విధాత: తెలంగాణలో బీఆరెస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకానుండటంతో గత ప్రభుత్వం నామినేట్ చేసిన పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు, సలహాదారులు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. సోమవారం రాజీనామాలు చేసిన వారిలో రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమ భరత్ కుమార్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు. వీరితోపాటు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, టెక్స్ టైల్స్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్ అనిల్ కూర్మాచలం, ట్రైకార్ చైర్మన్ రామచంద్రనాయక్, గిరిజన ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ వలియా నాయక్, రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి కార్పొరేషన్ (రెడ్‌కో) చైర్మన్ వై సతీష్ రెడ్డి కూడా రాజీనామాలు సమర్పించారు.
రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్, రాష్ట్ర టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్ జగన్మోహన్ రావు, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నే క్రిశాంక్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా ఇతర కార్పొరేషన్ల చైర్మన్లు, సలహాదారులు తమ పదవులకు రాజీనామాలు చేశారు.
రమణాచారి, దేవులపల్లి ప్రభాకర్‌రావు కూడా
తెలంగాణ పోలీస్‌లోని యాంటి నక్సల్ ఇంటెలిజెన్స్ వింగ్, ఎస్‌ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ టీ ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. టాస్క్ ఫోర్స్ డీసీపీగా, ఓఎస్డీగా పని చేసిన రాధాకిషన్ రావు, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. ట్రాన్స్‌కో జెన్‌కో చైర్మన్, సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు కూడా తన పదవికి రాజీనామా చేశారు.