Site icon vidhaatha

Guwahati | ఇండో-భూటాన్ సరిహద్దులో బంగారం సీజ్‌

Guwahati | విధాత‌: దేశ స‌రిహ‌ద్దుల్లో భారీగా బంగారం ప‌ట్టుప‌డింది. 2.60 కిలోల బరువున్న 103 బంగారు బిస్కెట్లను గౌహతి కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు సీజ్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అస్సాంలోని దర్రంగా ఎల్‌సీఎస్‌ సమీపంలోని ఇండో-భూటాన్ సరిహద్దులో ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు బుధవారం తెలిపారు. బంగారు బిస్కెట్ల విలువ రూ.1.32 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.


మంగళవారం పట్టుబడిన నిందితుల నుంచి రూ.2.27 లక్షలు, రూ.1.12 లక్షల విలువైన విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల ప్రారంభంలో అస్సాం పోలీసుల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) గువాహటి శివార్లలోని జోరాబత్ ప్రాంతంలో నకిలీ బంగారం, నకిలీ భారతీయ కరెన్సీ నోట్ల స‌ర‌ఫ‌రా చేసే స్మ‌గ్లింగ్ ముఠాను ప‌ట్టుకున్న‌ది. ముగ్గురు స‌భ్యుల‌ను అరెస్టు చేసింది.


డీఐజీ (STF), పార్థ సారథి మహంతి మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ బంగారం స‌ర‌ఫ‌రాకు సంబంధించిన స‌మాచారం ఆధారంగా బసిస్తా పోలీస్ స్టేషన్ పరిధిలోని జోరాబత్‌లోని 8వ మైలు ప్రాంతంలో దాడి చేశామని చెప్పారు. ముగ్గురు వ్యక్తులతో పాటు ఒక ఫోర్-వీలర్, 1.627 కిలోల బరువున్న ఒక పడవ ఆకారపు నకిలీ బంగారం, రూ. 500 విలువ గల 150 న‌కిలీ క‌రెన్సీ, రెండు మొబైల్ ఫోన్ల‌ను పట్టుకున్న‌ట్టు వెల్లడించారు.

Exit mobile version