప్పున రెండు వసతి గృహాలను నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు( Harish Rao ) మీడియాకు వెల్లడించారు.
సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరు కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకుంటారు. తెలంగాణ నుంచి భక్తులు కాశీకి అధిక సంఖ్యలో తరలి వెళ్తుంటారు. ఈ క్రమంలో భక్తులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం రూ. 25 కోట్లతో ఒక వసతి గృహాన్ని నిర్మించాలని నిర్ణయించిందన్నారు. ఈ మేరకు త్వరలోనే కాశీలో తెలంగాణ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాశీలో పర్యటిస్తారని తెలిపారు. ప్రభుత్వ స్థలం కోసం పరిశీలన చేస్తామన్నారు. ఒక వేళ ప్రభుత్వం స్థలం లభించకపోతే ప్రయివేటు స్థలం కొనైనా వసతి గృహాం నిర్మిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
కేరళలోని శబరిమలకు కూడా తెలంగాణ నుంచి అయ్యప్ప భక్తులు అధిక తరలి వెళ్తుంటారని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. తెలంగాణ నుంచి వెళ్లే అయ్యప్ప భక్తులకు అక్కడ ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో అక్కడ కూడా రూ. 25 కోట్లతో వసతి గృహాన్ని నిర్మించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నదని వెల్లడించారు. ఇప్పటికే కేరళ సీఎంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై మాట్లాడారని, స్థలం ఇచ్చేందుకు వారు అంగీకరించారని తెలిపారు. స్థలం ఖరారైన వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, పనులు ప్రారంభిస్తామన్నారు.